సిటీబ్యూరో ః గత రెండుమూడు సంవత్సరాలుగా పెట్రోల్, డీజిల్ ,గ్యాస్ వంటి ధరలు అడ్డుఅదుపు లేకుండా పెరుగుతున్నాయి .అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధరలుభారీ ఎత్తున తగ్గినా వాటి ప్రయోజనాలు వినియోగదారులకు ఏ మాత్రం చేరడం లేదు. గతంలో క్రూడ్‌ఆయిల్ ధరలు తగ్గిన వెంటనే ప్రభుత్వాలు వెంటనే స్థానికంగా ఇంధన ధరలు కూడా తగ్గించేవి. కాని ప్రస్తుతం ఆ పరిస్థితి ఎక్కడా కనిపంచడం లేదు.దీంతో వినియోగదారులు సాధారణ డీజిల్, పెట్రోల్, గ్యాస్ వాహనాలకు ప్రత్యామ్నాయంగా విద్యుత్‌తో నడిచే వాహనాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. కేంద్రా, రాష్ట్ర ప్రభుత్వాలు ఆయా వాహనాల మీద సబ్సిడి ఇవ్వడమే కాకుండా సదరు వాహనా సంస్థలు తమ అమ్మకాలను పెంచకునేందుకు ఆఫర్లను కూడా ప్రకటిస్తున్నాయి.
దీంతో గతంలో ఎన్నడూ లేని విధంగా రోడ్డు మీద విద్యుత్ వాహనాల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతుండటంతో విద్యుత్ చార్జింగ్ స్టేషన్ల పెంపుపై అధికారులు దృష్టి సారించారు. ప్రస్తుతం గ్రేటర్‌లో సుమారు 100 వరకు విద్యుత్ చార్జింగ్ స్టేషన్లు ఉండగా వాటి సంఖ్యను మరో 100 చార్జింగ్ స్టేషన్లు ఆరు నెలల్లో అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు అధికారులు కృషి చేస్తున్నారు. వీటి కోసం అందుబాటులో ఉన్న స్థలాలను వెతికే పనిలో పడ్డారు. జిహెచ్‌ఎంసి, హెచ్‌ఎండిఏ, టీఎస్‌పిడీసీఎల్, కార్యాలయాతో పాటు ప్రభుత్వ కార్యాలయాల్లో ఖాళీగా ఉన్న స్థలాలను విద్యుత్ వాహన చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు.
సాధారణంగా ఒక కారును పూర్తి స్థాయిలో చార్జింగ్ చేయాలంటే ఎంత లేదన్నా 6 నుంచి 8 గంటలు కానీ అధికారులు ఏర్పాటు చేయనున్న చార్జింగ్ స్టేషన్లలో కారు చార్జింగ్‌కు కేవలం 30 నిమిషాలు మాత్రమే పట్టేవిధంగా స్పీడ్‌గా చార్జింగ్ అయ్యే స్టేషన్ల ఏర్పాటు చేయనున్నారు. నిర్ణయించిన స్థలాల్లో కనీసం రెండు నుంచి నాలు వాహనాలు నిలిపేందుకు అవకాశం ఉన్న స్థలాలను ఎంపిక చేస్తున్నారు. వీటిలో 60 కిలో వాట్స్ సామర్థం ఉన్న చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు. వీటిలో ఒకే సారి రెండు వాహనాలు చార్జింగ్ చేసుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. ఒక చార్జింగ్ స్టేషన్లలో రెండు చార్జింగ్ గన్‌లతో రెండు వావాహనాలకు, అదే విధంగా స్ఠలం లభ్యతను బట్టి నాలుగు గన్‌లతో నాలుగు వాహనాలకు ఒకే సారి చార్జింగ్ చేసుకునే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. చార్జింగ్ స్టేషన్ల వివరాలను సులభంగా వాహనదారులు గుర్తించేలా ప్రత్యేకంగా యాప్‌ను ఏర్పాటు చేస్తున్నారు.
విద్యుత్ చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్న ప్రాంతాలు ఇవే..
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఫాస్ట్ చార్జింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. సెప్టెంబర్ నాటికి దుర్గం చెరువు, మల్కం చెరవు, గచ్చిబౌలీ స్టేడియం, నాగోల్ ఆర్‌టిఏ ట్రాక్, టిఎస్‌ఎస్..ఐఐఐటి, రాణిగంజ్ బస్టాప్ పార్కింగ్ లాట్,, కామత్ ఎదురుగా, ఓల్డ్ పాస్‌పోర్టు కార్యాలయం, మదర్ థెరీస్సా విగ్రహం ఎదురుగా,బేగం పేట, రైల్ నిలయం,అంబర్‌పేట పోలీస్ లైన్, తాజ్ బంజారా హోటల్, హయత్‌నగర్ ఎమ్మార్వో ఆఫీస్, ఎన్‌జివో కాలనీ,ఈ సేవా కేంద్రం, సరూర్‌నగర్ స్టేడియం, శేరిలింగంపల్లి జోనల్ కార్యాలయం తదితర ప్రాంతాల్లో మొత్తం 100 ప్రాంతాల్లో టిఎస్‌రెడ్కొ ఆధ్వర్యంలో చార్జింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు.విద్యుత్ చార్జింగ్ స్టేషన్లలో ఉపయోగించేలా ప్రత్యేక ప్రీపెయిడ్ కార్డును అందుబాటులోకి తీసుకుని అంశాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు.
స్మార్టు ప్రీపెయిడ్ కార్డును రూ.500 నుంచి 2000 వరకు రీచార్జ్ చేసుకునే అవకాశం ఉంటుందని దీనిపై పూర్తి స్థాయిలో చర్చించిన అనంతరం నిర్ణయం తీసుకుంటామని అధికారులు చెబతున్నారు.అంతే కాకుండా చార్జింగ్ స్టేషన్ల్‌లో విద్యుత్ యూనిట్ ధర ఎంత ఉండాలనే విషయంలో ఇంకా స్పష్టత రాలేదని, యూనిట్‌కు రూ.18 నుంచి 20 నిర్ణయించే అవకాశం ఉనట్లు తెలిసిందే . ప్రైవేట్ చార్జింగ్ స్టేషన్లలో యూనిట్‌కు రూ.18 నుంచి 20 వసూలు చేస్తున్నారు. విద్యుత్ చార్జింగ్ స్టేషన్లు అందుబాటులోకి వచ్చినట్లయితే విద్యుత్ వాహనాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.