Sunday, January 5, 2025

ఆన్‌లైన్‌లో ఇ బైక్ అమ్మకం..వ్యాపారికి రూ. 1.05 లక్షల టోకరా

- Advertisement -
- Advertisement -

 

బెంగళూరు: ఆన్‌లైన్‌లో ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేయాలనుకున్న ఒక వ్యాపారిని సైబర్ నేరస్థులు దోచేశారు. కుంబల్‌గోడు పారిశ్రామిక వాడలోని బయోకేర్ గార్మెంట్ ప్రాసెసర్ కంపెనీకి చెందిన ఒక 55 ఏళ్ల డైరెక్టర్ తనను రూ.1.05 లక్షలు మోసం చేసిన సైబర్ నేరగాళ్లను పట్టుకోవాలంటూ పోలీసులను ఆశ్రయించారు.  మార్చి 10న తాను ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం ఆన్‌లైన్‌లో శోధిస్తుండగా ఒక వెబ్‌సైట్ కంటపడిందని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆయన పేర్కొన్నాడు.

స్కూటర్‌ను బుక్ చేసుకోవడానికి కస్టమర్ల కోసం ఒక ఫోన్ నంబర్‌ను వెబ్‌సైట్ ఇచ్చిందని, తాను ఆ నంబర్‌కు ఫోన్ చేశానని ఆయన చెప్పాడు. స్కూటర్ వివరాలతోపాటు ఇన్‌వాయిస్‌ను వాట్సాప్‌లో పంపుతామని ఆ ఫోన్ నంబర్‌లోని వ్యక్తి తనకు చెప్పాడని ఆయన తెలిపాడు. అదే విధంగా తనకు ఓలా ఎస్1 ప్రో వాహనం వివరాలతోపాటు రూ. 35,000 డిస్కౌంట్ ఇస్తున్నట్లు ఇన్‌వాయిస్ పంపాడని బాధితుడు తెలిపాడు.  రూ. 1.05 లక్షల నగదును ఒకేసారి చెల్లించాలని తనకు చెప్పడంతో మార్చి 11న తాను మూడు ట్రాన్సాక్షన్ల ద్వారా డబ్బును ఆన్‌లైన్‌లో పంపించానని ఆయన చెప్పాడు.

మార్చి 13న స్కూటర్ డెలివరీ చేస్తామని వాగ్దానం చేశారని, కాని ఆ రోజు డెలివరీ కాకపోవడంతో తాను మళ్లీ ఆ నంబర్‌కు ఫోన్ చేశానని ఆయన చెప్పాడు. అయితే మరో 20,000 చెల్లించాలని చెప్పాడని, అది సబ్సిడీగా తిరిగి వాపసు వస్తుందని కూడా చెప్పాడని ఆయన వివరించారు. దీంతో అనుమానం వచ్చిన బాధితుడు పోలీసు కమిషనర్ సిహెచ్ ప్రతాప్ రెడ్డిని కలసి ఫిర్యాదు చేశారు. కాగా..బాధితుడి అకౌంట్‌ను బ్లాక్ చేయడానికి ప్రయత్నించామని, అప్పటికే అమౌంట్ విత్‌డ్రా అయిపోయిందని ఒక సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News