Tuesday, December 24, 2024

ఉమ్మడి పౌర స్మృతి రాజకీయం!

- Advertisement -
- Advertisement -

ఉమ్మడి పౌర స్మృతి సహితం కొన్ని వ్యక్తిగత ఎంపికలు, సామాజిక ఆచారాలను చట్టబద్ధం చేయడానికి ప్రయత్నిస్తుంది. సమాజంలో లోతుగా పాతుకుపోయిన ఆచారాలను చట్టపరంగా మార్చే ప్రయత్నం చేయడం సామాజిక, రాజకీయ విభేదాలను మాత్రమే పెంచి పోషిస్తుంది. తాజాగా కర్ణాటకలో జరిగిన ఒక దుర్ఘటనను ఈ సందర్భంగా గుర్తించాలి. కోలారు తాలూకా బోడగుర్కి గ్రామంలో డిగ్రీ చదువుతున్న ఒబిసి వర్గానికి చెందిన 20 ఏళ్ళ యువతి ఓ ఎస్‌సి యువకుడిని ప్రేమించి, పెళ్లి చేసుకునేందుకు సిద్ధపడడంతో ఆమెను అల్లారుముద్దుగా పెంచుకున్న ఆమె తండ్రి హత్య చేసినట్లు వార్తలు వచ్చాయి. ఆ తండ్రికి న్యాయస్థానం మరణ శిక్ష లేదా జీవిత ఖైదు విధించవచ్చు. కానీ వారి మనస్సులలో పాతుకుపోయిన కుల దురహంకారాన్ని చట్టాలతో పోగొట్టగలమా?

దేశంలో పౌరులందరికీ ఒకే విధమైన పౌరస్మృతి ఉండాలని స్వాతంత్య్ర ఉద్యమం కాలంలో, ఆ తర్వాత మన రాజ్యాంగ నిర్మాతలు కూడా ఆశించారు. ఏదేమైనా అందుకోసం నిజాయితీతో ప్రయత్నాలు జరగకపోవడంతో గత 75 ఏళ్లుగా ఒక రాజకీయ నినాదంగా మారిపోయింది. ఇప్పుడు 2024 ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ అంశంపై నరేంద్ర మోడీ ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. తొమ్మిదేళ్ల పాలనలో భారత దేశంలో ఎన్నో అద్భుతాలు సృష్టించామని గత నెల రోజులుగా దేశ వ్యాప్తంగా ప్రచారం చేసుకుంటున్న ప్రభుత్వం ఆ అద్భుతాలతో వచ్చే ఎన్నికల్లో తిరిగి గెలుపొందగలమనే నమ్మకం లేకపోవడంతో మరోసారి భావోద్వేగాలతో ప్రయోజనం పొందే ఎత్తుగడగా ఈ ఆయుధం ప్రయోగిస్తున్నారనే అభిప్రాయం బలపడుతుంది.

ఒక విధంగా చూడాలంటే ఉమ్మడి పౌరస్మృతి అంటే విస్తృతమైన సామాజిక సంస్కరణ. సామాజిక సంస్కరణలను కేవలం చట్టాల ద్వారా సాధించలేము.అందుకు నిజాయితీతో సామాజిక మార్పు కోసం కృషి చేయాల్సి ఉంటుంది. 1975 జూన్ 12న ఎమెర్జెన్సీకి ముందు గుజరాత్‌లో జనతా ఫ్రంట్ విజయం సాధించినప్పుడు అప్పుడే తాను ప్రారంభించిన అవినీతి వ్యతిరేక ఉద్యమంపై పెద్ద విజయంగా అందరూ భావించడాన్ని లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్ వ్యతిరేకించారు. ‘ప్రభుత్వం కాదు సమాజం మారాలి’ అంటూ తన లక్ష్యాన్ని వెల్లడించారు. వరకట్నం, గృహహింస, లింగ వివక్ష, అంటరానితనం వంటి వాటిపై కఠినమైన ఎన్నో చట్టాలున్నాయి. అయినా చెప్పుకోదగిన ప్రయోజనం ఉండటం లేదు. ఢిల్లీలో నిర్భయ సంఘటన అనంతరం అత్యాచారాలకు మరణశిక్ష విధిస్తూ ప్రస్తుత ప్రభుత్వమే కఠినమైన చట్టం తీసుకొచ్చింది. కానీ ఈ చట్టం దేశంలోని మహిళలకు రక్షణ కల్పించలేకపోయింది. కేవలం ప్రచారం కోసం చట్టాలు తీసుకొచ్చి ఆచరణ పట్ల శ్రద్ధ వహించకపోవడంతోనే దుష్ఫలితాలు వస్తున్నాయి. పలు సందర్భాలలో చట్టాలను అమలు చేయలేని ప్రభుత్వ అసమర్ధత సమస్యలను మరింత జటిలం కావిస్తుంది.

