త్వరలో మార్కెట్‌లోకి తేనున్న మారుతి సుజుకీ
‘ఇ విటారా’ పేరుతో విద్యుత్ కారును తీసుకువస్తున్న సంస్థ
భారత మార్కెట్‌లో నమ్మకమైన కంపెనీగా మారుతి సుజుకీ
టాటా కంపెనీ నుంచి ‘హారియర్’ పేరుతో విద్యుత్ కారు
న్యూఢిల్లీ : దేశంలో పెట్రోల్, డీజెల్ ధరలు విపరీతంగా పెరగడంతో భారతీయులు విద్యుత్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. ద్విచక్ర వాహనాలతో పాటు విద్యుత్ కార్లను వారు కొనుగోలు చేస్తున్నారు. అయితే, విద్యుత్ కార్ల విషయంలో బ్యాటరీ మన్నికపై వినియోగదారుల్లో ఒకింత అసంతృప్తి నెలకొంది. దీనిని గుర్తించిన ప్రముఖ వాహనాల తయారీ సంస్థ మారుతి సుజుకీ సరికొత్త విద్యుత్ కారును మార్కెట్‌లోకి తీసుకురానున్నట్లు తాజాగా ప్రకటించింది. ‘ఇ విటారా’ పేరుతో తీసుకువస్తున్న ఈ కారును ఒక్కసారి పూర్తిగా చార్జి చేస్తే 500 కిలోమీటర్లు ఆగకుండా ప్రయాణించవచ్చునని సంస్థ చెబుతోంది.
తయారీ తుది దశకు చేరుకుందని, ఈ ఏడాది చివరిలోగా ‘ఇ విటారా’ను మార్కెట్‌లోకి విడుదల చేస్తామని సంస్థ ప్రకటించింది. మరొక వైపు, భారత్‌కు చెందిన టాటా సంస్థ కూడా ఒక కొత్త విద్యుత్ కారును తీసుకురానున్నది. టాటా హారియర్ పేరుతో మార్కెట్‌లోకి విడుదల చేయనున్న ఈ కారులో 75 కెడబ్ల్యుహెచ్ లిథియం అయాన్ బ్యాటరీ అమర్చినట్లు సంస్థ తెలియజేసింది. దీనితో ఒక్కసారి పూర్తిగా చార్జి చేస్తే 500 కిలోమీటర్లు ప్రయాణించవచ్చునని సంస్థ తెలిపింది.
ఇ విటారా
మారుతి సుజుకీ కంపెనీపై భారతీయుల్లో నమ్మకం ఎక్కువ. వినియోగదారులు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని ఈ సంస్థ నిలబెట్టుకుంటున్నది. ఈ క్రమంలోనే భారత్‌లో తమ వినియోగదారుల కోసం సరికొత్త విద్యుత్ కారు ‘ఇ విటారా’ను తీసుకువస్తున్నట్లు సంస్థ తెలియజేసింది. ఈ కారులో రెండు బ్యాటరీలు ఉంటాయి. ఒకసారి పూర్తిగా చార్జి చేస్తే 500 కిలోమీటర్ల మైలేజి ఇస్తుందని సంస్థ తెలిపింది. ఈ కారుకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని సంస్థ తెలియజేసింది.