Wednesday, March 26, 2025

కమలనాథుల ఎన్నికల బడ్జెట్

- Advertisement -
- Advertisement -

మన దేశంలో రాజకీయ పార్టీల ఎన్నికల ప్రణాళికల్లో సంక్షేమ పథకాలు, ఉచిత వరాలు ఎల్లప్పుడూ ఉంటుంటాయి. అయితే, అధికారంలోకి వచ్చిన తరువాత రాజకీయ పార్టీలు ఆ వాగ్దానాలను నెరవేర్చకపోయినప్పటికీ భారత్‌లో అవి ఎన్నికల ప్రచారంలో అంతర్భాగంగా మారిపోయాయి. గత ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ పార్టీలు ఉచితాల వాగ్దానాలు చేయడంలో ఒకదానిని మించి మరొకటి ముందుకు సాగాయి. 2020 నుంచి పిఎం గరీబ్ కల్యాణ్ యోజన ద్వారా 80 కోట్ల మందికి పైగా పౌరులు ఉచిత రేషన్లు అందుకుంటుండడం, పౌరుల బ్యాంక్ ఖాతాలకు నేరుగా రూ. 34 లక్షల కోట్లు బదలీ చేయడం, పిఎం ముద్ర యోజన కింద 46 కోట్ల మంది రూ. 27 లక్షల కోట్లు మేరకు రుణాలు పొందడం, 63 లక్షల మంది వర్తకులకు పిఎం స్వనిధి పథకం వర్తింపచేయడం వంటి అనేక ఉచిత వరాల పథకాల గురించి నిరుడు పార్లమెంటరీ ఎన్నికల్లో బిజెపి తన మేనిఫెస్టోలో ప్రధానంగా ప్రస్తావించింది.
ఎన్నికలు జరగనున్న అసోం రాష్ట్రంలో 2025-26 రాష్ట్ర బడ్జెట్ ఊహించినట్లుగానే పూర్వపు సంక్షేమ పథకాల కొనసాగింపుతో పాటు అసంఖ్యాకంగా కొత్త ఉచితాలు, పథకాలపై దృష్టి కేంద్రీకరించింది. మొత్తం రూ. 2.63 లక్షల కోట్ల పెట్టుబడిలో నెలకు రూ. 15 వేల వరకు ఆర్జిస్తున్న వ్యక్తులకు వృత్తి పన్ను మినహాయింపు, రాష్ట్ర విశ్వవిద్యాలయాల పట్టభద్రులకు నెలకు రూ. 2500 గ్రాంట్, నెలకు 120 యూనిట్ల లోపు విద్యుత్ వాడుతున్న వినియోగదారులకు విద్యుచ్ఛక్తి రేట్లలో రూ. 1 తగ్గింపు, రాష్ట్రంలోని 6.8 లక్షల మంది తాత్కాలిక, శాశ్వత తేయాకు తోట కార్మికులకు ఒక్కొక్కరికి రూ. 50 వేల వరకు ఏక విడత ఆర్థిక సహాయం, మహిళల స్వయం సహాయక బృందాల్లోని వ్యాపారవేత్తలకు మూలధనం సమకూర్చే పథకం వంటివి చేర్చారు.బిజెపి సారథ్యంలోని అసోం ప్రభుత్వం సాంఘిక సంక్షేమానికి గణనీయ ప్రాధాన్యం ఇవ్వడమే కాకుండా ఉచితాలు, ఆర్థిక సహాయం, లక్షిత బృందాలకు ప్రత్యక్ష ప్రయోజనాల ద్వారా తన ఓటర్ హితవిధానాలకు మరింత పుష్టి చేకూర్చింది.
