Wednesday, January 22, 2025

మనిషి జీవితంలో విద్యుత్‌ది ప్రధాన భూమిక

- Advertisement -
- Advertisement -
  • వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్

వికారాబాద్ : పుట్టుకకు ముందు నుండి చచ్చిన తర్వాత కూడా విద్యుత్‌దే మన జీవితంలో ప్రధాన భూమిక అని వికారాబాద్ శాసన సభ్యులు డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా సోమవారం స్థానిక గౌలికర్ ఫంక్షన్ హాల్‌లో తెలంగాణ విద్యుత్ విజయోత్సవ కార్యక్రమం నిర్వహించారు. అంతకుముందు సూపరింటెండెంట్ ఇంజనీరింగ్ కార్యాలయం నుండి సభాస్థలి వరకు విద్యుత్ శాఖ సిబ్బంది, విద్యుత్తు వినియోగదారులతో కలిసి పెద్ద మొత్తంలో ర్యాలీ నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షులు రాంరెడ్డి, మున్సిపల్ చైర్‌పర్సన్ చిగుళ్లపల్లి మంజుల రమేష్, అసిస్టెంట్ నారాయణ అమిత్, ఎంపిపి చంద్రకళ జెడ్పిటిసి సుజాత పిఎసిఎస్ చైర్మన్ ముత్యంరెడ్డి కౌన్సిలర్ అనంతరెడ్డి, వికారాబాద్ ఆర్డిఓ విజయకుమారి, విద్యుత్తు సూపరింటెండెంట్ ఇంజనీర్ జయరాజు లతో కలిసి శాసనసభ్యులు జ్యోతి ప్రజ్వలన చేసి తెలంగాణ గీతంతో కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాకముందు విద్యుత్ పరిస్థితి దయనీయంగా ఉండేదని, తెలంగాణ అవతరణ తర్వాత పరిస్థితులను చూస్తే మన రాష్ట్రం వెలుగు జిలుగుల రాష్ట్రంగా మారిందన్నారు. తెలంగాణ రాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో ఉన్న ఇతర రాష్ట్రాల రైతులు తెలంగాణలో భూములు కొనుగోలు చేసుకుని సాగు చేస్తున్నారని దీనికి కారణం తెలంగాణ ప్రభుత్వం 24 గంటల ఉచిత విద్యుతును అందించడమేనని ఆయన అన్నారు. పక్క రాష్ట్ర ప్రజలకు కూడా పథకాలను అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణయేనని ఆయన కొనియాడారు. రాష్ట్రంలో పరిమితి లేకుండా వ్యవసాయానికి విద్యుతును వినియోగించుకునే విధంగా వెసులుబాటును ప్రభుత్వం ఇచ్చిందని ఆయన సందర్భంగా తెలిపారు.

జిల్లాలో నాణ్యమైన విద్యుత్‌ను అందించేందుకు సబ్‌స్టేషన్‌లో ఏర్పాటుకు స్థలాలను కేటాయించాలని శాసనసభ్యులు కలెక్టర్‌ను కోరారు. ప్రభుత్వం చేసే ప్రతి పని ఫలితాలను చూస్తున్నామని, రాబోయే రోజుల్లో విద్యుత్ అవసరాలు ఎంతగానో ఉంటాయని ఆ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుందని ఆయన అన్నారు. విద్యుత్ సమస్యల పరిష్కారంలో అధికారుల పాత్ర, కృషి ఎంతో గొప్పదని ఆయన అన్నారు. ఈ సందర్భంగా విద్యుత్ అధికారులకు సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా కలెక్టర్ సి. నారాయణరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు కరెంటు కోతలతో ఎంతో ఇబ్బంది పడే వారమని అలాంటి పరిస్థితుల నుండి ప్రస్తుతం విద్యుతు లేకుండా ఒక్క క్షణం గడవలేని పరిస్థితికి వచ్చామన్నారు. రాబోయే రోజుల్లో పెట్రోలు, డీజిల్ కనుమరుగై విద్యుత్ ద్వారానే నడిచే బస్సులు, బైకులు వినియోగించే పరిస్థితి వస్తుందన్నారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తర్వాత వ్యవసాయం, వాణిజ్యం, పారిశ్రామిక రంగాల్లో ఎంతో అభివృద్ధి చెందాయని ఆయన అన్నారు. అదే విధంగా వాణిజ్యపరంగా రాష్ట్రంలో పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తున్నారని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. తెలంగాణ రాకముందు 7778 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసే వారమని, ప్రస్తుతం 15,565 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. గతంలో క్లిష్ట సమయంలో మార్చి వరకు 5661 మెగావాట్ల విద్యుత్తు అవసరమైతే, ప్రస్తుతం 15497 వినియోగించడం జరుగుతుందని ఆయన తెలిపారు.

రాష్ట్రంలో విద్యుత్తు వినియోగం పెరిగినప్పటికీ గృహ అవసరాల నిమిత్తం నాణ్యమైన విద్యుత్‌ను అందించడంతోపాటు కుల వృత్తులు చేసుకునే నాయి బ్రాహ్మణ, రజకులకు 250 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్తును అందించడం జరుగుతుందని ఆయన అన్నారు. కార్యక్రమంలో లబ్ధిదారులు కాజా పాషా, వీరేశం, విజయకుమార్ లు విద్యుత్ లభ్యత, ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలపై తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ మాట్లాడారు. విద్యుత్తు విజయోత్సవ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి గోపాల్, షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారి మల్లేశం, జిల్లా పరిషత్ డిప్యూటీ సిఇఒ సుభాషిని, ఎంపిడిఒ సత్తయ్య, వికారాబాద్ ఏడి సత్యనారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News