పారిస్ : ఈ విశ్వానికి ఓ లయబద్ధమైన నేపథ్య చప్పుడు ఉంటుందని, ఇది నిరంతర ప్రక్రియగా సాగుతుందని శాస్త్రజ్ఞులు తేల్చారు. భూమి ఖగోళం, వివిధ గ్రహాలు, ఖగోళాంతరాల అనుసంధాన ప్రక్రియగా ఉండే విశ్వం అంతర్లీన చప్పుడు గురించి తరాల గురించి పలు రీతుల్లో విశ్లేషణలు సాగుతున్నాయి. అయస్కాంత క్షేత్ర తరంగాలతో ఈ ఝంకారం లేదా ఓంకారం లేదా ఏదైనా శృతిలయబద్ధమైన హోరు పుడుతుందనే దీర్ఘకాలిక వాదన ఉంది. దీనిని నిజం చేసే తొలి సాక్షాధారాలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యోమగాములు ఇప్పుడు గురువారం వెల్లడించారు. విశ్వాన్ని అంటిపెట్టుకుని సర్వదా ఈ హమ్ ఉంటుందనే విషయంపై పలు దేశాలకు చెందిన వందలాది శాస్త్రజ్ఞులు పరిశోధనలు సాగించారు. నార్త్ అమెరికా , ఇండియా , చైనా, యూరప్, ఆస్ట్రేలియాలకు చెందిన వీరు రేడియోటెలీస్కోప్‌లను వినియోగించుకుని సాగించిన అధ్యయనాల క్రమంలో విశ్వానికి సంబంధించిన జీవకళలో కీలకమైన ఈ శబ్ధం గురించి నిర్థారించారు.
ఓ శతాబ్ధం క్రితం ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ విశ్వాన్ని సంతరించుకుని అయస్కాంత తరంగాలు ప్రకంపనలు సృష్టిస్తుంటాయని తెలిపారు. ఈ తరంగాలు కాంతివేగంతో ప్రయాణిస్తూ ఉంటాయి. ఇది నిరంతర ప్రక్రియ అని ఐన్‌స్టీన్ తెలిపారు. అయితే ఈ అయస్కాంత క్షేత్రాల ఉనికిని తెలిపే ఆధారాలను 2015 వరకూ నిర్థారించలేకపొయ్యారు. 2015లో అమెరికా, ఇటలీ ఖగోళ పరిశీలకులు తొలిసారిగా ఓ కొత్త విషయం తెలిపారు. రెండు బ్లాక్‌హోల్స్ తాకిడితో ఈ అయస్కాంత క్షేత్రాలు తలెత్తాయని వెల్లడించారు. ఈ క్రమంలో తలెత్తే నేపథ్య శబ్ధం విశ్వ పరిణామానికి అనుబంధం గురించి తెలుసుకునేందుకు అంతర్జాతీయ స్థాయిలో పల్సర్ టైమింగ్ అర్రే కన్సార్టియం పేరిట ఓ వేదిక ఏర్పాటు అయింది. పలు దేశాలలో ఏకకాలంలో ఈ పరిశోధనలు సాగాయి. అయస్కాంత తరంగాలు అంతరిక్షంలో ప్రసరించే దశలో మార్గమధ్యంలోని ప్రతి దానిని కబళించుకుంటూ వెళ్లుతాయి.
ఈ క్రమంలో లయబద్ధమైన చప్పుడు వెలువడుతుంది.నక్షత్రాలు పాలపుంతలు, మృత అంతరిక్ష పదార్థాలను దాటుకుంటూ సాగే ఈ శబ్ధం ప్రపంచ సృష్టి రహస్యం గురించి ఏదో చెప్పనుందని వెల్లడైంది.ఈ క్రమంలో సాగించిన అంతర్జాతీయ స్థాయి అధ్యయనంలో భారతదేశానికి చెందిన శాస్త్రజ్ఞులు కూడా కీలక పాత్ర పోషించారు. పుణేకు చెందిన శాస్త్రజ్ఞులు ఉపయోగించిన రేడియో టెలీస్కోప్‌కు ఈ ధ్వని తరంగాలు చిక్కినట్లు వెల్లడైంది.