తేయాకు తోటల కార్మికులకు వేతనాలను పెంచడంతో పాటు బడ్జెట్‌లో తేయాకు తోటల కార్మికుల సంక్షేమానికి రూ. 342 కోట్లు కేటాయించడం, 6.8 లక్షల మంది శాశ్వత, తాత్కాలిక తేయాకు తోటల కూలీలకు రూ. 5000 మేరకు ఏక విడత ఆర్థిక సహాయం సమకూర్చడం వంటివి ఉన్నాయి. ‘అన్న సేవ సే జన్ సేవ’ పథకం కింద, 2025 అక్టోబర్ నుంచి రూ. 25 ధరకు కిలో ఎర్ర కందిపప్పు, రూ. 20 ధరకు కిలో చక్కెర, రూ. 10 ధరకు కిలో ఉప్పు సహా సబ్సిడీ ధరలకు అత్యవసర ఆహార సరకులు సరఫరా చేస్తారు. అదనంగా, రూ. 300 కోట్ల లక్షిత సబ్సిడీ కార్యక్రమం గృహ కేటగిరీ, జీవన్ ధార వినియోగదారులకు యూనిట్‌కు రూ. 1 వంతున విద్యుత్ ఖర్చులు తగ్గిస్తారు. కొత్త స్మార్ట్ మీటర్ విధానం పట్ల జనంలో ఒకింత అసమ్మతి వ్యక్తం అయినందున ఎన్నికలకు ముందే దానిని అమలు చేస్తారు. రైతులు మార్కెట్ ధరలను మించి ధాన్యం, మొక్కజొన్న పంటలకు క్వింటాల్‌కు రూ. 250 మేరకు, ఆవాలకు క్వింటాల్‌కు రూ. 500 మేరకు బోనస్ పొందుతారు. అదనంగా 500 రైతు ఉత్పత్తిదారు సంస్థలు (ఎఫ్‌పిఒలు) ఒక్కొక్కటి వ్యవసాయ వాణిజ్యం, ఉమ్మడి సేద్యం ప్రోత్సాహం నిమిత్తం ముఖ్యమంత్రి ఉత్కర్ష్ యోజన కింద రూ. 10 లక్షలు అందుకుంటాయి.
తరతరాల సామూహిక సేద్యం నుంచి మళ్లడానికి రాష్ట్రం నిరాకరణకు ఇది మరొక సూచిక. ఉదాక్సిన్ భకత్స్ పథకం సాంప్రదాయక మత నాయకులకు నెలకు రూ. 1500 సమకూరుస్తుంది, ఇక అస్సాం దర్శన్ పథకం 17 వేలకు పైగా మత సంస్థలు, 25 వేల నామ్‌ఘర్‌లకు రూ. 3 లక్షలు మంజూరు చేస్తుంది. సాంఘిక భద్రతను విస్తరిస్తూ ఒరుణోదయ్ 3.0 ఇప్పుడు 37.2 లక్షల మంది లబ్ధిదారులకు వర్తిస్తుంది. కుటుంబం సుస్థిరత సాధనకు నెలవారీ ఆర్థిక సహాయాన్ని ఇది అందజేస్తుంది. జాతీయ వితంతు పింఛన్ పథకం కింద వితంతువులుకూడా ఒరుణోదయ్ లబ్ధిదారులతో సమానంగా ప్రయోజనాలు పొందుతారు.
ఇతర రాష్ట్రాల నుంచి అసోంకు మృతుల రవాణా ఖర్చులు భరించడం ద్వారా వారి గౌరవానికి భంగం వాటిల్లకుండా చూడాలని కూడా ప్రభుత్వం యోచిస్తోంది. అది పవిత్ర భావన అయినప్పటికీ ఆచరణ సాధ్యంకాని, ఆర్థికంగా ప్రశ్నార్థకమైన విధానం. అది అభివృద్ధి అవసరాల నుంచి సార్వత్రిక నిధులను మళ్లించడమే అవుతుంది. అయితే, అత్యంత అసంబద్ధ ప్రకటన ఏమిటంటే నిరుద్యోగులకు ఉచితాల కల్పన పథకం. ‘ఉద్యోగ అన్వేషకులకు సాయం’ నిమిత్తం ఒక సంవత్సరం వరకు ప్రభుత్వ విశ్వవిద్యాలయాలకు చెందిన 2025 పట్టభద్రులకు నెలకు రూ. 2500 వంతున సమకూర్చాలన్నది ముఖ్యమంత్రి జీవన్ ప్రేరణ పథకం లక్షం.
