తెలంగాణలోని పల్లెలకు ఇక ఎలక్ట్రిక్ బస్సులు పరుగులు తీయనున్నాయి. ఆర్‌టిసి రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో ఎలక్ట్రిక్ బస్సులు నడుపుతున్న విషయం తెలిసిందే. ఇక ఎలక్ట్రిక్ బస్సు సర్వీసును రాష్ట్రవ్యాప్తంగా నడపాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇటీవలే హైదరాబాద్ విజయవాడ మధ్య ప్రయోగాత్మకంగా గరుడ ప్లస్ క్యాటగిరిలో పది ఎలక్ట్రిక్ బస్సులను ఆర్‌టిసి నడిపింది. ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ఎలట్రిక్ బస్సులను ప్రారంభించాలని యోచిస్తోంది.
దీంతో పల్లెవెలుగు, ఎక్స్ ప్రెస్, సూపర్ లగ్జరీ కాటగిరీలలో తెలంగాణ వ్యాప్తంగా ఎలక్ట్రిక్ బస్సులు నడవనున్నాయి. కొత్తగా 450 ఎలక్ట్రిక్ బస్సులు రాష్ట్రానికి రానున్నాయని, మరో వారం రోజుల తర్వాత దశలవారీగా ఈ బస్సులు రోడ్డెక్కనున్నాయని తెలిపింది. హైదరాబాద్ నుండి నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, సూర్యాపేట మధ్య కొత్త ఎలక్ట్రిక్ బస్సులు నడుస్తాయని తెలుస్తోంది. నేషనల్ ఎలక్ట్రిక్ బస్ కార్యక్రమం కింద తెలంగాణకు 450 బస్సులు మంజూరైనట్లు ప్రభుత్వం తెలిపింది.