Sunday, September 22, 2024

తప్పని బాండ్లు!

- Advertisement -
- Advertisement -

Electoral Bonds Won't Be Stopped :Supreme Court

 

ఎలెక్టోరల్ బాండ్స్ అమ్మకంపై స్టే ఇవ్వడానికి నిరాకరించడం ద్వారా సుప్రీంకోర్టు దేశంలో ప్రజాస్వామ్యానికి చేసింది మేలో, కీడో వివరించి చెప్పనక్కర లేదు. నాలుగు కీలక రాష్ట్రాలకు (అసోం, కేరళ, తమిళనాడు, బెంగాల్) ఒక కేంద్ర పాలిత ప్రాంతాని (పుదుచ్చేరి) కి అతి ముఖ్యమైన అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఊరూ, పేరూ, ఎంత మొత్తమో, ఎవరికి ఇస్తున్నట్టో బహిర్గతం చేయనవసరం లేకుండానే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బాండ్ల ద్వారా పార్టీలకు విరాళాలు అందజేసే దొడ్డి దారి రాజకీయ మేపుడు విధానం పేరే ఎలెక్టోరల్ బాండ్స్. తాజా ఎన్నికల నేపథ్యంలో ఈ బాండ్లను వచ్చే నెల 1 నుంచి 10 తేదీ వరకు ఎవరైనా కొనుగోలు చేయడానికి ప్రభుత్వం అవకాశం కల్పించింది. అంటే ఎన్నికల తొలి దశ నుంచే పార్టీలకు అవసరమయ్యే ‘చమురు’ ను గోప్యంగా సమకూర్చే మార్గాన్ని మరొక సారి తెరిచింది. ఆశ్రిత పెట్టుబడిదారీ విధానం హద్దులు దాటిపోయి చాలా కాలమైంది. ప్రభుత్వ రంగ సంస్థలు, ఆస్తులన్నింటినీ చవకగా ప్రైవేటుకు అమ్మేస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్రం నుంచి విశేష ప్రయోజనాలు ఆశించే శక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకోడానికి పోటీ పడతారనేది వాస్తవం.

వారి వద్ద నుంచి బాండ్ల రూపంలో ఏ పార్టీకి వెల్లువెత్తి ధన వర్షం కురుస్తుందో ప్రత్యేకించి చెప్పనక్కర లేదు. 201718 లో, 201819 లో ఎలెక్టోరల్ బాండ్ల ద్వారా రాజకీయ పార్టీలకు అందిన విరాళాల మొత్తం రూ. 2760.20 కోట్లయితే అందులో 60.17 శాతం అంటే రూ. 1660 కోట్లు ఒక్క భారతీయ జనతా పార్టీకే వెళ్లింది. ఎన్నికల్లో పోటీ చేసే అన్ని పార్టీలకు సమాన పోరాట శక్తియుక్తులు ఉన్నప్పుడే ప్రజాస్వామ్యం గెలుస్తుంది. పాలక పార్టీలకు అధికారంతో పాటు డబ్బు కూడా దండిగా ఉన్నప్పుడు సమపోటీకి బొత్తిగా సందులేకుండా పోతుంది. ఎలెక్టోరల్ బాండ్ల అమ్మకాలకు అనుమతి ఇవ్వరాదని కోరుతూ అసోసియేషన్ ఫర్ డెమొక్రాటిక్ రిఫార్మ్ (ఎడిఆర్) సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. భారత ప్రధాన న్యాయమూర్తి ఎస్‌ఎ బాబ్డే అధ్యక్షతన గల ధర్మాసనం అందుకు నిరాకరించింది. కీలకమైన ఐదు శాసన సభల ఎన్నికలకు ముందు బాండ్లకు మళ్లీ గేట్లు తెరవడం వల్ల బోగస్ (డొల్ల) కంపెనీల ద్వారా అక్రమ ధనం మరింతగా రాజకీయ పార్టీలకు చేరుతుందని ఎడిఆర్ వాదించింది.

