రాజకీయ పార్టీలకు రహస్యంగా ఎన్నికల విరాళాలు చెల్లించడానికి అవకాశమిస్తున్న ఎలెక్టోరల్ బాండ్స్ పథకంపై దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు ఎట్టకేలకు ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనానికి నివేదించడం హర్షించవలసిన పరిణామం. పారదర్శకం, జవాబుదారీ అని శ్లాఘిస్తూ కేంద్రం 2018లో తీసుకొచ్చిన ఈ పథకం ఆచరణలో గుప్పెట బిగించిందేగాని ఏ మాత్రం తెరవలేదని, ఈ బాండ్ల ద్వారా రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చేవారి పేర్లు బయటపడకుండాను, వాటిని అందుకొనే పార్టీలు ఆ వివరాలను ఎన్నికల సంఘానికి కూడా తెలియజేయనవసరం లేకుండాను చేసిందని పిటిషనర్లు ఎత్తి చూపారు.
తమకు వచ్చిన బాండ్ల వివరాలను వెంటనే ఎన్నికల సంఘానికి సమర్పించాలని 2019 ఏప్రిల్‌లో ముగ్గురు న్యాయమూర్తుల సుప్రీంకోర్టు ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అయినప్పటికీ ఈ బాండ్లకు సంబంధించిన వివరాలు ప్రజల దృష్టికి రాకుండా తప్పించుకోగలుగుతున్నాయి. అందుచేత ఇంత కాలానికి భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ ఈ పిటిషన్లను ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనానికి నివేదించారు. ఈ ధర్మాసనం ఈ నెల 31వ తేదీన ఈ కేసును విచారణకు చేపడుతుంది. కామన్ కాజ్, ప్రజాస్వామిక సంస్కరణల సంఘం (ఎడిఆర్), కాంగ్రెస్ తరపున జయ ఠాకూర్, సిపిఐ(ఎం) తదితరులు ఈ పిటిషన్లను దాఖలు చేశారు. విచిత్రమేమిటంటే ఈ బాండ్ల ద్వారా విరాళాలు సమర్పించుకొనే వారి పేర్లను పూర్తిగా రహస్యంగా వుంచుతున్నారని ఒక పిటిషనర్ చేసిన ఫిర్యాదును 2021 మార్చిలో సుప్రీంకోర్టు త్రోసిపుచ్చింది. ప్రజలు పన్నుల ద్వారా చెల్లించే సొమ్ముతో నిర్వహిస్తున్న ఎన్నికల మీద ప్రైవేటు విరాళాల ద్వారా రాజకీయ పార్టీలు పొందే అపారమైన నిధుల పెత్తనం ప్రజాస్వామ్యానికి హానికరం కాదా? ఎన్నికలలో పార్టీల ఖరులను కూడా ప్రభుత్వమే భరించాలన్న సూచన ఆచరణలో బొత్తిగా అసాధ్యమా? ఈ విరాళాల పద్ధతి ప్రభుత్వాలతో పనులుండే సంపన్న కార్పొరేట్ యాజమాన్యాలు అధికారంలోకి రాగల అవకాశాలు అధికంగా వుండే పార్టీలకు ఇష్టావిలాసంగా నిధులు చెల్లించడానికి దోహదం చేస్తుంది.
ఆ డబ్బుతో ఆ పార్టీలు ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయగలుగుతాయి. ఇది ప్రజాస్వామ్య మౌలిక విలువలకే విఘాతమైనది. అయినా ఇప్పటికీ ఇది కొనసాగుతూనే వుంది. సుప్రీంకోర్టులో ఎనిమిదేళ్ళుగా పెండింగ్‌లో వున్న ఈ కేసుపై నిర్ణయం తీసుకోవాలని భావించామని ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ అన్నారంటే ఇంతటి ముఖ్యమైన వ్యాజ్యంపై ఎంత దారుణమైన జాప్యం జరిగిందో అర్థం చేసుకోవచ్చు. అమెరికాలోనో, ఇతర సంపన్న పాశ్చాత్య దేశాల్లోనో ఇటువంటి విరాళాల పద్ధతి వుంటే వేరు మాట గాని, అత్యధిక శాతం నిరుపేద, అణగారిన ప్రజలుండే మన వంటి ప్రజాస్వామ్యాల్లో పార్టీలు సంపన్నులిచ్చే విరాళాలకు బందీలు కావడం ఎంత మాత్రం మంచిది కాదు.
