Friday, December 27, 2024

సింగ్భూమ్‌లో తొలి ఓటు ఆటుపోట్లు

- Advertisement -
- Advertisement -

నక్సల్స్ ప్రబావిత ప్రాంతంలో పోలింగ్ ఏర్పాట్లు
హెలికాప్టర్లలోనే సిబ్బంది సరంజామా తరలింపు
ప్రతి ఓటూ పడాలనే పట్టుతో అధికారులు

రాంచీ : జార్ఖండ్‌లోని సింగ్భూమ్ లోక్‌సభ స్థానంలోని మారుమూల ప్రాంతాలలో తొలిసారి ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ జరుగనుంది. మావోయిస్టుల పెట్టని కోటగా మారిన ఈ ప్రాంతం ఇంతకాలం బ్యాలెట్ నిషిద్ధ ప్రాంతంగా చలామణి అవుతూ వచ్చింది. మే 13వ తేదీన జరిగే సింగ్భూమ్ లోక్‌సభ స్థానంలోకి వచ్చే మారుమూల ప్రాంతాలలో ఈసారి ఓటింగ్ నిర్వహణకు అధికారులు సంకల్పించారు. అయితే ఇదేమంతా తేలికైన విషయం కాదు. ఆసియాలోనే అత్యంత దట్టమైన సాల్ అడవులలో ఉండే సరందా ప్రాంతానికి ఎన్నికల సిబ్బందిని హెలికాప్టర్లలో తరలించాల్సిందే. మొత్తం 118 పోలింగ్ బూతులు ఏర్పాటు అవుతాయి.

దాదాపు రెండు రెండున్నర దశాబ్దాలుగా ఓటింగ్ జరగని ప్రాంతాలను గుర్తించినట్లు వెస్ట్ సింగ్భూమ్ డిప్యూటీ కమిషనర్ , జిల్లా ఎన్నికల నిర్వహణాధికారి కూడా అయిన కుల్దీప్ చౌదరి తెలిపారు. ఈ ప్రాంతాలలో మావోయిస్టు ప్రాబల్యం ఎక్కువగా ఉండటం వల్ల , ఎన్నికల బహిష్కరణ పిలుపు ప్రభావం బాగా కన్పించిందని, దీనితో పలు సార్లు ఎన్నికల దశల్లో ఇక్కడ పోలింగ్ ఏర్పాట్లకు దిగలేకపోయ్యారని ఆయన వివరించారు. జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్ ఇతర ప్రాంతాల్లో క్రమేపీ నక్సల్స్ దళాల ఏరివేతల క్రమంలో, నక్సల్స్ పలు చోట్ల పట్టుకోల్పోయ్యారు. అయితే సామాజిక, భౌగోళిక కారణాలతో, నక్సల్స్ ప్రజలకు సన్నిహితం కావడంతో సరందా ప్రాంతం ఎన్నికల బహిష్కరణ ప్రాంతంగా మారింది. చాలా క్లిష్టమమైన రోబోకెరా, బింజ్, తల్కోబద్, జరాయ్‌కెలా వంటి పలు ప్రాంతాలలో హెలికాప్టర్ల ద్వారా పోలింగ్ సిబ్బందిని తరలించడం జరుగుతుంది.

అయినప్పటికీ మరికొన్ని చోట్లకు వెళ్లాలంటే పోలింగ్ సిబ్బంది తమ పోలింగ్ సరంజామాలతో పాటు కనీసం నాలుగు అయిదు కిలోమీటర్ల దూరం నడిచివెళ్లాల్సిందే. తల్కోబద్ మరో 20 వరకూ గ్రామాలను నక్సల్స్ రాజ్యాధికార విముక్తి ప్రాంతాలుగా ప్రకటించారు. అయితే అధికార యంత్రాంగం రంగంలోకి దిగింది. భద్రతా బలగాలను భారీ స్థాయిలో తరలించడం, అనకొండ ఆపరేషన్ వంటి చర్యలతో పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ప్రాంతంలో ఒకచోట కేవలం 62 మంది ఓటర్లు ఉన్నారు. వీరంతా కూడా వంద సంవత్సరాలు పైబడ్డ వారే. అయితే ఏ ఒక్క ఓటరు కూడా తన హక్కును వదులుకోకుండా చూడటమేతమ సంకల్పం అని డిప్యూటీ కమిషనర్ చౌదరి స్పష్టం చేశారు.

ఆయన ఆధ్వర్యంలో ఎన్నికల సిబ్బంది, అధికార యంత్రాంగం చాలా కాలం నుంచే ఓటు హక్కు గురించి ప్రజలలో విరివిగా ప్రచారం చేస్తూ వచ్చింది. ఓటేస్తే కలిగే ప్రయోజనాల గురించి ప్రజలకు నచ్చచెప్పారు. ఇక సింగ్భూమ్ ఆదివాసీలకు రిజర్వ్ అయిన ఎస్‌టి స్థానం. ఇక్కడ మొత్తం ఓటర్లు 14.32 లక్షలు, కాగా వీరిలో 7.27 లక్షల మంది మహిళలు. ఈ నియోజకవర్గంలో ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. జార్ఖండ్‌లో లోక్‌సభ ఎన్నికలు నాలుగు దశలలో జరుగుతాయి. మే 13, 20, 25, జూన్ 1వ తేదీలలో ఓటింగ్ ఉంటుంది. సిట్టింగ్ ఎంపి గీతా కోడా ఇక్కడి నుంచి ఈసారి బిజెపి తరఫున తిరిగి పోటీ చేస్తున్నారు. ఆమె మాజీ సిఎం మధుకోడా భార్య. ఇంతకు ముందటి లోక్‌సభ ఎన్నికలలో ఆమె జార్ఖండ్ నుంచి ఏకైక కాంగ్రెస్ ఎంపిగా ఉన్నారు. అయితే ఇటీవలే బిజెపిలో చేరారు. ఇప్పటివరకూ ఇండియా కూటమి తరఫున ఎవరి పేరును ప్రకటించలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News