Monday, December 23, 2024

విరగడైన పీడ

- Advertisement -
- Advertisement -

ప్రజాస్వామ్యానికి ఊపిరి వాయువు, ప్రజాసామాన్యం అభీష్ట ప్రకటనకు ప్రాణప్రదం అయిన భారత దేశ ఎన్నికలను పాలకులకు, దేశ విదేశీ కార్పొరేట్ సంపన్న శక్తులకు మధ్య రహస్య క్విడ్ ప్రో కో ఒప్పందంగా, ఇచ్చి పుచ్చుకొనే బేరసార వ్యవస్థగా మార్చివేసిన ఎలక్టోరల్ బాండ్ల విధానాన్ని చెత్తబుట్టలోకి ఊడ్చిపారేస్తూ సుప్రీం కోర్టు గురువారం నాడు ఇచ్చిన తీర్పు చారిత్రాత్మకమైనది. 2024 లోక్‌సభ ఎన్నికలు అతి సమీపంలో ఉన్న సమయంలో దేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన ఈ తీర్పు ఎన్నికలపైన, దేశ పాలనా నిర్ణయాధికారం మీద సంపన్నుల క్షుద్ర పట్టును పటాపంచలు చేసింది.

రాజ్యాంగాన్ని, ప్రజాస్వామిక విధివిధానాలను కాలరాసి కేంద్ర పాలకులు సాగిస్తున్న స్వప్రయోజనకాండకు అండగా అవతరించిన ఈ పథకాన్ని సునిశితమైన న్యాయ ఖడ్గంతో ముక్కలు ముక్కలుగా నరికిన ధర్మాసన సాహసం కొనియాడదగినది. రాజకీయ పార్టీలకు రహస్యంగా డొనేషన్లు, విరాళాలు ఇవ్వడానికి అవకాశం కల్పిస్తున్న ఈ బాండ్ల పథకం రాజ్యాంగ విరుద్ధమైనదని ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ సారథ్యంలోని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం స్పష్టం చేసింది. ప్రజల సమాచార హక్కును హరిస్తున్నదని అభిప్రాయపడింది. గుప్తధనాన్ని అరికట్టడానికి ఈ బాండ్ల పథకం ఒక్కటే శరణ్యం కానక్కరలేదని, అందుకు వేరే దారులున్నాయని భావించింది. పారదర్శకంగా సాగవలసిన ఎన్నికల ప్రక్రియలో ఎలక్టోరల్ బాండ్ల పథకం చిమ్మచీకటి రహస్య బిలం వంటిది.

ఏ పార్టీకి ఏ వ్యక్తి లేదా ఏ కంపెనీ ఈ బాండ్ల ద్వారా ఎంత సొమ్మును విరాళంగా సమర్పించుకొన్నారన్న వాస్తవం వెలుగులోకి రాకుండా చేస్తున్న ఈ పథకం అధికారంలోని పార్టీలకు కుప్పలు తెప్పలుగా ధనరాసులు వచ్చేలా చేసింది. అందుకే ఈ విరాళాల్లో భారతీయ జనతా పార్టీకే తలవాటా వెళుతున్నది. ఇది ఖచ్చితంగా అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు కాకుండా విరాళ దాతలకు అనుకూలంగా విధాన నిర్ణయాలు తీసుకోవలసిన అగత్యం పాలకుల మీద పెడుతున్నది. తొలి మెట్టు మీదనే జుట్టు బడా పెట్టుబడి దారుల చేతికి అప్పగించి అధికారంలోకి వచ్చే పార్టీ ప్రజలకు చేసే మేలు శూన్యం అవుతున్నది. వారికి మేలు చేయకపోగా రైతుల పాదాల కింది భూమిని, పంటను కబళించి కార్పొరేట్లకు అప్పగించడానికి ఉద్దేశించిన మూడు వ్యవసాయ నల్లచట్టాలు ఊడిపడి ఉద్యమం దెబ్బకు మట్టి గలిశాయి. 2018లో ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకు వచ్చిన ఎలక్టోరల్ బాండ్ల పథకం ప్రకారం నిర్ణీత వ్యవధిలో బ్యాంకు విడుదల చేసే ఈ బాండ్లను వాటికి నిర్ణయించిన రేటు ప్రకారం తాము కోరుకొనే పార్టీ పేరిట కొనుగోలు చేసే ఏర్పాటు జరిగింది. అలా ఇచ్చే విరాళ దాతల పేర్లను రహస్యంగా ఉంచుతారు.

