మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో స్థానిక సంస్థల్లో ఖాళీ పదవులకు ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధమవుతోంది. రాష్ట్రంలో పలు జెడ్‌పిటిసి, ఎంపిటిసి, సర్పంచ్ స్థానాలతోపాటుగా వార్డు సభ్యులు, కౌన్సిలర్, కార్పొరేట్ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లతో ఎస్‌ఇసి సోమవారం సమీక్ష నిర్వహించింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి సమీక్షించారు. ఈ ఏడాది జనవరి 6న ప్రచురించిన ఓటర్ల జాబితా ఆధారంగా ఈ స్థానిక సంస్థల ఓటర్ల జాబితా తయారు చేసి ఈ నెల 21న ప్రకటించాలని తెలిపారు.
ఓటర్ల జాబితా తయారు చేసే సమయంలో వార్డుల వారీగా సాధారణ ఎన్నికలలో ఏర్పరుచుకున్న వార్డు సరిహద్దులను పాటించాలని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లో ఒక వార్డు ఓటరున ఇంకొక వార్డులో చేర్చరాదని అన్నారు. ఈ నెల 8న ముసాయిదా జాబితాలు ప్రచురించాలని కమిషనర్ అధికారులకు తెలిపారు. ఈ ముసాయిదా జాబితాపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించి వారి సలహాలు, సూచనలు స్వీకరించాలని అన్నారు. ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా ఓటర్ల జాబితా రూపొందించాలని అధికారులకు పార్థసారథి ఆదేశాలు జారీ చేశారు. ఓటర్ల జాబితా వచ్చాక పోలింగ్ స్టేషన్ల ఖరారుకు షెడ్యూల్ ఇస్తామని పేర్కొన్నారు. ప్రభుత్వ అనుమతి పొంది ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్ ఇస్తామని తెలిపారు.