గౌహతి హైకోర్టు నిరుడు అక్టోబర్‌లో ప్రభుత్వ ప్రాధాన్యతలను ప్రశ్నించింది. రెండు సంవత్సరాల క్రితం చేసిన పనికి ఒక కాంట్రాక్టర్‌కు బిల్లు చెల్లించకుండా ఉచితాలు అందజేస్తున్నందుకు అసోం ప్రభుత్వాన్ని హైకోర్టు విమర్శించింది. సుమారు రెండు సంవత్సరాల క్రితం పూర్తి చేసిన పనికి తనకు రావలసి ఉన్న బిల్లులను చెల్లించనందుకు పిటిషనర్ రిషి గుప్తా దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను కోర్టు విచారిస్తూ ఆ వ్యాఖ్య చేసింది. అంతకుముందు ఒక ఉత్తర్వులో కోర్టు 2024 సెప్టెంబర్ 30 నాటికల్లా పెండింగ్ బకాయిలు తీర్చాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ‘ఉచితాల’ చెల్లింపునకు అసోం ప్రభుత్వ శక్తిపై న్యాయమూర్తి అపనమ్మకం వ్యక్తం చేస్తూనే కాంట్రాక్టర్‌కు చెల్లింపులు జరపకపోవడాన్ని నిలదీశారు. 25 వేల మంది తొలిసారి వ్యాపారవేత్తలకు రూ. 75 వేల గ్రాంట్ చెల్లింపునకు సంబంధించిన మీడియా వార్తలను ఆయన ఉటంకించారు. నిధుల కొరత గురించి ఒక వైపు మాట్లాడుతున్న రాష్ట్ర ప్రభుత్వం మరొక వైపు అటువంటి పథకాలను ఎలా అమలుపరుస్తోందని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాల నిర్వహణ, ప్రాధాన్యతలలో వైరుధ్యాన్ని ఆయన ఎత్తిచూపారు.
నిరుద్యోగిత సమస్య పరిష్కారానికి ఏమాత్రం ప్రయత్నించకుండా ఎన్నికల ప్రాధాన్య ఉచితాల ప్రకటనకు ఇది ఒక మచ్చుతునక. ఉద్యోగార్థులకు అండగా నిలిచే పథకంగా పేర్కొంటూనే నైపుణ్యాభివృద్ధిని లేదా క్రియాశీలక ఉద్యోగాన్వేషణను ప్రోత్సహించడం కన్నా ఆధారపడడాన్ని ఇది పెంపొందిస్తోంది. తాత్కాలికంగా నగదు పంపిణీతో ఉద్యోగాల సృష్టికి గాని, ఉద్యోగార్హతకు గాని ఇది దోహదం చేయదు. దానికి బదులు సమస్యను మరింత ఆలస్యం చేస్తుంది. అదే సమయంలో రాష్ట్రంపై దుర్భరమైన ఆర్థిక భారాన్ని మోపుతుంది. అసోం బడ్జెట్ 202526 రాష్ట్ర ప్రభుత్వ విభజనవాద అజెండాను ప్రతిబింబిస్తోంది. ‘స్వదేశీయుల పరిరక్షణ’ పేరిట ముస్లింలను, ముఖ్యంగా బెంగాలీ మాట్లాడే ముస్లింలను అది లక్షంగా చేసుకుంటున్నది. వారికి భూమి అమ్మకంపైన ఆంక్షలు విధించడం, ఖాళీ చేయించడం, పునరావాస విధానాలు రూపొందించడం వంటివి ప్రభుత్వం అనుసరిస్తోంది. హిమంత బిశ్వ శర్మ ప్రభుత్వం రాష్ట్రంలో తిరిగి అధికారంలోకి వచ్చే విధంగా హిందువుల ఓట్లు మరింతగా సమీకరించేందుకు రాష్ట్ర బిజెపి ప్రభుత్వం ఈ ఏడాది బడ్జెట్‌ను ఉపయోగించుకున్నది.
