తిరుమల: శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా టిటిడి విద్యుత్ శాఖ తిరుమలలో ఏర్పాటు చేసిన విద్యుత్ అలంకరణలతో తిరుమల కొండ వైకుంఠాన్ని తలపిస్తోంది. వైకుంఠం భువికి దిగివచ్చిందా అన్న చందంగా విద్యుత్ కాంతులతో తిరుమల కొండ భక్తులను కనువిందు చేస్తోంది.
శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా వాహన సేవలను వీక్షించేందుకు వచ్చిన లక్షలాదిమంది భక్తులను ఆకట్టుకునేందుకు శ్రీవారి ఆలయాన్ని ప్రత్యేకమైన పార్కన్, ఫకాడ్ లైటింగ్ తో టిటిడి అలంకరించింది. రంగురంగుల కాంతులతో శ్రీవారి ఆలయ గోడలను, మహాద్వార గోపురం, మాడ వీధులు, ముఖ్యమైన కూడళ్లు, ఆర్చిల వద్ద భక్తులు మైమరచేలా విద్యుత్ వెలుగులను శోభాయమానంగా అలంకరించారు. తిరుమలలోని ఇతర ఆలయాలు, గార్డెన్లు, చెట్లను కూడా ప్రత్యేక విద్యుత్ కాంతులతో సినిమా సెట్టింగ్ లను అలంకరణలు చేశారు. పురాణాలు, ఇతిహాసాల్లోని దేవతల రూపాలతో తిరుమల కొండ మొత్తం విద్యుత్ బోర్డులు ఏర్పాటు చేయడంతో భక్తులకు వైకుంఠంలో ఉన్న అనుభూతి కలుగుతోంది.
శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమలను కలియుగ వైకుంఠంగా అనుభూతి కలిగించేలా విద్యుత్ అలంకరణలకు టిటిడి రూ.2.20కోట్లు మంజూరు చేసింది. శ్రీవారి ఆలయ ప్రాంగణం, కళ్యాణ వేదిక, కూడళ్ల వద్ద టిటిడి 14 భారీ ఎలక్ట్రికల్ బోర్డులు, 30 చిన్న ఎలక్ట్రికల్ బోర్డులను ఏర్పాటు చేసింది. లక్ష్మీ వేంకటేశ్వర, సీతా రాములు, శ్రీరామ పట్టాభిషేకం, మహా విష్ణు, విశ్వరూపం, దశావతార రూపాలను భారీ ఎలక్ట్రికల్ బోర్డులతో ఏర్పాటు చేశారు. అష్ట లక్ష్ములు, తుంబూరుడు, అన్నమాచార్యుడి వంటి ఇతర రూపాలతో మరో 30 ఎలక్ట్రికల్ బోర్డులను ఏర్పాటు చేశారు. భక్తులకు విస్మయం కలిగేలా విద్యుత్ కాంతుల అలంకరణకు 100 మందికి పైగా టీటీడీ విద్యుత్ శాఖ సిబ్బంది నెల రోజులకు పైగా తీవ్రంగా శ్రమించారు.
విద్యుత్ అలంకరణలపై టిటిడి ఇఒ జె.శ్యామలరావు మాట్లాడుతూ… శ్రీవారిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించే భక్తులను బ్రహ్మోత్సవాల్లో ఆకట్టుకునేలా ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడేలా విద్యుత్ అలంకరణలను ఏర్పాటు చేసేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నామని తెలియజేశారు.
భక్తులు వాహన సేవలను తిలకించేందుకు తిరుమలలోని శ్రీవారి ఆలయ మాడ వీధులు, మ్యూజియం, వరహాస్వామి రెస్ట్ హౌస్, అన్నదానం కాంప్లెక్స్, రాంభగీచా, ఫిల్టర్ హౌస్, ఇతర ప్రాంతాల్లో 32 భారీ డిజిటల్ స్క్రీన్లను టిటిడి ఏర్పాటు చేసింది.
బ్రహ్మోత్సవాల సందర్బంగా తిరుమలకు విచ్చేసిన భక్తులను ఆకట్టుకునేలా జీఎన్సీ ఏరియాతో పాటు పలు పార్కుల్లో దేవతా రూపాలతో ప్రత్యేక ఎలక్ట్రికల్ కటౌట్ లు ఏర్పాటు చేశారు. తిరుమలలోనే కాకుండా తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనం, బస్టాండ్, రైల్వే స్టేషన్ స్వాగత తోరణాల వద్ద ప్రత్యేకమైన విద్యుత్ అలంకరణలను టిటిడి ఏర్పాటు చేసింది.