Sunday, December 22, 2024

తెలంగాణలో ‘పవర్’ ఫుల్… ఛార్జీలు లెస్

- Advertisement -
- Advertisement -

బిజెపి, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో పవర్ లెస్..ఛార్జీలు ఫుల్

ఆ రెండు పార్టీల పాలిత రాష్ట్రాల్లో విద్యుత్ ఛార్జీల
పేరుతో ప్రజల వీపు విమానం మోత విద్యుత్
సంక్షోభంతో మూసివేత దిశగా వేలాది పరిశ్రమలు
గుజరాత్‌లోనే 27వేల చిన్న, మధ్యతరహా
పరిశ్రమల మూసివేత నాణ్యమైన విద్యుత్‌ను
అందిస్తున్న తెలంగాణపై బిజెపి, కాంగ్రెస్ అక్కసు

మనతెలంగాణ/హైదరాబాద్: కాంగ్రెస్,బిజెపి పాలిత రాష్ట్రాల కన్నా కొత్త రాష్ట్రమైన తెలంగాణలోనే విద్యుత్ చార్జీ లు అతి తక్కువగా ఉన్నాయి. దీంతోపాటు నిరంతర, నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేయడంలో తెలంగాణ అగ్రస్థానంలో ఉండగా, ఆ రెండు పార్టీల రాష్ట్రాలు మా త్రం ఈ విషయంలో చతికిలబడ్డాయి. డబుల్ ఇంజన్ రాష్ట్రాలుగా ప్రగల్భాలు పలికే బిజెపి పాలిత రాష్ట్రాలు నిరంతరం, నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేయడంలో విఫలమయ్యాయి. దీంతోపాటు బిజెపి, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లోలో ఓల్టేజీ సమస్యతో ప్రజలు, పారిశ్రామికవేత్తలు నానా ఇబ్బందులు పడుతుండగా, కొన్ని వేల పరిశ్రమలు విద్యుత్ సంక్షోభం కారణంగా మూసివేత దిశగా పయనిస్తున్నాయి. 2020–21 సంవత్సరంలో విద్యుత్ సమస్యతో ప్రధాని మోడీ సొంత రాష్ట్రమైన గుజరాత్‌లో సుమారుగా 27 వేల చిన్న, మధ్యతరహా పరిశ్రమలు మూతపడ్డాయని జాతీయ వార్త లు సంస్థలు సైతం కథనాలను ప్రచురించడం గమన్హారం. అధికంగా బీహార్ రాష్ట్రంలో 1 యూనిట్ నుంచి 100 యూనిట్‌లోపు వాడకానికి ఛార్జీలు
రూ. 6.1లను వసూలు చేస్తుండగా, ఉత్తరప్రదేశ్‌లో 1 యూనిట్ నుం చి 151 యూనిట్‌లోపు విద్యుత్ వాడకానికి చార్జీలు రూ.5.5 లు గా, అస్సాంలో 1 యూనిట్ నుం చి 120 యూనిట్‌లోపు రూ.5.3లుగా అక్కడి రాష్ట్రాలు ప్రజల నుంచి వసూలు చేస్తున్నాయి.

