Monday, December 23, 2024

విద్యుద్దుకాణాలు!

- Advertisement -
- Advertisement -

Electricity Amendment Bill 2022 దేశ ప్రజల మెడ మీద సునిశిత ఖడ్గంలా వేలాడుతూ వచ్చిన విదుత్తు (సవరణల) బిల్లు 2022 పై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం కావడంతో దానిని స్థాయీ సంఘం పరిశీలనకు పంపిన ప్రధాని మోడీ ప్రభుత్వం అందులోని అంశాలతోనే తాజాగా ఉత్తర్వులు జారీ చేయడంలోని మోసం ఇంత అంత అని చెప్పలేనిది. కొత్త విద్యుత్తు బిల్లు ప్రస్తుతానికి అటకెక్కిపోయినట్టేనని భావించి నిష్పూచీగా వున్న సమయంలో ప్రజలపై తలపెట్టిన తీవ్ర విద్రోహ చర్య ఇది. ప్రస్తుతం అమల్లో వున్న 2003 నాటి విద్యుత్తు చట్టానికి చేర్పులు చేయడం ద్వారా పంపిణీ రంగంలో ప్రైవేటు రంగానికి కేంద్రం తలుపులు తెరిచింది. రాష్ట్ర ప్రభుత్వాల ఆధీనంలో నడుస్తున్న పంపిణీ సంస్థలను నిర్వీర్యం చేసి అంతిమంగా విద్యుత్తు సరఫరాను ఒక దుకాణంగా మార్చి దానిని ప్రైవేటు పరం చేయడానికే కేంద్రం ఈ చర్యకు పాల్పడింది. ఇది ఎంత అమానుష చర్య అంటే ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వాలు తమ ప్రజల, రైతుల ఆర్థిక దుస్థితిని దృష్టిలో వుంచుకొని రాయితీపై వారికి చేస్తున్న విద్యుత్తు సరఫరా ఇక ముందు ఆగిపోతుంది.

బజారులో సరకులు కొనుక్కొనే రీతిలోనే ప్రైవేటు పంపిణీదారుల లాభార్జన దాహాన్ని తీరుస్తూ నిత్యావసర కరెంటును ప్రజలు కొనుగోలు చేసుకోవలసి వస్తుంది. ప్రాంతానికొక్కటి చొప్పున అనేక ప్రైవేటు పంపిణీ సంస్థలు వెలుస్తాయి. సెల్‌ఫోన్ కనెక్షన్లు తీసుకుంటున్న మాదిరిగానే ప్రజలు ఈ సంస్థల నుంచి విద్యుత్తు సరఫరాను పొందవలసి వుంటుంది. దేశంలో ప్రస్తుతం ప్రతి యూనిట్ విద్యుత్తుకు సగటున రూ. 7.45 చెల్లిస్తున్నాము. ఇందులో ప్రభుత్వ పంపిణీ సంస్థలు కొంత రాయితీని భరిస్తున్నాయి. ఇక ముందు ఈ సౌకర్యం వుండదు. తెలంగాణలో రైతులకు ఉచితంగా నాణ్యమైన విద్యుత్తును ఇస్తున్నారు. గృహ విద్యుత్తు ఛార్జీలు పెంచక తప్పని పరిస్థితి ఎదురైనా రాష్ట్రాలు నిగ్రహాన్ని పాటించి ఆ నిర్ణయాన్ని వాయిదా వేస్తున్నాయి. ఇక ముందు ఇటువంటివేమీ వుండకుండా చేయాలనే మొండి పట్టుదలతోనే ప్రధాని మోడీ ప్రభుత్వం విద్యుత్తు చట్టంలో తాజా నిబంధనలను చేర్చింది. విద్యుత్తు పంపిణీ బాధ్యతను చేపట్టడానికి ముందుకు వచ్చే వ్యక్తులకు లేదా సంస్థలకు ప్రాంతాలను కేటాయించే హక్కును మాత్రం రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చింది.

