మిలిటరీ అధినేత మిన్‌ఆంగ్ హామీ
నాయ్‌ప్యితా: రెండేళ్లలో మయన్మార్‌లో సాధారణ ఎన్నికలు నిర్వహిస్తామని ఆ దేశ మిలిటరీ అధినేత జనరల్ మిన్‌ఆంగ్ లెయింగ్ హామీ ఇచ్చారు. తమ దేశ రాజకీయ వ్యవస్థకు పరిష్కారం కనుగొనేందుకు ఆగ్నేయాసియా దేశాలు సహకరించాలని ఆయన కోరారు. బహుళ పార్టీలు ఎన్నికల్లో స్వేచ్ఛగా పాల్గొనేందుకు వీలుగా పరిస్థితుల్ని సృష్టిస్తామని ఆయన అన్నారు. రికార్డు చేసిన మిన్‌ఆంగ్ ప్రసంగాన్ని ఆదివారం టెలివిజన్‌లో ప్రసారం చేశారు. 2023 ఆగస్టు వరకు తమ దేశంలో విధించిన అత్యవసర ఆంక్షలు కొనసాగుతాయని ఆయన తెలిపారు.
ఈ ఏడాది ఫిబ్రవరి 1న ఆంగ్‌సాన్‌సూకీ నేతృత్వంలోని ఎన్నికైన ప్రభుత్వాన్ని సైనిక బలప్రయోగం ద్వారా కూల్చివేసిన విషయం తెలిసిందే. అందుకు దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం కాగా, సైనిక ప్రభుత్వం కఠినంగా అణచివేసింది. సైనిక దమనకాండలో ఇప్పటివరకు 939మంది మరణించినట్టు ఓ స్వతంత్ర సంస్థ తెలిపింది. ఈ వారం బ్రూనైలో ఆసియాన్ దేశాల విదేశాంగమంత్రుల సమావేశమున్న నేపథ్యంలో మిన్‌ఆంగ్ నుంచి ప్రకటన రావడం గమనార్హం. ఆసియాన్ దేశాలతో కలిసి పని చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన తెలిపారు. మయన్మార్‌లోని ఆసియాన్ ప్రత్యేక రాయబారితోనూ చర్చలకు సిద్ధమన్నారు.