మనతెలంగాణ/హైదరాబాద్: ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని టిఎస్ ఆర్టీసి కీలక నిర్ణయం తీసుకుంది. ఎంఎంటిఎస్, మెట్రో రైలు అందుబాటులో లేని ఏరియాల్లో ఎలక్ట్రిక్ బస్సులను నడపాలని నిర్ణయించింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్, మియాపూర్ డిపోల పరిధిలో ఈ బస్సులను నడిపేందుకు గ్రేటర్ హైదరాబాద్ జోన్ అధికారులు నిర్ణయించారు. సికింద్రాబాద్, పంజాగుట్ట, జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు,- ఫిల్మ్‌నగర్, ఉస్మానియా కాలనీల మీదుగా మణికొండ వరకు ఈ బస్సులను నడపాలని నిర్ణయించారు.
అదే విధంగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ నుంచి జూబ్లీ బస్‌స్టేషన్, సికింద్రాబాద్, తార్నాక, ఉప్పల్, ఎల్బీనగర్, ఇబ్రహీంపట్నం వరకు ఈ బస్సులను నడపాలని నిర్ణయించారు. మియాపూర్ డిపో పరిధిలో బాచుపల్లి – జేఎన్టీయూ – కెపిహెచ్‌బి, హైటెక్ సిటీ,- బయోడైవర్సిటీ , గచ్చిబౌలి వేవ్‌రాక్, – ప్రగతినగర్, వివిఐటీ వరకు ఈ ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తీసుకు రానున్నారు. ఈ ఎలక్ట్రిక్ బస్సులకు ట్రాకింగ్ సిస్టం అమర్చుతామని అధికారులు తెలిపారు. ప్రతి 30 నిమిషాలకో బస్సు అందుబాటులో ఉండే విధంగా బస్సులను నడుపనున్నారు.