న్యూఢిల్లీ: రాజకీయ పార్టీల విరాళాల కోసం తీసుకువచ్చిన ఎన్నికల బాండ్ల పథకాన్ని రద్దు చేస్తూ సుప్రీంకోర్టు గురువారం వెలువరించిన తీర్పును దేశంలోని వివిధ ప్రధాన రాజకీయ పక్షాలు స్వాగతించాయి. తమిళనాడులోని అధికార డిఎంకె, ప్రతిపక్ష ఎఐఎడిఎంకె సుప్రీంకోర్టు తీర్పుపై హర్షం వ్యక్తం చేశాయి. ఈ తీర్పుతో ప్రజాస్వామ్య పునరుద్ధరణ జరిగిందని తమిళనాడు ముఖ్యమంత్రి, డిఎంకె అధ్యక్షుడు ఎంకె స్టాలిన్ పేర్కొన్నారు. ఎన్నికల వ్యవస్థపైన ప్రజల విశ్వాసాన్ని పరిరక్షించడంతోపాటు ఎన్నికల క్షేత్రంలో అన్ని రాజకీయ పార్టీలకు సమన్యాయం జరిగేందుకు ఈ తీర్పు అవకాశం కల్పించిందని ఆయన అన్నారు.
ఎన్నికల బాండ్లను రాజ్యాంగవిరుద్ధంగా సుప్రీంకోర్టు అభవర్ణించడం సముచితమని ఆయన అన్నారు. పారదర్శక ఎన్నికల ప్రక్రియకు, వ్యవస్థ సమగ్రతకు ఈ తీర్పు దోహదపడుతుందని సామాజిక మాధ్యమం ఎక్స్‌లో స్టాలిన్ స్పందించారు. ప్రతిపక్ష ఎఐఎడిఎంకె ప్రధాన కార్యదర్శదర్శి ఎడప్పాడి కె పళనిసామి కూడా ఎన్నికల బాండ్లపై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతించారు. ఈ పథకం ద్వారా విరాళాలు పొందని ఏకైక పార్టీ తమదేనని ఆయన తెలిపారు. ఎన్నికల బాండ్ల ద్వారా భారీ మొత్తంలో విరాళాలు పొందిన పారీల బండారాన్ని బయటపెట్టాలని ఆయన మీడియాకు పిలుపునిచ్చారు. భారీ మొత్తంలో విరాళాలు సేకరించిన పార్టీలు ధనబలంతో తమలాంటి పార్టీలను అణచివేయడానికి ప్రయత్నిస్తు న్నాయని ఆయన అన్నారు. ఎన్నికల బాండ్లపై సుప్రీం తీర్పును సిపిఎం స్వాగతించింది.
ఈ ఎన్నికల బాండ్లకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో సిపిఎం కూడా పిటిషన్ దాఖలు చేసింది. అధికార పార్టీకి లబ్ధి చేకూర్చేందుకే ఈ పథకాన్ని తీసుకువచ్చారని సిపిఎం ఆరోపించింది. రాజకీయ, ఎన్నికల నిధుల సమీకరణకు సంబంధించిన సంస్కరణలను తీసుకురావలసిన ఆవశ్యకత ఉందని సిపిఎం పోలిట్‌బ్యూరో తెలిపింది. ఎన్నికల బాండ్లకు వ్యతిరేకంగా తమ పార్టీ చేస్తున్న వాదనను సుప్రీంకోర్టు కూడా తన ఏకగ్రీవ తీర్పులో మసర్థించడం పట్ల సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి హర్షం వ్యక్తం చేశారు. ఎన్నికల బాండ్లను స్వీకరించని ఏకైక రాజకీయ పార్టీ తమదేనని ఆయన అన్నారు. అవినీతిని చట్టబద్ధం చేసేందుకే ఈ పథకాన్ని ప్రవేశపెట్టారని ఆయన ఆరోపించారు. జార్ఖండ్ ముక్తి మోర్చ(జెఎంఎం) కూడా సుప్రీంకోర్టు తీర్పు పట్ల హర్షం వ్యక్తం చేసింది. అయితే సుప్రీం కోర్టు తీర్పును విస్మరించేందుకు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఒక ఆర్గినెన్స్‌ను జారీచేసే అవకాశం ఉందని జెఎంఎం ఆందోళనను వ్యక్తం చేసింది.