మన తెలంగాణ / హైదరాబాద్ : ప్రభుత్వం అమలు చేస్తున్న గృహజ్యోతి పథకంతో లక్షలాది మంది వినియోగదారులకు కరెంటు బిల్లుల్లో ఉపశమనం కలుగుతోంది. ప్రభుత్వం అందిస్తున్న ఉచిత కరెంటుతో ప్రతి కుటుంబానికి రూ.900 నుంచి వెయ్యి రూపాయల భారం తగ్గుతోంది. గృహజ్యోతి పథకంతో వినియోగదారులకు దాదాపుగా రూ.1000కోట్ల వరకు లబ్ధి జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ లో గృహజ్యోతి అమలుకోసం రూ.2,418 కోట్లను కేటాయించింది. గత మార్చి నుంచి జులై నాటికి మొత్తంగా ఒక కోటీ 79 లక్షల 33 వేల 430 జీరో బిల్లులు జారీ చేసింది. ఈ బిల్లులకు సంబంధించి ప్రభుత్వం మొత్తంగా రూ.640.94 కోట్లు డిస్కంలకు చెల్లించింది. ఆగస్టు నాటికే ఈ జీరో బిల్లుల సంఖ్య రెండుకోట్లకు చేరింది. తాజాగా సెప్టెంబర్ నెలకు సంబంధించిన బిల్లులు ఈ నెలలో జారీ అవుతున్నాయి. బిల్లింగ్ పూర్తయితే రెండున్న కోట్ల జీరో బిల్లులు జారీ అయ్యే అవకాశం ఉంది. ఇలా దాదాపు రూ.1000కోట్లకు పైగా పేద, మధ్యతరగతి వర్గాలకు లబ్ధి చేకూరినట్లవుతుంది.
ఇప్పటివరకూ 50 లక్షల ఇళ్లకే ఉచితం అమలు : రాష్ట్రంలో గృహజ్యోతి పథకం కింద ఉచిత విద్యుత్పందుతున్న కుటుంబాల సంఖ్య 50లక్షలకు చేరువైంది. ఇటీవల మరోసారి అవకాశం ఇవ్వడంతో జీరో బిల్లులు అందుకుంటున్న వినియోగదారుల సంఖ్య భారీగా పెరిగింది. జులై నాటికి గృహ జ్యోతికి అర్హత కలిగిన కుటుంబాల సంఖ్య 46 లక్షల 19 వేల 236 కాగా, వీరందరికీ డిస్కంలు జీరోకరెంట్ బిల్లులు జారీ చేశాయి. ఆగస్టు నాటికి ఈ సంఖ్య 48.90లక్షలకు చేరింది. రాష్ట్ర ప్రభుత్వం 2024 మార్చి 01 నుంచి గృహజ్యోతి పథకాన్ని అమలు చేస్తోంది. 200 యూనిట్ల లోపు వినియోగించే లబ్ధిదారులకు జీరో బిల్లులు ఇష్యూ చేసి, ఆ మొత్తాన్ని సర్కారే చెల్లిస్తోంది. స్కీం ప్రారంభించే నాటికి 200 యూనిట్ల లోపు కరెంటు వాడుతున్న కుటుంబాల సంఖ్య 33 లక్షల 86 వేల 507గా ఉంది. అప్పట్లో ప్రత్యేకంగా ప్రజాపాలన కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించగా డేటా ఎంట్రీ సమయంలో జరిగిన పొరపాట్ల కారణంగా పలువురు స్కీముకు దూరమయ్యారు. దీంతో ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు ప్రభుత్వం కొత్తగా సవరణకు అవకాశం కల్పించగా లబ్దిదారుల సంఖ్య భారీగా పెరిగింది.
