హైదరాబాద్ : వేసవి కాలం ముగిసి వానా కాలం రానే వచ్చింది. వరుస వర్షాల కోసం రుతు పవనాలు కదులుతుండడంతో తెలంగాణ విద్యుత్ శాఖ కూడా అప్రమత్తం అయింది. ఇప్పటికే పలు ఫీడర్ల మరమ్మతులు పూర్తి చేసిన విద్యుత్ శాఖ అధికారులు.. ట్రాన్స్‌ఫార్లర్మ రిపేర్, వ్యవసాయ లైన్లతో పాటు రాజాధాని హైదరాబాద్‌లో విద్యుత్ లైన్లకు తగిలే చెట్లకొమ్మలపైనా దృష్టి సారించారు. ఇలాంటి వాటిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని టిఎస్ ట్రాన్స్‌కో, జెన్‌కో సిఎండి ప్రభాకర రావు అధికారులను ఆదేశించినట్లు చెబుతున్నారు. దీంతో పాటుగా నిరంతర విద్యుత్ సరఫరాలో ఎలాంటి సమస్యలు రాకుండా ఉండేందుకు విద్యుత్ శాఖ ప్రత్యేక కార్యాచరణను రూపొందించింది.
జిల్లాల వారీ విద్యుత్ సరఫరాతో పాటు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనూ మొత్తం తొమ్మిది సర్కిళ్లు అలాగే విద్యుత్ ఆపరేషన్స్ విభాగం ఉన్నతాధికారులు ఒక్కో సర్కిల్‌లలో మూడు చొప్పున డిజాస్టర్ మేనేజ్‌మెంట్ బృందాలను ఏర్పాటు చేశారు. మృగశిరా కార్తె రాకతోనే ఈ జూన్ మాసం మొదలు కొని వరుసగా జూలై ఆగస్టు అలాగే సెప్టెంబర్ నెలల్లో కురిసే వర్షానికి విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగకుండా చర్యలు తీసుకోనున్నారు. పొరుగు రాష్ట్రాల నుండి వచ్చే లైన్లతో పాటు జిల్లాలకు సరఫరా అవుతున్న విద్యుత్ లైన్ల పరిస్థితిని విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు నిషితంగా పరిశీలిస్తున్నారు. ఏఏ లైన్లలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి? ఎక్కడెక్కడ మరమ్మతులు అవసరం వస్తాయి? కిందటి ఏడాది చేసిన మరమ్మతుల పరిస్థితి ఏమిటీ? మళ్లీ ఎక్కడైనా లైన్ల రిపేర్ చేయాల్సి వస్తుందా? వంటి తదితర సమస్యలను విద్యుత్ శాఖ అధికారులు క్షేత్రస్థాయి నుండి తెప్పించుకుంటున్నారు. ప్రస్తుతం పని చేస్తున్న విద్యుత్ శాఖ సిబ్బందికి తోడు అదనంగా క్షేత్రస్థాయిలోనూ ఇంకా సిబ్బందిని నియమించుకుని అప్రమత్తంగా ఉండాలని భావిస్తున్నారు.
వర్షాకాలంతో పంటల సాగు కోసం నిరంతర విద్యుత్‌కు ఎలాంటి ఆటంకాలు రాకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. కాగా భారీ వర్షాలు గనుక కురిస్తే రాజధాని హైదరాబాద్‌లో విద్యుత్ సరఫరా పరిస్థితి ఎలా ఉండనుంది? విద్యుత్ లైన్లకు చెట్ల కొమ్మలు తగులుతున్నాయా? వంటి అంశాలపై అధికారులు రాజధాని హైదరాబాద్‌పై సమాచారం తెప్పించుకుంటున్నారు ప్రధానంగా ప్రతి సర్కిల్ కార్యాలయంలో ఒక కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసి ఎక్కడ విద్యుత్ సమస్య తలెత్తినా వెంటనే అక్కడికి చేరకునేందుకు సిద్ధంగా డిజాస్టర్ సిబ్బందిని అందుబాటులో ఉంచుతున్నారు. 24 గంటల పాటు ఈ సిబ్బంది అందుబాటులో ఉండనున్నారు. గృహ వినియోగదారులతో పాటు వ్యాపార, వాణిజ్య కనెక్షన్లు, పరిశ్రమల వంటి వాటికి విద్యుత్ అంతరాయం అనేది ఎక్కువగా లేకుండా ఉండేందుకు 11 కెవి విద్యుత్ లైన్లను ఇప్పటికే ప్రత్యేకంగా పరిశీలించామని, అవసరమైన చోట మరమ్మతులు సైతం పూర్తి చేశామని ఆపరేషన్స్ విభాగం అధికారులు తెలిపారు. కాగా విద్యుత్ సరఫరా వ్యవస్థను నిరంతరం పర్యవేక్షించేందుకు ట్రాన్స్‌కోకు చెందిన వెంగళరావు నగర్‌లోని స్కాడా భవనం నుంచి ఆన్‌లైన్ ద్వారా పరిశీలించే ఏర్పాట్లు చేశారు. విద్యుత్ సరఫరా వ్యవస్థను కంప్యూటరీకరించడంతో పాటు ఏ సర్కిల్‌లో డివిజన్ లేదా సెక్షన్‌లో విద్యుత్‌కు అంతరాయం ఏర్పడితే గుర్తించే పరిజ్ఞానం ఉండడంతో దీని ఆధారంగా రాజధాని గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 24 గంటల పాటు విద్యుత్ సరఫరాను పర్యవేక్షిస్తూ క్షేత్ర స్థాయిలో ఉన్న సిబ్బందికి తగిన సూచనలు ఇస్తున్నారు. డిమాండ్ సరపడా విద్యుత్ అందుబాటులో ఉందని, విద్యుత్‌ను నిరంతరం సరఫరా చేయడం పైనే పూర్తి స్థాయిలో దృష్టి సారించామని టిఎస్ ఎస్‌పిడిసిఎల్ ఆపరేషన్స్ డైరెక్టర్ జె. శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.
టోల్ ఫ్రీ నెంబర్ 1912 ఏర్పాటు
గ్రేటర్‌లోని తొమ్మిది సర్కిళ్ల పరిధిలో విద్యుత్ సరఫరాకు సంబంధించి ఏమైనా ఫిర్యాదులు ఉంటే 1912 టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేసి చెప్పాలని విద్యుత్ శాఖ అధికారులు సూచించారు. ఎక్కువ మొత్తంలో ఫిర్యాదులు వచ్చినా వాటిని నమోదు చేసుకునే సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులో ఉంచామని, ఒకే సారి 60 ఫిర్యాదులు ఈ నంబరుకు వచ్చినా నమోదు అవుతాయని అధికారులు తెలిపారు.