దీంతోపాటు మహారాష్ట్రలో 1 యూనిట్ నుంచి 100 యూనిట్‌లోపు చార్జీలు రూ.4.71లుగా, మధ్యప్రదేశ్‌లో 1 యూనిట్ నుంచి 50 యూనిట్‌లోపు చార్జీలు రూ.4.21లుగా, రాజస్థాన్‌లో 1 యూనిట్ నుంచి 50 యూనిట్‌లోపు చార్జీలు రూ.4.75 పైసలుగా వసూలు చేస్తున్నారు. ఇక కర్ణాటకలో 1 యూనిట్ నుంచి 50 యూనిట్‌లోపు చార్జీలు రూ.4.15 పైసలుగా, గుజరాత్‌లో 1 యూనిట్ నుంచి 50 యూనిట్‌లోపు చార్జీలు రూ.3.05 పైసలుగా, ఉత్తరాఖండ్‌లో 1 యూనిట్ నుంచి 100 యూనిట్‌లోపు చార్జీలు రూ.2.9 పైసలుగా ఉండగా, తెలంగాణలో 1 యూనిట్ నుంచి 50 యూనిట్‌లోపు ఛార్జీలు రూ.1.95 పైసలుగా వసూలు చేస్తున్నారు. అదేవిధంగా తెలంగాణలో 51 యూనిట్ నుంచి 100 యూనిట్‌లోపు చార్జీలు రూ.3.01 పైసలుగా, 101 యూనిట్ నుంచి 200 యూనిట్‌లోపు చార్జీలు రూ.4.8 పైసలుగా మాత్రమే వసూలు చేస్తున్నారు. ఒక యూనిట్ నుంచి 50 యూనిట్లను తీసుకున్నా, 51 యూనిట్ నుంచి 100 యూనిట్‌లను తీసుకున్నా తెలంగాణలోనే అతి తక్కువ విద్యుత్ చార్జీలను ప్రభుత్వం వసూలు చేస్తోంది.

సాగుకు 24 గంటల ఉచిత విద్యుత్

రాష్ట్రం ఏర్పడేనాటికి వ్యవసాయానికి పగలు 3 గంటలు, రాత్రి 9 గంటలు మాత్రమే విద్యుత్ సరఫరా అయ్యేది. ఇప్పుడు వ్యవసాయరంగా నికి 24 గంటల ఉచిత విద్యుత్‌ను అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణే. రాష్ట్రంలో ప్రస్తుతం 25.63 లక్షల వ్యవసాయ వినియోగదారులకు ప్రభుత్వం 24 గంటల నిరంతరాయ పూర్తి ఉచిత విద్యుత్‌ను సరఫరా చేస్తోంది.

గృహ విద్యుత్ వినియోగదారులకు సబ్సిడీ

2014-15 నుంచి 2020-21 వరకు గృహ విద్యుత్ వినియోదారులకు సబ్సిడీ టారిఫ్ కింద రూ.9,573 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేసింది. దీని ద్వారా రాష్ట్రంలో ప్రతి ఏడాది 1,00,41,952 మంది వినియోగదారులు లబ్ధి పొందుతున్నారు.

ఎస్సీ, ఎస్టీ వినియోగదారులకు…

ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ వినియోగదారులకు ప్రతినెలా 101 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్‌ను అందజేస్తోంది. దీని ద్వారా 5,00,771 మంది ఎస్సీలు, 2,69,983 మంది ఎస్టీలు లబ్ధి పొందుతున్నారు. నాయి బ్రాహ్మణులు / హెయిర్ కటింగ్ సెలూన్లు, రజకులు దోబీఘాట్లు/ లాండ్రీ షాపులకు ప్రతినెలా 250 యూనిట్ల ఉచిత విద్యుత్‌ను ప్రభుత్వం అందిస్తోంది. 2015 నుంచి రాష్ట్ర ప్రభుత్వం ప్రతి యూనిట్‌కు రెండు రూపాయల చొప్పున 4,920 పవర్‌లూమ్స్, 5894 పౌల్ట్రీ ఫాంలకు సరఫరా చేసే విద్యుత్‌పై సబ్సిడీని అందజేస్తోంది.

ప్రస్తుతం కాంగ్రెస్, బిజెపి పాలిత రాష్ట్రాల్లో కరెంట్ కోతల పరిస్థితి ఇలా…..

1.వేసవికాలంలో గుజరాత్‌లో సుమారు 500 మెగావాట్ల విద్యుత్ కొరత ఉండగా ఆ రాష్ట్రంలో వారానికి ఒకరోజు అక్కడి పరిశ్రమలకు పవర్ హాలీడే ప్రకటించింది. వ్యవసాయానికి నిరంతరాయంగా రెండు నుంచి నాలుగు గంటల పాటు అనధికారికంగా కోతలు విధించడంతో రైతులు ఇబ్బందులు పడ్డారు.

