Thursday, January 23, 2025

ఎపిలో త్వరలో ఐదు ఎంఎల్‌సి స్థానాలకు ఎన్నికలు..

- Advertisement -
- Advertisement -

ఎపిలో త్వరలో ఐదు ఎంఎల్‌సి స్థానాలకు ఎన్నికలు
నామినేషన్ల గడువుకు 10 రోజుల ముందువరకు ఓటర్ల నమోదు
ఎపి సిఇఒ ముకేష్‌కుమార్ మీనా ఆదేశాలు
మనతెలంగాణ/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో ఎన్నికలు జరగనున్న ఐదు ఎంఎల్‌సి స్థానాలకు సంబంధించి నామినేషన్ల దాఖలు గడువుకు 10 రోజుల ముందు వరకు ఓటర్ల నమోదునకు అవకాశం కల్పిస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముకేష్‌కుమార్ మీనా వెల్లడించారు. ఎన్నికలు జరగనున్న మూడు పట్టభద్రుల, రెండు ఉపాధ్యాయ ఎంఎల్‌సి స్థానాలకు సంబంధించిన తుది ఓటర్ల జాబితాపై గుర్తింపు పొందిన రాజకీయపార్టీలతో మంగళవారం ఆయన ఎపి సచివాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముకేష్‌కుమార్ మీనా మాట్లాడుతూ.. అర్హత ఉండి తుది జాబితాలో పేరులేని ఓటరు నమోదుకు అవకాశం కల్పిస్తున్నామని చెప్పారు. నామినేషన్ల దాఖలు గడువుకు 10 రోజుల ముందువరకు సంబంధిత ధ్రువపత్రాలను సమర్పించి పేరు నమోదు చేసుకోవచ్చని తెలిపారు.

తుది ఓటర్ల జాబితాపై గుర్తింపు పొందిన జాతీయ, ప్రాంతీయ పార్టీలు లేవనెత్తిన అభ్యంతరాలను పరిశీలించి చర్యలు తీసుకోవాలని కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించారు. దీనికి సంబంధించి రాజకీయ పార్టీలతో సమావేశాలు నిర్వహించాలని సూచించారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం పట్టభద్రుల నియోజకవర్గ ఎంఎల్‌సి పి.వి.ఎన్.మాధవ్, ప్రకాశం -నెల్లూరు- చిత్తూరు పట్టభద్రుల నియోజకవర్గ ఎంఎల్‌సి వై.శ్రీనివాసులరెడ్డి, కడప -అనంతపురం -కర్నూలు పట్టభద్రుల నియోజకవర్గ ఎంఎల్‌సి గోపాలరెడ్డి వెన్నపూస పదవీకాలం మార్చి 29తో ముగియనుంది. ప్రకాశం -నెల్లూరు-చిత్తూరు టీచర్ల నియోజకవర్గ ఎంఎల్‌సి విఠపు బాలసుబ్రమణ్యం, కడప -అనంతపురం -కర్నూలు టీచర్ల నియోజకవర్గ ఎంఎల్‌సి కత్తి నరసింహారెడ్డి పదవీకాలం కూడా మార్చి 29తో ముగుస్తోంది. దీంతో ఈ ఐదుస్థానాలకు ఎన్నికలు నిర్వహిచేందుకు ఎన్నికల సంఘం కసరత్తు మొదలుపెట్టింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News