Monday, December 23, 2024

దేశంలో ఇవిల వినియోగం

- Advertisement -
- Advertisement -

ఈ కంప్యూటర్ యుగంలో సమాచారాన్ని ఒక దగ్గర నుండి ఇంకో దగ్గరికి పంపించడానికి అయ్యే ఖర్చు చాలా తక్కువ. కాని భౌతికంగా ఒక ప్రదేశం నుండి ఇంకో ప్రదేశానికి చేరుకోడానికి అయ్యే వ్యయం ఎక్కువ. ఈ కాలంలో ప్రతి ఒక్కరికీ వ్యక్తిగత వాహనాలు తప్పనిసరయ్యాయి. వీటిలో ఇంధనంగా ఎక్కువ శాతం పెట్రోల్ లేదా డీజిల్ ఉంటుంది. కానీ రోజు రోజుకీ వీటి ధరలు పెరుగుతున్నాయి. అలాగే ఇవి పునరుద్ధరించలేని ఇంధనాలు. వాతావరణ కాలుష్యం కూడా పెరుగుతుంది. అందుకే వీటి వాడకాన్ని తగ్గించవలసిన అవసరం ఎంతైనా ఉంది. వీటికి ప్రత్యామ్నాయం బ్యాటరీలతో నడిచే వాహనాలును వాడడమే. ఎలక్ట్రిక్ వాహనాల్లో ద్విచక్ర వాహనాలు, త్రి చక్ర వాహనాలు, కార్లు, బస్సులు, తేలికపాటి, భారీ సరుకు రవాణా వాహనాలు ఉన్నాయి. ఇవి వాయు కాలుష్యాన్ని కలిగించవు. తక్కువ వ్యయంతో ఎక్కువ దూరం ప్రయాణిస్తాయి. వార్షిక నిర్వహణా ఖర్చులు తక్కువ. శబ్ద కాలుష్యం కలిగించవు.

కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ తన వాహన డ్యాష్ బోర్డు ద్వారా విడుదల చేసిన డేటా ప్రకారం మొత్తం ఆటోమొబైల్ అమ్మకాలలో ఎలక్ట్రిక్ వాహనాలు 6 శాతం వాటా కలిగి ఉన్నాయి. మన దేశంలో మార్చి 2023 నాటికి ఈ వాహనాలు 20 లక్షలుకి పైగా నమోదయ్యాయి. ఫేమ్ ఇండియా డ్యాష్ బోర్డ్ ప్రకారం మే 22, 2023 నాటికి భారత దేశంలో మొత్తం 10,98,406 ఎలక్ట్రికల్ వాహనాలు విక్రయించబడ్డాయి. వాటిలో 9,88,676 ద్విచక్ర వాహనాలు, 96,376 మూడు చక్రాల వాహనాలు, 8,917 నాలుగు చక్రాల వాహనాలు ఉన్నాయి. వాహన విభాగంలో ఎలక్ట్రానిక్ వాహనాల అమ్మకాలు 2023 ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయి లో 11.7 లక్షల పైగా వాహనాలు నమోదయ్యాయి. ఇందులో ద్విచక్ర వాహనాలు 61 శాతం, త్రిచక్ర వాహనాలు 34% ఉన్నాయి. గత సంవత్సరం కేవలం ఒక్క మే నెలలోనే 69,901 వాహనాలు అమ్ముడుపోగా, 125 శాతం వృద్ధితో, 2023 సం. మే ఒక్క నెలలో మొత్తం ఎలక్ట్రిక్ వాహనాలు 1,57,338 అమ్ముడుపోయాయి. 2021లో విక్రయించబడిన సుమారు మూడు లక్షలతో పోల్చితే 300 శాతం అధికంగా 2022లో 10 లక్షలుకి పైగా ఎలక్ట్రిక్ వాహనాలు అమ్ముడు పోయాయి. విక్రయించిన మొత్తం ఎలక్ట్రిక్ వాహనాలలో 62 శాతం ద్విచక్ర వాహనాలదే కావడం విశేషం. ఇందులో మొదటి రెండు స్థానాలలో ‘ఓలా’, ‘టివియస్‌లున్నాయి. 2030 సంవత్సరం నాటికి అన్ని వాహనాల లో 30 శాతం ఎలక్ట్రిక్ వాహనాలు తయారుచేయాలని మన దేశం లక్ష్యంగా పెట్టుకుంది.

కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు శిలాజ ఇంధనంపై ఆధారపడటాన్ని తగ్గించడం, వాహన ఉద్గారాల సమస్యలను పరిష్కరించే లక్ష్యంతో 2015లో కేంద్ర ప్రభుత్వం ఫాస్టర్ అడాప్షన్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ ఆఫ్ హైబ్రిడ్ అండ్ ఎలక్ట్రికల్ వెహికల్స్ (ఎఫ్.ఎ.యం.ఇ ఫెమా) పథకాన్ని ప్రారంభించింది. ఫేమ్ -2 01 ఏప్రిల్ 2019 నుండి 5 సంవత్సరాల పాటు అమలు చేయబడుతోంది. దీని మొత్తం బడ్జెట్ మద్దతు రూ. 10,000 కోట్లు. బ్యాటరీ ధరలను తగ్గించడానికి దేశంలో అధునాతన రసాయనిక బ్యాటరీ తయారీకి ఉత్పత్తి అనుబంధిత ప్రోత్సాహకం పథకాన్ని 12 మే, 2021న ప్రభుత్వం ఆమోదించింది. ఈ పథకానికి కేంద్రం ఐదేళ్ల కాలానికి రూ. 25,9380 కోట్లు కేటాయించింది.

ఎలక్ట్రిక్ వాహనాలపై జియస్‌టి ని 12 శాతం నుండి 5 శాతానికి, అలాగే చార్జర్లు, ఛార్జర్ కేంద్రాలపై 18 శాతం నుండి 5 శాతానికి తగ్గించింది. ఇంకా వాహనాలపై విధించే రహదారి పన్నును మినహాయించాలని రాష్ట్రాలకు సూచించింది. ప్రపంచ దేశాలతో పాటు భారత్‌లోనూ ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు క్రమంగా పెరుగుతున్నాయి. కొనుగోలుదారులు కూడా ఇవిలు కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో చాలా సంస్థలు ఎలక్ట్రిక్ వాహనాల తయారీలోకి అడుగుపెట్టాలని ప్రయత్నిస్తున్నాయి.

ఎలక్ట్రానిక్ వాహనాలు వాడడానికి కొన్ని ప్రతికూలతలు ఉన్నాయి.ఇవి ఎక్కువ ధరను కలిగి ఉంటాయి. బ్యాటరీ ఎక్కువ కాలం పని చేయకపోవడం, రీ ఛార్జింగ్ కేంద్రాలు రోడ్డు పొడవునా లేకపోవడం, తక్కువ వేగం, సాఫ్ట్ వేర్ సమస్యలు మొదలైనవి.వాహనాల సంఖ్య ఎక్కువయ్యే కొలదీ ఈ ప్రతికూలతలును అధిగమించవచ్చు. నాణ్యత ఎక్కువగా ధర తక్కువగా ఉండే విధంగా రీ ఛార్జ్ బ్యాటరీలు, విడి భాగాలు అందుబాటులో ఉండాలి. చార్జింగ్ స్టేషన్లూ అందుబాటులో ఉండాలి. పర్యావరణ కాలుష్యం లేకుండా పాడైపోయి న బ్యాటరీలు పారవేయుటకు సమర్థవంతమైన నిర్వహణా పద్ధతులను అమలు చేయాలి.

డి జె మోహన రావు- 9440485824

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News