ఈ పథకాన్ని ఒక్క స్టేట్ బ్యాంక్ ద్వారా మాత్రమే నడుపుతున్నారు. ఈ బాండ్లను ఆయా పార్టీలు సొమ్ము చేసుకొంటాయి. కొత్తగా ఎలక్టోరల్ బాండ్లను ఎవరికీ ఇవ్వరాదని స్టేట్ బ్యాంకును ఆదేశించిన సుప్రీం కోర్టు ఈ బాండ్లకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఎన్నికల సంఘానికి అందజేయాలని చెప్పింది. కార్పొరేట్ కంపెనీల యాజమాన్యాలు ఈ బాండ్ల ద్వారా పార్టీలకు ఇచ్చిన విరాళాల సమాచారం బయట పెట్టాలని ఆదేశించిన సుప్రీం కోర్టు అవి పూర్తిగా వారు తమ స్వప్రయోజనాలు ఆశించి ఇచ్చే విరాళాలేనని అభిప్రాయపడింది. అత్యంత ప్రాధాన్యమైన ఈ కేసులో ధర్మాసనం రెండు తీర్పులిచ్చింది. ఒకటి సిజెఐ చంద్రచూడ్ ఇవ్వగా, రెండోది జస్టిస్ సంజీవ్ ఖన్నా వెలువరించారు. స్వల్ప తేడాలతో రెండు తీర్పులు బాండ్ల విధానాన్ని తృణీకరించాయి.

ఎన్నికల సంఘం వెబ్ సైట్ నుంచి లభ్యమైన సమాచారం, పిటిషనర్లు సమర్పించిన వివరాల ప్రకారం ఈ బాండ్ల ద్వారా అందిన విరాళాల్లో అత్యధిక మొత్తం కేంద్రంలో, రాష్ట్రాల్లో అధికారంలో గల రాజకీయ పార్టీలకే ముట్టినట్టు స్పష్టపడిందని జస్టిస్ ఖన్నా చెప్పారు. అమ్ముడు పోయిన మొత్తం బాండ్లలో 94% కోటి రూపాయల విలువైనవేనని, దీనిని బట్టి కార్పొరేట్ విరాళాలు ఎంత భారీగా వచ్చాయో అర్ధమతున్నదని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. ఉదాహరణకు ఈ పథకం వచ్చిన సంవత్సరం 2017 18లో బిజెపికి ముట్టిన మొత్తం 210 కోట్లు కాగా, కాంగ్రెస్‌కి వచ్చింది ఐదు కోట్లే. దీనిని బట్టి అధికారానికి కార్పొరేట్లకు ఇది ఎంతటి దగ్గరి సంబంధం కుదిరిచిందో స్పష్టపడుతున్నది. విరాళాలు ఇచ్చేవారి వివరాలు బయటకు పొక్కకుండా రహస్యంగా ఉంచే పద్ధతి ప్రజాస్వామ్యాన్ని భ్రష్టు పట్టిస్తున్నది. ఇప్పటి వరకు పార్టీలకు అప్పగించకుండా ఉన్న బాండ్ల మొత్తాన్ని తిరిగి దాతలకు ఇచ్చేయాలని కోర్టు స్టేట్ బ్యాంకును ఆదేశించింది. అన్ని విధాలా ప్రజాస్వామ్య హితంగా వెలువడిన ఈ తీర్పు సుప్రీం కోర్టు కీర్తిని పెంచింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News