Monday, November 18, 2024

పాకిస్తాన్‌లో నేడు ఎన్నికలు

- Advertisement -
- Advertisement -

ఇస్లామాబాద్ : పాకిస్తాన్‌లో కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకోవడానికి పాకిస్తానీలు గురువారం వోటు వేయనున్నారు. ఎన్నికలకు ముందు ఘోరమైన విస్ఫోటాలతో సహా హింసాత్మక సంఘటనల పరంపర, నగదు కొరతతో అల్లలాడుతున్న దేశంలో పాకిస్తాన్ ఎన్నికల కమిషన్ గురువారం ఎన్నికలు నిర్వహిస్తోంది. మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. శక్తిమంతమైన మిలిటరీ మద్దతు షరీఫ్‌కు ఉందని భావిస్తున్నారు. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ జైలులో ఉండడంతో షరీఫ్ సారథ్యంలోని పాకిస్తాన్ ముస్లిం లీగ్=నవాజ్ (పిఎంఎల్=ఎన్) ఈ ఎన్నికల్లో ఏకైక పెద్ద పార్టీగా అవతరించవచ్చునని భావిస్తున్నారు. ఇమ్రాన్ ఖాన్‌కు చెందిన పాకిస్తాన్ తెహ్రీక్ ఎ ఇన్సాఫ్ (పిటిఐ) అభ్యర్థులు స్వతంత్రంగా ఎన్నికలలో పోటీ చేస్తున్నారు. పార్టీ ఎన్నికల చిహ్నం ‘బ్యాట్’ వినియోగానికి ఎన్నికల కమిషన్ విధించిన ఆంక్షలను సుప్రీం కోర్టు సమర్థించడం ఇందుకు కారణం. 74 ఏళ్ల షరీఫ్ గురువారం ఎన్నికల్లో రికార్డు స్థాయిలో నాలుగవ సారి ప్రధాని పదవి చేపట్టాలని ఆశిస్తున్నారు.

పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (పిపిపి)కి చెందిన బిలావల్ భుట్టో జర్దారి కూడా బరిలో ఉన్నారు. ఆయనను పిపిపి ప్రధాని అభ్యర్థిగా ప్రకటించింది. దేశవ్యాప్తంగా సుమారు ఆరున్నర లక్షల మంది భద్రత సిబ్బందిని మోహరించారు. సార్వత్రిక ఎన్నికలలో తమ వోటు వేయడానికి 12.85 కోట్ల మందికి పైగా రిజిస్టర్డ్ వోటర్ల కోసం పోలింగ్ కేంద్రాల ఏర్పాటులో అధికారులు నిమగ్నమైనారు. దేశంలో హింసాత్మక సంఘటనల పరంపర దృష్టా భద్రతను మరింత కట్టుదిట్టం చేయవలసి వచ్చింది. తాజాగా బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో బుధవారం ఎన్నికల కార్యాలయాలు లక్షంగా రెండు ఘోరమైన బాంబు పేలుళ్లు సంభవించాయి. వాటిలో కనీసం 25 మంది హతులు కాగా 40 మందికి పైగా గాయపడ్డారు. పాకిస్తాన్ ఎన్నికల కమిషన్ సమాచారం ప్రకారం, నేషనల్ అసెంబ్లీ సీట్లకు మొత్తం 5121 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. వారిలో 4807 మంది పురుషులు కాగా, 312 మంది మహిళలు, ఇద్దరు ట్రాన్స్‌జెండర్లు ఉన్నారు. నాలుగు ప్రొవిన్షియల్ అసెంబ్లీలకు 12695 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వారిలో 12123 మంది పురుషులు, 570 మంది మహిళలు, ఇద్దరు ట్రాన్స్‌జెండర్లు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News