ఉమ్మడి పౌర స్మృతి అంటే కేవలం హిందువులకు వర్తించే వ్యక్తిగత చట్టాలను ముస్లింలు, క్రైస్తవులకు వర్తింపచేయడంగా దేశం లో ఒక దురభిప్రాయం నెలకొంది. అందుకనే ఇది మైనారిటీలను అణచివేసే చర్యగా నేడు కొందరు ప్రచారం చేస్తున్నారు. హిందువులు సహితం ప్రస్తుతం తాము పొందుతున్న అనేక ప్రయోజనాలను వదులుకోవలసి ఉంటుందనే అంశాన్ని మరచిపోతున్నారు. అటువంటి పరిస్థితి వస్తే హిందువుల నుండి కూడా ప్రతిఘటన ఎదురవుతుందని గుర్తించాలి. వ్యక్తిగత ప్రాధాన్యతలు, సామాజిక ఆచారాలు ప్రధానంగా నైతిక ప్రమాణాలకు సంబంధించించినవి. వాటికి కొన్ని ప్రామాణికతలను కల్పిస్తూ, వాటిల్లో అన్యాయం, వివక్షలకు అవకాశం ఉన్న అంశాలను మార్చేందుకు ముందుగా సమాజాన్ని సంస్కరణల మార్గంలో తీసుకెళ్లడానికి సామాజిక చైతన్యం, ఉద్యమం అవసరం. అటువంటి ప్రయత్నాలు చేయకుండా ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని సామాజిక అంశాలపై చట్టాలు చేయాలనుకోవడం ప్రతికూల పరిణామాలకు దారితీసే ప్రమాదం ఉందని గ్రహించాలి. కేరళలో వికోమ్ సత్యాగ్రహ శతాబ్ది సందర్భంగా ఒక అంశంను గుర్తు తెచ్చుకుందాము.
దేవాలయాలలో అన్ని కులాలవారిని అనుమతించేందుకు దేశ వ్యాప్తంగా సుదీర్ఘ కాలం తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. అనేక సామాజిక సంఘర్షణలకు దారితీసింది. కానీ కేరళలో రక్తపాతం లేకుండా, సామరస్యంగా ఈ సమస్యను ఎదుర్కొన్న విధానాన్ని మనం ఈ సందర్భంగా ఆదర్శంగా తీసుకోవాలి.