2.దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన డబుల్ ఇంజన్ గ్రోత్‌కు కేరాఫ్‌గా నిలిచిన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో సైతం వేసవికాలంలో ప్రతిరోజు 9 గంటల పాటు విద్యుత్ కోతలను విధించారు.అక్కడ సుమారుగా 300 మెగావాట్ల విద్యుత్ కొరత ఏర్పడింది.

3.కాంగ్రెస్ పాలిత రాష్ట్రమైన రాజస్థాన్‌లో 8 గంటల పాటు గృహ అవసరాలకు కరెంట్ కోతను విధించగా వ్యవసాయ, పరిశ్రమలకు ఎప్పుడు కరెంట్ ఇస్తుందో, ఎప్పుడు తీసివేస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది.

4.ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో విద్యుత్ సరఫరాకు సంబంధించి దయనీయ పరిస్థితి నెలకొంది. వేసవికాలంలో అక్కడ అప్రకటిత కోత 5 నుంచి 6 గంటల పాటు అన్నిరంగాల్లో కొనసాగింది. అక్కడ విద్యుత్ డిమాండ్ సరఫరాకు మధ్య రోజురోజుకు అగాధం ఏర్పడుతున్నదని విశ్లేషకులు పేర్కొనడం గమనార్హం.

5.మన పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో వేసవికాలంలో వ్యవసాయానికి 7 గంటలు మాత్రమే విద్యుత్ సరఫరా చేయగా, అది కూడా ఆటంకాలతో సరఫరా చేసింది. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో గంట నుంచి రెండు గంటల పాటు అధికారికంగా గృహ అవసరాలకు కరెంట్ చేస్తూ పరిశ్రమలకు వారానికి ఒకసారి పవర్‌హాలీడేను ఎపి ప్రభుత్వం ప్రకటించడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు.

విద్యుత్ కోతలు లేకుండా లో ఓల్టేజీ సమస్య తలెత్తకుండా….

అదే తెలంగాణలో విద్యుత్ కోతలు లేకుండా లో ఓల్టేజీ సమస్య తలెత్తకుండా, 24 గంటల పాటు నిరంతర నాణ్యమైన విద్యుత్ సరఫరాతో దేశంలోనే నెంబర్‌వన్‌గా నిలిచింది. దీంతోపాటు మిగతా రాష్ట్రాల కన్నా అతి తక్కువ చార్జీలతో ప్రజలకు, రైతాంగంపై ఎలాంటి భారం మోపకుండా ప్రజలకు నాణ్యమైన విద్యుత్‌ను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోంది. ఈ వాస్తవాలను బిజెపి, కాంగ్రెస్ పార్టీలు పక్కనబెట్టి తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు చేస్తుండడంపై విద్యుత్ శాఖ ఉద్యోగులు, ఇంజనీర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ శాఖ పటిష్టంగా ఉందని, విద్యుత్ ఉత్పతి, పంపిణీ రంగంలో దూసుకుపోతుందని, అందులో భాగంగా ప్రజలకు నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేయడంతో పాటు దేశంలోనే నెంబర్‌వన్‌గా నిలిచేలా నిరంతరం 24 గంటల పాటు విద్యుత్‌ను సరఫరా చేయడంలో తమ శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నామని విద్యుత్ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. కేవలం రాజకీయ లభ్ధికోసం, విమర్శలు చేయడానికే కాంగ్రెస్, బిజెపి పార్టీల నాయకులు ప్రయత్నిస్తున్నారని, ప్రభుత్వ ప్రయత్నాలను వక్రీకరించి ప్రజలను తప్పుదోవ పట్టించడం సిగ్గుచేటని ప్రజలు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News