విద్యుత్ సంస్థలు నష్టాలను సమీక్షించుకోవాలి : తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ
మన తెలంగాణ / హైదరాబాద్ : అడిషనల్ కన్సంప్షన్ డిపాసిట్ (ఏసీడీ) పేరుతో వినియోగదారుల నుండి విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కంలు) వసూలు చేస్తున్న అదనపు బిల్లులపై సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. వందల రూపాయలలో బిల్లులు కట్టే విద్యుత్ వినియోగదారులకు, అదనంగా వేల రూపాయలలో వస్తున్న ఈ బిల్లులపై విద్యుత్ శాఖ కనికరం చూపాలని వేడుకుంటున్నారు. అడిషనల్ కన్సంప్షన్ డిపాసిట్ ను ఎందుకు వేస్తున్నారో, ఎలా లెక్కలు కడుతున్నారో తమకు తెలియడం లేదంటున్నారు. ఏసీడీ పై అవగాహన కల్పించడంలో విద్యుత్ సంస్థలు చర్యలు తీసుకోవాలంటున్నారు.
అడిషనల్ కన్సంప్షన్ డిపాసిట్ పేరుతో వసూళ్లు ?
మొదటగా అసలు ఏసీడీ అనే పదం మొత్తం విద్యుత్ చట్టంలో కానీ, తెలంగాణ విద్యుత్ వ్యవస్థను నియంత్రించే తెలంగాణ రాష్ట్ర విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ (టిఎస్‌ఈఆర్‌సీ ) నిబంధనలలో గానీ ఎక్కడా తమకు కనిపించడంలేదంటున్నారు. కేవలం టిఎస్ ఈఆర్‌సి ఇచ్చిన నిబంధనలలో అడిషనల్ సెక్యూరిటీ డిపాజిట్ (ఏఎస్‌డి ) అనే పదం మాత్రమే కనబడుతోందంటున్నారు. రెగ్యులేటరీ కమిషన్ ఇచ్చిన రెగ్యులేషన్ 6, 2004 ప్రకారం, డిస్కంలు వినియోగదారులకు కొత్తగా విద్యుత్ కనెక్షన్ ఇచ్చేటప్పుడు అడిషనల్ సేకురిటీ డిపాజిట్ (ఏఎస్‌డి)ని వసూలుచేయవచ్చునని ఉందంటున్నారు. కాగా ఏఎస్‌డిని మూడు దశలలో ప్రస్తుతం వసూలు చేస్తున్నారు. ఇందులో గృహ వినియోగదారులకు కొత్తగా కనెక్షన్ ఇచ్చేటప్పుడు ఏఎస్‌డి క్రింద కిలోవాట్ కు సుమారు రూ 80 – నుండి రూ 300- వరకు వసూలు చేస్తున్నారు. కాగా పరిశ్రమలకు, వ్యాపార వర్గాలకు ఈ ఛార్జీలు వేరుగా ఉన్నాయి. ఒక సారి కనెక్షన్ ఇచ్చిన తరువాత ఏడాది పాటు వినియోగదారుడు వాడిన సగటు విద్యుత్తు వినియోగం లెక్కగట్టి , 2 లేదా 3 నెలల సగటు వినియోగం మొత్తాన్ని ఏఎస్‌డి రూపంలో మరోసారి వసూలు చేస్తున్నారు. ఆ పై ప్రతీ ఏటా ఆ ఏడాది సగటు వినియోగాన్ని, అంతకు ముందు ఏడాది సగటుతో పోల్చి చూసి మరో సారి ఏఎస్‌డిని వసూలు చేస్తున్నారంటున్నారు. ఒకవేళ వినియోగం తగ్గితే ఆ మేరకు ఏఎస్‌డిని వినియోగదారులకు బిల్లులలో అడ్జస్ట్ చేసి తగ్గిస్తారని అంటున్నారు. ఈ ఏఎస్‌డి కేవలం డిపాజిట్ మాత్రమేనని, ఈ మొత్తం వినియోగదారుడి పేరుమీదనే విద్యుత్ సంస్థల వద్ద ఉంటుందని చెబుతున్నారు.
విద్యుత్ సంస్థలు నష్టాలను సమీక్షించుకోవాలి : తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ
నిబంధనలకు విరుద్దంగా పేదా, గొప్పా అని చూడకుండా వేల కోట్ల రూపాయలను వసూలు చేసే పరిస్థితి ఎందుకు వచ్చిందో విద్యుత్ సంస్థలు సమీక్షించుకోవాలని తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ ఒక ప్రకటనలో పేర్కొంది. ప్రభుత్వ సంస్థల విద్యుత్ బకాయిలు ఇప్పటికే 21,000 కోట్ల రూపాయలు దాటాయని, ప్రభుత్వాన్ని ఒప్పించి ఈ బకాయిలు వసూలు చేయగలిగితే చాలా మేరకు ఉపశమనం లభిస్తుందని తెలిపింది. విద్యుత్ కొనుగోలు ఖర్చులు తగ్గించు కోవడం, విద్యుత్ వినియోగంలో సామర్ధ్యాన్ని పెంచడం, సరఫరా పంపిణీ నష్టాలను నియంత్రించడంపై విద్యుత్ సంస్థలు దృష్టి పెడితే తప్పకుండా ఫలితం ఉంటుందని పేర్కొంది. అప్పటి దాకా అనవసర భారాలు వేయకుండా ఉంటే ప్రజలు హర్షిస్తారని తెలిపింది.