ఢిల్లీలో రెండురోజులలో బ్లాకౌట్ ?
కొన్ని రాష్ట్రాలలో కరెంటు కోతలు
యుపిలో మూతపడ్డ ప్లాంట్లు
న్యూఢిల్లీ : వచ్చేరెండు రోజులలో విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు బొగ్గు సరఫరా కాకపోతే దేశ రాజధాని ఢిల్లీలో బ్లాకౌట్ అవుతుంది. విద్యుత్ సరఫరా నిలిచిపోయి అంధకారం ఏర్పడుతుంది. పలు నిత్యావసర సేవలకు అంతరాయం ఏర్పడుతుందని ఢిల్లీ మంత్రి ఒకరు తెలిపారు. ఇటీవలి కాలంలో పలు రాష్ట్రాలలో పవర్ ప్లాంట్లకు సరైన కోటాలో బొగ్గు సరఫరా కావడం లేదు. దీనితో ఇప్పటికే తమిళనాడు, ఒడిశాలలో సుదీర్ఘ విద్యుత్ కోతలు తప్పడం లేదు. వెంటనే అవసరం అయిన బొగ్గు నిల్వలను సరఫరా చేయాలని ఆయా రాష్ట్రాలు కేంద్రానికి విజ్ఞప్తి చేశాయి.
ఇప్పుడు ఢిల్లీ ప్రభుత్వం కూడా బొగ్గు కోసం కేంద్రానికి మొరపెట్టుకుంది. సరిగ్గా బొగ్గు అందకపోతే బ్లాకౌట్ తప్పదని పేర్కొంది. దేశంలోని 135 ఇంధన ఉత్పత్తి కేంద్రాలు బొగ్గుపై ఆధారపడి పనిచేస్తున్నాయి. ఇవి దేశంలోని మొత్తం విద్యుత్ ఉత్పత్తి సరఫరాలో దాదాపు 70 శాతం వరకూ ఉంటుంది. ఈ 135 పవర్ ప్లాంట్లలో సగం వరకూ ఇప్పుడు కేవలం మూడు రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు ఉన్నాయి. ఈ మేరకు సెంట్రల్ గ్రిడ్ ఆపరేటర్ డాటా స్పష్టం చేసింది. బొగ్గు సరఫరా ఇంతకు ముందటి స్థాయికి రాకపోతే ఢిల్లీ బ్లాకౌట్ తప్పదని, మరో రెండు రోజులలో గడ్డు పరిస్థితి ఉంటుందని ఢిల్లీ విద్యుత్ మంత్రి సత్యేంద్ర జైన్ శనివారం తెలిపారు.
యుపిలో 8 విద్యుత్ కేంద్రాలు మూత
దేశవ్యాప్త బొగ్గుకొరతలో భాగంగా ఏర్పడ్డ సంకటస్థితితో ఉత్తరప్రదేశ్‌లో 8 విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు నిలిచిపొయ్యాయి. మరో ఆరు ప్లాంట్లలో ఇతర కారణాలతో ఉత్పత్తి నిలిచిపోయింది. దీనితో ఇప్పటివరకూ రాష్ట్రంలో తాత్కాలికంగా ఆగిపోయిన విద్యుత్ కేంద్రాల సంఖ్య 14కు చేరింది. అతిపెద్ద రాష్ట్రం అయిన యుపిలో ఇప్పుడు విద్యుత్ డిమాండ్ దాదాపుగా 20వేల మైక్రోవాట్స్ 21వేల మైక్రోవాట్స్ వరకూ ఉంది. అయితే ఉత్పత్తి కేవలం 17000 మైక్రోవాట్స్ వరకూ ఉంటోంది. దీనితో ఇప్పటికే పలు గ్రామీణ ప్రాంతాలలో రోజుకు కనీసం అయిదారు గంటలు కరెంటు ఆగిపోతోంది.