యుపిఐ పేమెంట్స్‌కు తొలగిన అడ్డంకులు
గూగుల్‌పే, ఫోన్‌పేతో ఇంటిలో నుంచే చెల్లించే వీలు
బిబిపిఎస్‌లో చేరిన విద్యుత్ సంస్థలు
హైదరాబాద్: విద్యుత్ బిల్లుల చెల్లింపులకు సంబంధించి వినియోగదారులు ఎదుర్కొంటున్న సమస్యలకు చెక్ పడనున్నది. గతంలో మాదిరిగా గూగ్‌ల్‌పే, ఫోన్‌పే, పేటిఎం తదితర యుపిఐ మార్గాల్లో చెల్లించేందుకు అడ్డంకులు తొలగిపోయాయి. త్వరలో పాత విధానంలోనే నెల నెలా బిల్లులు చెల్లించే వీలు కలుగుతుందని భారత్ బిల్‌పే లిమిటెడ్ (బిబిఎల్) సిఇఒ నుపూర్ చతుర్వేది సూచించారు. భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ (బిబిపిఎస్) ద్వారా మాత్రమే చెల్లింపులు జరగాలని భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బిఐ) ఆదేశించిన విషయం విదితమే. దీనితో జూలై 1 నుంచి యుపిఐ ద్వారా విద్యుత్ బిల్లులు చెల్లించడం కుదరడం లేదు. ఆర్‌బిఐ నిర్ణయం కారణంగా విద్యుత్ బిల్లులు చెల్లించేందుకు వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
దీనితో తెలుగు రాష్ట్రాల విద్యుత్ సంస్థలు స్పందించాయి. బిల్లు చెల్లింపులను సులభతరం చేసేందుకు టిజిఎస్‌పిడిసిఎల్, టిజిఎన్‌పిడిసిఎల్‌తో పాటు ఆంధ్ర ప్రదేశ్‌లోని ఎపిసిపిడిసిఎల్ సంస్థలు భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్‌లో చేరాయి. ఫలితంగా యుపిఐలతో పాటు బ్యాంకులు, ఇతర ఫిన్‌టెక్ సంస్థల సాయంతో విద్యుత్ బిల్లు చెల్లించే అవకాశం వినియోగదారునికి కలుగుతుందని చతుర్వేది తెలియజేశారు. హైదరాబాద్ కేంద్రంగా ఉన్న టిజిఎస్‌పిడిసిఎల్ ఇప్పటికే ఫోన్‌పే ద్వారా చెల్లింపులను స్వీకరిస్తోంది. త్వరలో గూగుల్‌పే, అమెజాన్‌పేతో కూడా చెల్లించవచ్చునని అధికారులు సూచించారు.