ఈ అంశాన్ని ఓ సామాజిక ఉద్యమంగా చేపట్టి, ప్రజలలో మార్పు తీసుకొచ్చేందుకు చేసిన కృషి ఫలితంగా కేవలం ఒక దశాబ్ద కాలంలో ఆలయ ప్రవేశ ఉద్యమంపై వ్యతిరేకత లేకుండా చేయగలిగారు. పదేళ్ల తర్వాత ట్రావెన్‌కోర్ రాజు తన పరిధిలోని దేవాలయాలను అన్ని కులాలకు తెరుస్తామని ప్రకటించినప్పుడు, శతాబ్దాల నాటి ఆచారంలో మార్పుకు పెద్దగా ప్రతిఘటన రాలేదు. ఉమ్మడి పౌర స్మృతి సహితం కొన్ని వ్యక్తిగత ఎంపికలు, సామాజిక ఆచారాలను చట్టబద్ధం చేయడానికి ప్రయత్నిస్తుంది. సమాజంలో లోతుగా పాతుకుపోయిన ఆచారాలను చట్టపరంగా మార్చే ప్రయత్నం చేయడం సామాజిక, రాజకీయ విభేదాలను మాత్రమే పెంచి పోషిస్తుంది. తాజాగా కర్ణాటకలో జరిగిన ఒక దుర్ఘటనను ఈ సందర్భంగా గుర్తించాలి. కోలారు తాలూకా బోడగుర్కి గ్రామంలో డిగ్రీ చదువుతున్న ఒబిసి వర్గానికి చెందిన 20 ఏళ్ళ యువతి ఓ ఎస్‌సి యువకుడిని ప్రేమించి, పెళ్లి చేసుకునేందుకు సిద్ధపడడంతో ఆమెను అల్లారుముద్దుగా పెంచుకున్న ఆమె తండ్రి హత్య చేసినట్లు వార్తలు వచ్చాయి.

ఆ తండ్రికి న్యాయస్థానం మరణ శిక్ష లేదా జీవిత ఖైదు విధించవచ్చు. కానీ వారి మనస్సులలో పాతుకుపోయిన కుల దురహంకారాన్ని చట్టాలతో పోగొట్టగలమా?.  కీలక పదవుల్లో ఉన్న రాజకీయ నాయకులు సహితం తమ కులాన్ని చూపి ఓట్లు అడుగుతున్నారు. కుల ప్రాతిపదికగా దాదాపు అన్ని రాజకీయ పార్టీలు అభ్యర్థులను ఎంపిక చేస్తున్నాయి. పైగా ఏ కులానికి ఎన్ని సీట్లు ఇచ్చామో ప్రకటనలు ఇస్తున్నాయి. 75 ఏళ్ళ స్వతంత్ర భారత దేశంలో కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఓ దళితుడిని అధ్యక్షుడిగా చేసిన సందర్భాలు రెండే ఉన్నాయి. ఒకటి కాంగ్రెస్‌కు దామోదరం సంజీవయ్య, బిజెపికి బంగారు లక్ష్మణ్. వారిద్దరూ తమ సొంత పార్టీల నుండి వివక్షకు, కుట్రలకు గురయ్యారు. స్వయంగా ప్రధాని ఇందిరా గాంధీ చొరవ తీసుకొని సంజీవయ్యను కర్నూల్ నుండి జనరల్ సీట్ లో లోక్‌సభ ఎన్నికల్లో నిలబెడితే నాటి కాంగ్రెస్ ప్రముఖుడు కోట్ల విజయభాస్కరరెడ్డి నీలం సంజీవరెడ్డి, కాసు బ్రహ్మానందరెడ్డి వంటి వార్ల ప్రోద్బలం తో పట్టుబట్టి మరి ఓడించారు. బంగారు లక్ష్మణ్‌ను సహితం నాటి ప్రధాని వాజపేయి పార్టీ అధ్యక్షుడిగా చేస్తే ఎల్ కె అద్వానీ వంటి వారంతా సహాయ నిరాకరణ జరిపారు. కాంగ్రెస్, బిజెపి నాయకులు కలిసి ఆయనకు అవినీతి కేసులో జైలు శిక్ష పడే విధంగా చేశారు. ‘అసలు ఇందులో కేసు ఏముంది?’ అని ప్రశ్నించిన న్యాయమూర్తే ఆయనకు శిక్ష విధించారు. మన దేశం వైవిధ్యాలకు పెట్టింది పేరు.