గృహజ్యోతి ఉచిత కరెంట్ పథకం : కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీల అమల్లో భాగంగా గృహజ్యోతి పథకం అమలు చేస్తోంది.ఈ పథకం కింద 200 యూనిట్లలోపు కరెంట్ వాడే నిరు పేదలకు ఉచిత కరెంట్ ఇస్తున్నారు. అంటే 200 యూనిట్లలోపు కరెంట్ వాడే వారు బిల్లులు చెల్లించాల్సిన పని లేదు. గత ఆరు నెలల క్రితమే ఈ పథకం అమల్లోకి వచ్చింది. అయితే ఇప్పటికి అర్హులైన చాలా మందికి ఈ పథకం అమలు కావటం లేదు. రాష్ట్రంలో 1.08 కోట్ల వినియోగదారులు ప్రతి నెలా 200 యూనిట్లలోపు కరెంటు వాడుతున్నా ఇవన్నీ పూర్తిగా గృహజ్యోతి ఉచిత కరెంట్ పథకం పరిధిలోకి రాలేదు. ఇప్పటివరకూ రెండు డిస్కంలకు అఫ్లికేషన్లు ఇచ్చిన దాదాపు 50 లక్షల కుటుంబాలను గుర్తించి గృహజ్యోతి పథకం కింద నెలనెలా ఆయా వినియోగదారులకు జీరో కరెంటు బిల్లులను డిస్కంలు జారీచేస్తున్నాయి. సౌత్ డిస్కం పరిధిని చూసుకుంటే 39.15 లక్షల వినియోగదారులు 200 యూనిట్లలోపే విద్యుత్ వాడుతున్నారు. కానీ ఇప్పటి వరకూ 23 లక్షల ఇళ్లకు మాత్రమే గృహజ్యోతి పథకం కింద జీరో కరెంట్ బిల్లులు జారీ చేస్తున్నారు. మిగిలిన ఇళ్లలో కొందరికి రేషన్‌కార్డులు లేవు. కొన్ని కుటుంబాలకు రెండు లేదా అంతకుమించి ఇళ్లలో ఒకే పేరుతో విద్యుత్ మీటర్ కనెక్షన్లు ఉన్నట్లు గుర్తించారు. ఆయా కారణాలతో వారికి గృహజ్యోతి పథకం వర్తించటం లేదు. ఈ నేపథ్యంలో రేషన్‌కార్డు ఉన్న కుటుంబ ఓనర్ పేరుతో ఒకటికి మించిన ఇండ్లకు కరెంటు కనెక్షన్లు ఉంటే వాటిలో ఒక ఇంటికి గృహజ్యోతి పథకం కింద జీరో బిల్లు ఇవ్వనున్నట్లు అధికారులు వెల్లడించారు. అన్ని అర్హతలు ఉన్నా ఇప్పటికీ ఈ పథకం వర్తించని వారు సమీపంలోని విద్యుత్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని చెబుతున్నారు. అధికారులు పరిశీలన చేసి గృహజ్యోతి పథకాన్ని అమలు చేస్తాయని డిస్కంల వర్గాలు వెల్లడించాయి. ఆందోళన చెందకుండా ఆయా వినియోగదారులు విద్యుత్ శాఖ అధికారులను సంప్రదించాలన్నారు.
గృహ జ్యోతి బిల్లు రూ.3,914 కోట్లు : రాష్ట్రంలో 200 యూనిట్ల లోపు కరెంటు వాడే ఇళ్ల కనెక్షన్లు 1,08,86,519 ఉన్నాయని విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు వెల్లడించాయి. ఈ ఇళ్ల నుంచి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024- 25)లో కరెంటు బిల్లుల రూపంలో రూ.3,914.36 కోట్ల ఆదాయం వస్తుందని పేర్కొన్నాయి. గృహజ్యోతి పథకం కింద ఈ ఇళ్లకు ఉచితంగా విద్యుత్ సరఫరాకు ఆదేశించినందున ఈ బిల్లుల సొమ్మును రాష్ట్ర ప్రభుత్వమే నేరుగా డిస్కంలకు అందచేయనుందని తెలిపాయి. ఈ మేరకు రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలికి నివేదిక ఇచ్చాయి. నెలకు 201కి పైగా యూనిట్ల కరెంటు వాడే ఇళ్ల నుంచి రూ.4,374 కోట్ల ఆదాయం వస్తుందని పేర్కొన్నాయి.
అర్హులు దరఖాస్తు చేసుకోవచ్చు : రాష్ట్రంలో 1.08 కోట్ల ఇళ్లలో నెలకు 200 యూనిట్లలోపు కరెంటు వాడుతున్నా ఇవన్నీ పూర్తిగా గృహజ్యోతి పరిధిలోకి రాలేదు. ఇప్పటివరకూ డిస్కంలకు దరఖాస్తులు ఇచ్చిన దాదాపు అరకోటి కుటుంబాలను గుర్తించి ఈ పథకం కింద నెలనెలా జీరో కరెంటు బిల్లులను డిస్కంలు జారీచేస్తున్నాయి. ఉత్తర డిస్కం పరిధిలో 39.15 లక్షల ఇళ్లలో 200 యూనిట్లలోపే వాడుతున్నా ఇప్పటివరకూ 23 లక్షల ఇళ్లకు గృహజ్యోతి వర్తింపచేశారు. మిగిలిన ఇళ్లలో కొందరికి రేషన్‌కార్డులు లేకపోవడం, కొన్ని కుటుంబాలకు 2 లేదా అంతకుమించి ఇళ్లలో ఒకే పేరుతో కరెంటు కనెక్షన్ ఉండటం వంటి కారణాలతో ఈ పథకాన్ని వర్తింపచేయలేదు. రేషన్‌కార్డు ఉన్న కుటుంబ యజమాని పేరుతో ఒకటికి మించిన ఇళ్లకు కరెంటు కనెక్షన్లు ఉంటే వాటిలో ఒకదానికి ఉచిత కరెంటు పథకం కింద జీరో బిల్లు ఇస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఇప్పటివరకూ ఈ పథకం వర్తించని వారు అర్హులైతే సమీపంలోని విద్యుత్ కార్యాలయంలో దరఖాస్తు ఇస్తే గృహజ్యోతి పథకాన్ని అమలు చేస్తున్నట్లు డిస్కంల వర్గాలు తెలిపాయి.