ఈ మౌలికాంశం ధర్మాసనం పెద్దలకు తెలియదని అనుకోగలమా? ఎలెక్టోరల్ బాండ్ల విధానం 2018లో ప్రవేశించడానికి ముందు ఏ పార్టీ అయినా రూ. 20 వేలకు మించి తనకు అందిన విరాళాల మూలాలను అవి తప్పనిసరిగా వెల్లడించవలసి వచ్చేది. ఆ సొమ్ము ఇచ్చిన వారి పేర్లను ఇతర వివరాలను బయటి పెట్టక తప్పేది కాదు. అప్పుడు కూడా దాతలు తెలివిగా తాము ఇచ్చే డబ్బును రూ. 20 వేలకు లోబడిన మొత్తాలుగా విభజించి అందజేసేవారు. ఆ విధంగా తమ గోప్యతను కాపాడుకునే వారు బాండ్ల పద్ధతిలో విరాళ దాతల, విరాళాల వివరాలు స్టేట్ బాంకు వద్ద విధిగా ఉంటాయి. అంటే వారెవరో అధికార పక్షానికి సులభంగా తెలుస్తుంది. ఎటొచ్చీ ఓటర్‌కు మాత్రమే అది అతి రహస్యం. తన ఓటు ఎవరి ప్రయోజనానికి ఉపయోగపడబోతున్నదో తెలుసుకునే అవకాశం ఈ బాండ్ల విధానంలో ఓటర్లకు బొత్తిగా ఉండదు.

ఆ విధంగా ప్రజల ఓట్లను వారికి తెలియకుండానే కొల్లగొట్టుకొని తమ అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వాలు విధాన నిర్ణయాలు తీసుకునేలా చేసే పలుకుబడిని ఈ పద్ధతి ద్వారా స్వార్థపర శక్తులు సంపాదించుకోగలుగుతున్నాయి. ఈ బాండ్ల ముద్రణ ఖర్చు, వాటి విక్రయ సేవలకు ఎస్‌బిఐకి ఇచ్చే కమీషన్ కూడా పన్ను చెల్లింపుదార్లు అయిన ప్రజలే భరిస్తారు. ఎలెక్టోరల్ బాండ్ల విధానం ప్రవేశపెట్టినప్పటి నుంచి ఎటువంటి అవరోధం లేకుండా నిర్విఘ్నంగా సాగిపోతున్నది గనుక దానిని విరమించవలసిన అవసరం గాని, స్టే మంజూరు చేయవలసిన ఆవశ్యతక గాని తమకు కనిపించడం లేదని సూకా్ష్మతి సూక్ష్మంగా పిటిషన్‌ను ధర్మాసనం తోసిపుచ్చింది. దేశంలో ప్రజాస్వామ్యం ప్రవర్ధమానం కావడానికి తోడ్పడిన ఎన్నో గొప్ప తీర్పులను సుప్రీంకోర్టు వెలువరించింది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు వారి ఆస్తులను, వారి నేరస్థ చరిత్రను బయటపెట్టాలని గట్టి నియమం ఏర్పాటు చేసింది. ప్రజాస్వామ్యంలో పారదర్శకతను ఉండవలసిన అత్యున్నత స్థానాన్ని గురించి గుర్తు చేసింది.

అసలీ ఎలెక్టోరల్ బాండ్ల చట్టమే రాజ్యసభ కన్నుగప్పి అవతరించింది. అంతటి గొప్ప న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తికే ఎలెక్టోరల్ బాండ్ల విధానం ఆక్షేపణీయం కాదనిపించినప్పుడు ఇంతటి సువిశాల ప్రజాస్వామ్యానికి దిక్కెవరు అనే ప్రశ్న తలెత్తితే తప్పుపట్టలేము. ప్రజాస్వామ్య వృక్షానికి ఉన్నత న్యాయ పాలిక కూడా మంచి నీరు పోయడం లేదేమోనన్న భీతావహమైన అనుమానానికి ఆస్కారం కలగకూడదు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News