ప్రాంతాలు, కులా లు వారీగా వివాహాలు, ఇతర వ్యక్తిగత ఆచారాలలో ఎన్నెన్నో వైవిధ్యాలున్నాయి. హిందువులు పాటించే సంప్రదాయాలు, ఆచారాలలోనే లెక్కలేనన్ని వైవిధ్యాలు ఉన్నాయి. అయితే ఉమ్మడి పౌరస్మృతి సామాజిక జీవనంలో చట్టబద్ధమైన ఆచార వ్యవహారాలను సూచింపవలసి ఉంటుంది. దత్తత, విడాకులు, వారసత్వం, మరెన్నో సమస్యలపై సామాజిక పరస్పర చర్యల పొరలను, సంబంధిత క్లిష్టతలను పరిగణనలోకి తీసుకున్నప్పుడు ఎన్నో సవాళ్లు ఎదురవుతాయి. అలాగే దేశంలోని వివిధ ప్రాంతాలలో సంస్కర్తలు పునరుజ్జీవింప చేసేందుకు, నైతిక ప్రమాణాలను, అనుసరణీయమైన చర్యలను తిరిగి అర్థం చేసుకోవడానికి సుదీర్ఘ సాంస్కృతిక చరిత్రను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఒక ఆచారాన్ని మార్చడానికి చట్టపరమైన అధికారం పరిమిత ప్రయోజనమే చేకూరుస్తుందని గత 75 ఏళ్ళ అనుభవం స్పష్టం చేస్తుంది. సామాజిక ఆచారాలను బలవంతంగా చట్టం ద్వారా మార్చడం అంత సులభం కూడా కాదు. ట్రిపుల్ తలాక్ వంటి చట్టాల ద్వారా వ్యక్తిగత చట్టాలలో వివక్షను తొలగించడం, అందరికీ సమాన న్యాయం అందించే ప్రయత్నం చేయడం వేరు. కానీ అందరికీ ఒకే విధమైన పౌర స్మృతి అమలు చేయడం భిన్నమైన అంశంగా గుర్తించాలి. నేడు ఆర్థికంగా దేశాన్ని ప్రపంచంలో అగ్రగామిగా ఉంచేందుకు వేగవంతమైన ఆర్థిక సంస్కరణలను కోరుకుంటున్నాను.

ఈ సందర్భంగా ‘సులభతరమైన వాణిజ్యం’ గురించి ఎక్కువగా మాట్లాడుతున్నాము. అంటే ఆర్ధిక అంశాలలో ప్రభుత్వ జోక్యం పరిమితంగా ఉండాలని, కేవలం పర్యవేక్షణకు పరిమితం కావాలని స్పష్టం చేస్తున్నాము. ప్రభుత్వం చేయవలసింది పరిపాలన గాని, వ్యాపారం కాదని చెబుతున్నాము. అందుకనే కీలకమైన రక్షణ రంగంలో కూడా 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆహ్వానిస్తున్నాము. జిఎస్‌టి, ఆదాయ పన్ను వంటి వాటి విషయాలలో ప్రభుత్వ నియంత్రణ తగ్గించి, వ్యక్తులే తమకై తామే పన్నును లెక్కించి, కట్టే సౌలభ్యం కల్పించే ప్రయత్నం చేస్తున్నాము. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ కంపెనీలకు అమ్మకాలు పెడుతున్నాము. ఒక వంక ఆర్ధిక రంగం నుండి ప్రభుత్వం నిష్క్రమించే ప్రయత్నం చేస్తూ, మరో వంక వ్యక్తిగత ఆచారాలు, వ్యవహారాల విషయంలో ఉమ్మడి పౌర స్మృతి పేరుతో ప్రభుత్వం జోక్యం చేసుకునే పరిస్థితి కల్పించడం ద్వంద్వ ప్రమాణాలు పాటించడం కాదా? నేడు సామాజికంగా నెలకొన్న వివక్షలు, అన్యాయాలను కేవలం చట్టం ద్వారా పరిష్కరిస్తామనే అపోహలకు ప్రభుత్వం గురికావడం దురదృష్టకరం.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News