మన తెలంగాణ / హైదరాబాద్: విద్యుత్ సంస్థల్లో రివర్షన్‌కు గురై కింద స్థాయిలో ( లో క్యాడర్) పని చేస్తున్న విద్యుత్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని రివర్షన్ విద్యుత్ ఉద్యోగాల నాయకులు డిప్యూటీ సీఎం, విద్యుత్‌శాఖ మంత్రి భట్టి విక్రమార్కకు విజ్ఞప్తి చేశారు.ఈ మేరకు వారు సోమవారం ఆయన్ని కార్యాలయంలో కలిసి వినతి పత్రం సమర్పించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, గత యాజమాన్యం ఆంధ్రా స్థానిక ఉద్యోగులను అకస్మాత్తుగా రిలీవ్ చేసిందని దాంతో ఇప్పటికే ఉన్న తెలంగాణ స్థానిక ఉద్యోగులపై భారం నుండి చాలా ఎక్కువ భారం పడిందన్నారు.
2015లో రాష్ట్రం ఏర్పడిన తర్వాత, యాజమాన్యం ఎపి స్థానిక ఉద్యోగులందరినీ రిలీవ్ చేయడంతో తెలంగాణ ఇంజనీర్లు చాలా సంవత్సరాలు రిలీవ్డ్ ఇంజనీర్ల అదనపు విధులను నిర్వహించినట్లు తెలిపారు. కోవిడ్-19 కష్టకాలంలో కూడా వినియోగదారులకు నమ్మకమైన మరియు నాణ్యమైన విద్యుత్‌ను అందించాలనే ఉద్దేశ్యాన్ని సాధించేందుకు తెలంగాణ ఇంజనీర్లు చాలా కష్టపడ్డారని వారు ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇకనైనా తమ సమస్యలను పరిష్కరించి, గతంలో ఉన్న పోస్టుల్లోనే కొనసాగించేలా చేయాలని మంత్రికి సమర్పించిన వినతి పత్రంలో కోరారు.మంత్రిని కలిసన వారిలో అసోసియేషన్ నాయకులు అంజయ్య,ప్రవీణ్, రాధాకృష్ణ, అంజన్‌రెడ్డి,శ్రీనివాస్,మంగేశ్వర్ తదతరులు ఉన్నారు.