ఆ విధంగా అధికారంలోకి వచ్చే పార్టీలు తమకు విరాళాలిచ్చిన సంస్థలకు లేదా వ్యక్తులకు అనుకూలంగా ప్రభుత్వాలను నడుపుతాయేగాని ప్రజలకు మేలు చేయవు. ఈ పథకం ప్రకారం ఎలెక్టోరల్ బాండ్స్‌ను విడుదల చేసే అధికారం ఒక్క స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు మాత్రమే వుంటుంది. అది ఏడాదిలోని ప్రతి త్రైమాసికం ప్రారంభంలో (జనవరి, ఏప్రిల్, జులై, అక్టోబర్) ఈ బాండ్లను కొనుగోలు చేసుకోడానికి పదేసి రోజుల వ్యవధిని ప్రకటిస్తుంది. విరాళాలు ఇవ్వదలచిన వారు ఆ వ్యవధిలో తాము కోరుకొన్న రాజకీయ పక్షాల పేరిట తమకు ఇష్టం వచ్చిన ద్రవ్యానికి బాండ్లను కొనుగోలు చేసుకొంటారు. లోక్‌సభ ఎన్నికల సంవత్సరంలో అదనంగా నెల రోజులు అవకాశం ఇస్తారు. ఆ బాండ్లను ఆయా రాజకీయ పార్టీలకు స్టేట్ బ్యాంకు అందచేస్తుంది. ఆ పార్టీలు తాము కోరుకొన్నప్పుడు వాటిని నగదు చేసుకొంటాయి.
ఈ మొత్తం వ్యవహారం విరాళాలిచ్చే వ్యక్తులకు లేదా సంస్థలకు, స్టేట్ బ్యాంక్‌కు, వాటిని పొందే పార్టీలకు మాత్రమే తెలుస్తుంది. 2021లో ఇలా పొందిన బాండ్ల సొమ్ములో 60% ఒక్క భారతీయ జనతా పార్టీ ఖాతాలోనే జమ అయినట్లు పిటిషనర్లలో ఒకటైన ఎడిఆర్ ఆరోపించింది. ఆ ఏడాది రూ. 6500 కోట్ల కిమ్మత్తు బాండ్లు అమ్ముడు పోయాయని తెలియజేసింది. కొనుగోలు చేసిన ఎలెక్టోరల్ బాండ్లలో 99% మేరకు రూ. కోటి, రూ. 10 లక్షలు మధ్య అమ్ముడు పోయాయని కూడా ఎడిఆర్ వెల్లడించింది. అంటే సంపన్న భారీ కార్పొరేట్లు మాత్రమే వాటిని కొనుగోలు చేశాయని అర్థమవుతున్నది. అంతేకాక ఎలెక్టోరల్ బాండ్ల సవరణ చట్టాలను ద్రవ్య బిల్లులుగా పరిగణించి వాటికి ఒక్క లోక్‌సభ ఆమోదాన్ని మాత్రమే పొందడం కూడా ఆక్షేపణకు గురి అయింది. 2024 లోక్‌సభ ఎన్నికల లోగా దీనిపై తీర్పు వస్తే ఆ ఎన్నికలపై అక్రమ విరాళాల ప్రభావం తొలగుతుంది. ధర్మాసనం ఈ అవసరాన్ని గుర్తిస్తుందని ఆశిద్దాం.