Friday, November 22, 2024

ఎన్నికల బాండ్లు రాజ్యాంగ విరుద్ధం

- Advertisement -
- Advertisement -

విరాళాల వివరాలను అత్యంత గోప్యంగా ఉంచడం చెల్లదు
ఇది భావ ప్రకటన స్వేచ్ఛ, సమాచార హక్కు చట్ట ఉల్లంఘన
తక్షణమే పథకాన్ని రద్దు చేయాలి
నగదుగా మార్చుకోని బాండ్లను పార్టీలు వాపస్ చేయాలి
మార్చి 6లోగా బాండ్ల వివరాలు ఎస్‌బిఐ సమర్పించాలి
మార్చి13లోగా పూర్తి వివరాలను ఇసి వెబ్‌సైట్‌లో పెట్టాలి

ఐదుగురు సభ్యుల సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మసనం చరిత్రాత్మక తీర్పు
పారదర్శకత కోసమే పథకాన్ని తెచ్చాం : బిజెపి

బిజెపి అవినీతికి అడ్డుకట్టపడింది : కాంగ్రెస్
బాండ్ల స్వీకరణలో బిజెపి టాప్

న్యూఢిల్లీ: కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకువచ్చిన ఎన్నికల బాండ్ల పథకాన్ని రద్దు చే స్తూ సుప్రీంకోర్టు గురువారం చరిత్రాత్మక తీర్పును వెలువరించింది. ఈ పథకం కింద రాజకీయ పార్టీలకు ముడుతున్న విరాళాలను అత్యంత గోప్యంగా ఉంచడాన్ని రాజ్యాంగ విరుద్ధంగా అభివర్ణించిన ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన నాకచాంగ ధర్మాసనం బాండ్లను కొనుగోలు చేసిన వారి పేర్లు, బాండ్ల విలువ, వాటి స్వీకర్తల(రాజకీయ పార్టీల) పేర్లను బహిర్గతం చేయాలని ఆదేశించింది. 20 18లో తీసుకువచ్చిన ఈ  ఎన్నికల బాండ్ల పథకాన్ని రాజ్యాంగపరంగా లభించే భావ ప్రకటనా స్వేచ్ఛ, సమాచార హక్కు చట్టాల ఉల్లంఘనగా ప్రధాన న్యాయమూర్తి(సిజెఐ) డివై చంద్రచూడ్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం అభివర్నించింది. రాజకీయ పార్టీలకు చెందిన విరాళాల సేకరణలో పారదర్శకతను తీసుకురావడానికి, నల్ల ధనాన్ని నిర్మూలించడానికి ఈ పథకాన్ని ప్రవేశపెట్టామన్న కేంద్ర ప్రభుత్వ వాదనను ధర్మాసనం తోసిపుచ్చింది. రహస్య బ్యాలెట్ తరహాలోనే రాజకీయ పార్టీలకు విరాళాలిచ్చే దాతల పేర్లను రహస్యంగా ఉంచుతామన్న కేంద్ర ప్రభుత్వ వాదనను తిరస్కరిస్తూ ఇది లోపభూయిష్టమని పేర్కొంది.

ఈ పథకాన్ని తక్షణమే నిలిపివేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అంతేగాక 2019 ఏప్రిల్ 12 నుంచి ఇప్పటివరకు విక్రయించిన ఎన్నికల బాండ్ల వివరాలను మార్చి 6వ తేదీలోగా భారత ఎన్నికల కమిషన్(ఇసిఐ)సమర్పించాలని ఎన్నికల బాండ్లను విక్రయిచే అధికారాన్ని పొందిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బిఐ)ను సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశించింది. మార్చి 13వ తేదీ లోగా ఇసిఐ తన అధికారిక వెబ్‌సైట్‌లో ఎన్నికల బాండ్లకు సంబంధించిన పూర్తి వివరాలను ప్రచురించాలని కూడా ధర్మాసనం ఆదేశించింది. ప్రతి ఎన్నికల బాండు విక్రయ తేదీని, కొనుగోలుదారుడి పేరును, ఎన్నికల బాండు విలువను ఇసిఐకి సమర్పించాలని ఎస్‌బిఐని ధర్మాసనం ఆదేశించింది. 2019 ఏప్రిల్ 12వ తేదీ నుంచి తీర్పు వెలువడిన నేటి వరకు ఎన్నికల బాండ్ల ద్వారా రాజకీయ పార్టీలు స్వీకరించిన విరాళాల వివరాలను ఎస్‌బిఐ సమర్పించాలని ధర్మాసనం ఆదేశించింది. సిజెఐ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనంలో జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ జెబి పార్దీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రా ఉన్నారు.

ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల మధ్యలో లోక్‌సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈ సంచలన తీర్పును వెలువరించింది. 2019 ఏప్రిల్ 12న సుప్రీంకోర్టు ఈ కేసుకు సంబంధించి మధ్యంతర ఉత్తర్వులను జారీచేసింది. తాము స్వీకరించిన విరాళాలు, స్వీకరించబోయే విరాళాలకు సంబంధించిన వివరాలను రాజకీయ పార్టీలు సీల్డ్ కవర్‌లో ఇసిఐకి సమర్పించాలని ఆ ఉత్తర్వుల్లో సుప్రీంకోర్టు ఆదేశించింది. కాగా, తాజాగా ఎన్నికల బాండ్ల పథకాన్ని రద్దుచేసిన సుప్రీంకోర్టు 15 రోజుల చెల్లుబాటు గడువు మాత్రమే ఉండే ఎన్నికల బాండ్లను రాజకీయ పార్టీలు ఇంకా తమ ఖాతాలలో జమచేయని పక్షంలో సంబంధిత బ్యాంకుకు వాటిని వాపసు చేయాలని, ఆ సొమ్ము మొత్తాన్ని సంబంధిత కొనుగోలుదారుడి ఖాతాలో బ్యాంకులు జమచేయాలని ధర్మాసనం ఆదేశించింది. ఎడిఆర్, సిపిఎం, మరి కొందరు వ్యక్తులు ఎన్నికల బాండ్ల పథకాన్ని సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. 2017-18 నుంచి 2022–23 వరకు రాజకీయ పార్టీల వార్షిక ఆడిట్ నివేదికలను సిజెఐ తన 152 పేజీల ఏకగ్రీవ తీర్పులో ప్రస్తావిస్తూ పార్టీల వారీగా ఎన్నికల బాండ్ల ద్వారా అందుకున్న విరాళాల వివరాలను పేర్కొన్నారు.

బిజెపి రూ. 6,566.11 కోట్లు అందుకోగా, కాంగ్రెస్ పార్టీ రూ. 1123.3 కోట్లను స్వీకరించింది. తృణమూల్ కాంగ్రెస్ రూ.1092.98 కోట్లు అందుకుంది. రాజకీయ పార్టీలకు అపరిమిత విరాళాల చెల్లింపునకు అనుమతిస్తూ కంపెనీల చట్ట నిబంధనలను సవరించడాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టింది. ఇది రాజ్యాంగంలోని 19(1)(ఎ) అధికరణను ఉల్లంఘించడమేనని ధర్మాసనం పేర్కొంది. రాజకీయ పార్టీలకు అందుతున్న విరాళాల వివరాలను తెలుసుకునే హక్కు ఓటరుకు ఉందని, అటువంటి అవకాశాన్ని కూడా ఈ పథకం కల్పించలేదని ధర్మాసనం తెలిపింది. నల్ల ధనాన్ని నిర్మూలించడానికి ఎన్నికల బాండ్ల పథకం ఒక్కటే మార్గం కాదని, ఆందుకు ఇతర మార్గాలు కూడా ఉన్నాయని ధర్మాసనం పేర్కొంది. విరాళాలు అందచేయడం ద్వారా ఆయా రాజకీయ పార్టీలకు తమ మద్దతు తెలియచేయడం, లేదా క్విడ్ ప్రో కో ప్రాతిపదికన విరాళాలు అందచేయడం వంటి ప్రధానంగా రెండు కారణాలతోనే విరాళాలు అందచేయడం జరుగుతుందని తన తీర్పులో ధర్మాసనం పేర్కొంది. కార్పొరేట్ కంపెనీలు అందచేసే భారీ విరాళాల వివరాలను గోప్యంగా ఉంచడాన్ని ధర్మాసనం తప్పుపట్టింది. క్విడ్ ప్రో కో లావాదేవీల కింద రాజకీయ పారీలకు అందే విరాళాలు ఆయా రాజకీయ పార్టీలకు మద్దతుగా పరిగణించలేమని ధర్మాసనం పేర్కొంది. కాగా..జస్టిస్ ఖన్నా విడిగా మరో 74 పేజీల తీర్పును వెలువరిస్తూ సిజెఐ చంద్రచూడ్ రాసిన తీర్పును బలపరుస్తూ వేర్వేరు కారణాలను వివరించారు. ఎన్నికల బాండ్ల పథకం రద్దు చేయాలన్న తీర్పుతో ఆయన కూడా ఏకీభవించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News