Monday, December 23, 2024

కరవడి- సూరారెడ్డిపాలెం స్టేషన్ల మధ్య ద.మ. రైల్వే విద్యుదీకరణ… మూడో లైన్ ప్రారంభం

- Advertisement -
- Advertisement -

ఈ ప్రాజెక్ట్ విజయవాడ – గూడూరు ట్రిప్లింగ్ , విద్యుదీకరణలో భాగం
అభినందించిన దమ రైల్వే జిఎం అరుణ్ కుమార్ జైన్

మన తెలంగాణ / హైదరాబాద్: దక్షిణ మధ్య రైల్వే అంతటా మౌళిక సదుపాయాల అభివృద్ధికి ప్రాముఖ్యతనిస్తూ డబ్లింగ్, ట్రిప్లింగ్ ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి సారించింది. ఈ దిశలో భాగంగా కరవడి – సూరారెడ్డిపాలెం మధ్య 20.3 కి.మీ.ల మేర మరో సెక్షన్‌ను విజయవంతంగా పూర్తి చేసి ప్రారంభించింది. ఈ సెక్షన్ విజయవాడ -గూడూరు ట్రిప్లింగ్, విద్యుదీకరణ ప్రాజెక్టులో భాగం కావడం గమనార్హం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొనసాగుతున్న ప్రధాన ప్రాజెక్టులలో ఇదీ ఒకటి కాగా ఈ రైలు మార్గం ప్రకాశం జిల్లా పరిధిలోకి వస్తుంది. ఇప్పుడు ఈ మార్గాన్ని ట్రిప్లింగ్ చేయడంతో బాపట్ల – సూరారెడ్డిపాలెం మధ్య 81 కిలో మీటర్ల మేర నిరంతరాయంగా విద్యుదీకరణతో పాటు మూడో లైన్ సౌకర్యం కలగనుంది.దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని విజయవాడ -గూడూరు మధ్య గ్రాండ్ ట్రంక్ మార్గంలో ఉన్నఈ సెక్షన్, దేశంలోని ఉత్తర , తూర్పు ప్రాంతాలను దక్షిణాది రాష్ట్రాలతో అనుసంధానించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.

ప్యాసింజర్ సరకు రవాణా రైళ్లలో స్థిరమైన పెరుగుదలతో ఈ మార్గం అత్యంత రద్దీగా మారింది. ఈ కీలకమైన సెక్షన్‌లో రద్దీని తగ్గించేందుకు, విజయవాడ – గూడూరు మూడవ లైన్ ప్రాజెక్ట్ 2015 -16 సంవత్సరంలో 288 కి .మీల దూరానికి సుమారు రూ.3,246 కోట్లతో మంజూరు చేశారు. రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ ద్వారా చేపట్టిన ఈ ప్రాజెక్ట్ అన్ని విభాగాల్లో ఏకకాలంలో పనులు ప్రారంభించారు. ఇప్పటి వరకు గూడూరు- సింగరాయకొండ మధ్య 127 కిలోమీటర్ల మేర బాపట్ల- కరవడి మధ్య 62 కి.మీ.ల మేర సెక్షన్లు పూర్తి చేసి విజయవంతంగా ప్రారంభించారు. ప్రస్తుతం విజయవాడ – గూడూరు మధ్యలో ఉన్న కరవడి – ఒంగోలు – సూరారెడ్డిపాలెం మధ్య 20 కి.మీల మేర సెక్షన్ పూర్తితో మొత్తం సెక్షన్‌లోని 209 కి.మీ.లు మూడో లైన్ తో పాటు విద్యుద్దీకరణ పూర్తి అయింది. దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ కరవడి- సూరారెడ్డిపాలెం సెక్షన్ మధ్య ట్రిప్లింగ్ విద్యుదీకరణ పనులను పూర్తి చేసిన విజయవాడ డివిజన్‌లోని బృందాన్ని , అధికారులను అభినందించారు. విజయవాడ-గూడూరు మధ్య మూడో లైన్ పనులను అత్యంత ప్రాధాన్యతతో చేపడుతున్నామని, అన్ని విభాగాలలో ఏకకాలంలో పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. ఈ ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత రద్దీగా ఉండే ఈ మార్గంలో ఆ రద్దీని తగ్గిస్తుందన్నారు. రైలు కార్యకలాపాల సామర్థ్యాన్ని మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుందని ఆయన తెలియజేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News