ఒక మునిసిపల్ కార్పొరేషన్ మొత్తాన్ని గాని, పక్కపక్కనే వుండే మూడు రెవెన్యూ జిల్లాలను గాని ప్రైవేటు సంస్థలకు కేటాయించవచ్చునని, రాష్ట్ర ప్రభుత్వాలు అవసరమనుకుంటే ఇంతకంటే తక్కువ ప్రాంతాలను కూడా ఇవ్వవచ్చునని చట్టంలో కేంద్రం చేర్చిన తాజా నిబంధనలు పేర్కొంటున్నాయి. లాభార్జన దృష్టితో మాత్రమే రంగంలోకి దిగే ప్రైవేటు సంస్థలు సునాయాసంగా డబ్బు వసూలు అయ్యే నగరాలకు, పట్టణాలకు, పరిశ్రమలకు సరఫరా చేసేలా ప్రాంతాలను ఎంచుకుంటాయి. పల్లెలకు, వ్యవసాయానికి సరఫరా చేసే బాధ్యత ప్రభుత్వ పంపిణీ సంస్థల మీద వుంటుంది. ఒక నిబంధన ప్రకారం ప్రతి మూడు మాసాలకు విదుత్తు పంపిణీ లెక్కలను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించే బాధ్యతను ఇఆర్‌సి (విద్యుత్తు సరఫరా క్రమబద్ధీకరణ సంస్థలు)ల పై వుంచడం ఈ నిబంధనలలోని గణనీయమైన అంశం. అందులో రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకిచ్చే రాయితీ విద్యుత్తు ఖర్చు వసూలయిందో లేదో ఇంకెంత సొమ్ము అవి బకాయి పడ్డాయో తెలియజేయవలసి వుంటుంది. ప్రస్తుతం దేశంలోని డిస్కంలకు రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు, ఇతర సంస్థలు చెల్లించవలసిన బకాయి రూ. 76 వేల కోట్లని ఒక సమాచారం.

అలాగే రైతులకు ఉచిత విద్యుత్తు కింద, బలహీన వర్గాలకు సబ్సిడీపై చేసిన సరఫరా కింద రాష్ట్ర ప్రభుత్వాలు డిస్కంలకు రూ. 78 వేల కోట్లు బకాయి పడినట్లు ఈ సమాచారం తెలియజేస్తున్నది. ఈ బకాయిలను రాష్ట్ర ప్రభుత్వాలు తమ వీలును బట్టి, నిధుల అందుబాటును బట్టి చెల్లిస్తూ పోతున్నాయి. ఇక ముందు ఆ వెసులుబాటు వుండదు. అంటే ప్రజలకు ఎటువంటి విద్యుత్తు రాయితీ కల్పించే అవకాశం లేకుండా దారులు మూసేయడమే కేంద్ర ప్రభుత్వ ఉద్దేశమని స్పష్టపడుతున్నది. విద్యుత్తు సంస్కరణలను దేశంలోని రైతాంగంమంతా వ్యతిరేకించింది. ఢిల్లీ సరిహద్దుల్లో ఏడాది పాటు సాగిన చరిత్రాత్మక రైతు ఉద్యమం తన డిమాండ్లలో ఒకటిగా ఈ బిల్లు రద్దును కూడా చేర్చింది. రైతులు వ్యతిరేకించిన వ్యవసాయ చట్టాల్లోని కార్పొరేట్ అనుకూల నిబంధనలను కూడా ఇలాగే దొడ్డి దారిలో అమల్లోకి తేవడానికి కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నుతున్నట్లు తెలుస్తున్నది. ప్రైవేటు రంగానికి అధిక లాభాలు చేకూర్చడమే ప్రధాని మోడీ ప్రభుత్వ ఉద్దేశమని స్పష్టపడుతున్నది. దేశ విద్యుత్తు ఉత్పాదన సామర్థం 4 లక్షల మెగావాట్లు కాగా, స్థాపిత సామర్థంలో 49.5 శాతం ప్రైవేటు రంగం చేతుల్లోనే వున్నది. మిగతాది కూడా దానికి అతి చవకగా ధారాదత్తం చేయాలని, ప్రభుత్వ రంగంలో సమకూర్చుకున్న మౌలిక సదుపాయాలన్నింటినీ కట్టబెట్టాలని ప్రధాని మోడీ ప్రభుత్వం చూస్తున్నది. ఈ మోసాన్ని అడ్డుకోడానికి మరో మహా ఉద్యమం అవసరం కనిపిస్తున్నది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News