వ్యక్తుల మధ్య అంతర్ మత భూమి బదలీల కేసులు అన్నిటినీ ‘రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం తరువాతే అమలులోకి తీసుకువస్తాం’ అని ఆర్థిక శాఖ మంత్రి అజంత నియోగ్ ప్రకటించారు. బడ్జెట్ ప్రతిపాదన అనంతరం అసోం సిఎం శర్మ మీడియాతో మాట్లాడుతూ, అసోం అత్యంత సున్నిత రాష్ట్రం అయినందున అన్ని రకాల మత కల్లోలాల నివారణకు ప్రభుత్వం భూముల అంతర్ మత బదలీని నిరుడు నిషేధించిందని తెలియజేశారు. అటువంటి నిషేధాలు రాజ్యాంగం ప్రకారం కొనసాగజాలవని సిఎంకు తెలుసు. ప్రభుత్వం ఇప్పుడు అంతర్ మత భూముల క్రయవిక్రయాలను అనుమతించిందని, అయితే, ప్రతి ప్రతిపాదనను తాము నిశితంగా పరిశీలించడానికి వీలుగా రాష్ట్ర ప్రభుత్వ ఆమోదంతోనే అవి జరుగుతాయని ఆయన వివరించారు. భారతీయ రాజ్యాంగం కింద అనుమతించని భూములు, ఆస్తుల కొనుగోలుకు ముస్లింల హక్కులను చేజిక్కించుకోవడం వంటి పథకాల అమలులో తన నేర్పరితనాన్ని అసోం సిఎం ప్రదర్శిస్తున్నారు. బడ్జెట్‌లో చేసిన మరొక ప్రకటన ప్రస్తుతం గౌహతిలో ఉన్న పదవ అసోం పోలీస్ బెటాలియన్‌ను నిరుడు హింసాత్మక రీతిలో ఖాళీ చేయించిన ప్రదేశానికి మార్చడం. నిరుడు సెప్టెంబర్‌లో ప్రకటిత ఆదివాసీ ప్రాంతం దక్షిణ కామరూప్ పరిధిలో సోనాపూర్‌లోని కచుతాలి గ్రామంలో ఖాళీ చేయించే కార్యక్రమంలో 500 పైచిలుకు బెంగాలీ సంతతి ముస్లింల ఇళ్లను కూల్చివేశారు. ఆ సంఘటనల్లో ఇద్దరు వ్యక్తులు మరణించారు. బెంగాలీ మాట్లాడే ఆ ముస్లింలు స్వాతంత్య్రానికి పూర్వమే సోనాపూర్‌లో స్థిరపడ్డారు. ఆ తరువాత బ్రహ్మపుత్ర నది కోతకు వారు భూములు కోల్పోయారు. ఆ నిర్వాసిత పౌరులనకు పునరావాసం కల్పించడానికి బదులు రాష్ట్ర ప్రభుత్వం వారిని సందేహాస్పద పౌరులుగా పేర్కొంటూ ఖాళీ చేయించింది.
బెంగాలీ సంతతి ముస్లింలు ప్రాథమిక నివాసులుగా ఉన్న మిసింగ్‌ల, దేవ్‌రీలు, నేపాలీలు, కొచారీలు వంటి ఇతర సమాజాలు కూడా నివసిస్తున్న పల్లపు వరద ప్రమాదానికి గురయ్యే నదీతీరాలైన చార్ ప్రాంతాల సర్వేను ప్రభుత్వం ప్రారంభిస్తుందని ఆర్థిక శాఖ మంత్రి ప్రకటించారు. చార్ భూమిలో దేని పరిష్కారాన్నైనా ‘భాగస్వాములతో చర్చించిన తరువాతే, కాలక్రమేణా చేపడతాం’ అని నియోగ్ తెలియజేశారు. ప్రభుత్వం అటువంటి విధానాన్ని ప్రకటించడం ద్వారా స్థానిక హిందు స్వదేశీ సమాజాలను బెంగాలీ మాట్లాడే ముస్లింలకు వ్యతిరేకంగా నిలుపుతోంది. ఆ ముస్లింలు సాంప్రదాయకంగా అసోంలోని చార్ ప్రాంతాల్లో నివసిస్తూ ఆ భూములను సాగుకోసం, నివాసంకోసం అభివృద్ధి చేసుకున్నారు. అసోం బడ్జెట్ 202526 రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి ఓటర్లను ప్రలోభానికి గురి చేసే, మతపరంగా విభజించే అజెండాతో కూడిన ఎన్నికల ప్రచార పత్రమే తప్ప మరేమీ కాదు. ఈ బోలు వాగ్దానాలను, మతపరమైన విభజనవాద మనోభావాలను రాష్ట్ర ప్రజలు ఎంత వరకు అంగీకరిస్తారనేది వేచి చూడవలసి ఉంటుంది.

– గీతార్థ పాఠక్

(రచయిత ఈశాన్య రాష్ట్రాల సామాజిక,
రాజకీయ అంశాల విశ్లేషకుడు)

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News