Monday, December 23, 2024

ఎలక్ట్రానిక్స్ వ్యర్థాలు

- Advertisement -
- Advertisement -

మానవుడు మొదటిసారిగా తయారు చేసిన గొడ్డలి నుండి తన మేధస్సుతో ఎన్నో ఆవిష్కరణలు చేసి పారిశ్రామిక యుగానికి రావడానికి చాలా యేళ్లు పట్టింది. కాని అప్పటి నుండి చాలా తక్కువ కాలంలోనే ఇప్పుడున్న కంప్యూటర్ యుగానికి వచ్చేశాడు.ఇంత వేగంగా రావడానికి కారణం ఎలక్ట్రానిక్స్ రంగంలో వచ్చిన అనేక నూతన ఆవిష్కరణలు. 1948 సంవత్సరంలో ట్రాన్సిస్టర్ అనే చిన్న ఎలక్ట్రానిక్ పరికరాన్ని కనుగొన్న తరువాత వెనక్కి చూడలేదు. ఇప్పుడు మనం ఉపయోగిస్తున్న ప్రతి ఎలక్ట్రానిక్ పరికరంలో ప్రాసెసర్ ఉంటుంది.

అందులో లక్షల సంఖ్య లో ట్రాన్సిస్టర్లు ఉంటాయి. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ఉపకరణా లు మానవ జీవన విధానాన్ని సుఖమయం చేశాయి. ఈ పరికరాలు, ఉపకరణాలు అన్నింటికీ కొంత జీవిత కాలం మాత్రమే ఉంటుంది. తరువాత వీటిని బయట పడేయవలసిందే. గృహ వినోద పరికరాలు, సెల్ ఫోన్లు, స్మార్ట్ ఫోన్లు, డెస్క్ టాప్ కంప్యూటర్లు, మెడికల్ యంత్రాలు, లాప్‌టాప్‌లు, స్మార్ట్ టి.విలు, జిరాక్స్ యంత్రాలు, డి.వి.డి లు, బ్లూరేలు, రిమోట్‌లు, స్మార్ట్ వాచీలు, చార్జర్లు మొదలైన ఉపకరణాలు వాటి జీవిత కాలం పూర్తి అయిపోయిన తరువాత బయటకు పారవేయవలసిందే.

ఇ వ్యర్థాలు అంటే: కాలం పూర్తి అయినా, మధ్యలో చెడిపోయినా, విరిగిపోయినా, పాడైపోయినా, పని చేయకుండా ఉన్న ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ పరికరాలు లేదా ఉపకరణాలను ఎలక్ట్రానిక్స్ వ్యర్థాలు అంటారు. వీటినే ఇ వ్యర్ధాలని కూడా పిలుస్తారు.ఈ వ్యర్ధాలలో మనకు హాని కలిగించని రాగి, బంగారం, వెండి, ప్లాటినం, పల్లాడియం వంటి లోహాలు, హాని కలిగించే సీసం, పాదరసం, కాడ్మియం, సెలీనియం, క్రోమియం వంటి అత్యంత విషపూరిత మూలకాలు ఉంటాయి. ఇ వ్యర్థాలు సరైన యాజమాన్య నిర్వహణ పద్ధతిలో శుద్ధి చేయకపోతే మానవునికి, పర్యావరణానికి ఎంతో హాని కలిగిస్తాయి.
ఐక్యరాజ్య సమితికి సంబంధించిన గ్లోబల్ ఇ వేస్ట్ మానిటర్ 2020 నివేదిక ప్రకారం

2019 సం.లో 53.6 మిలియన్ టన్నులు ఉన్న ఇ వ్యర్థాలు 2030 సం. నాటికి 74.7 మిలియన్ టన్నులు చేరుకుంటాయి. సగటున ప్రతీ సంవత్సరం 2.5 మిలియన్ టన్నులు పెరుగుతున్నాయి.ఈ నివేదిక ప్రకారం భారత దేశం 2019లో 3.2 మిలియన్ టన్నుల ఇ- వ్యర్థాలను ఉత్పత్తి చేసింది, చైనా (10.1 మిలియన్ టన్నులు), అమెరికా (6.9 మిలియన్ టన్నులు)ఉత్పత్తి చేసింది. 2018-19లో దేశంలో ఉత్పత్తి చేయబడిన ఇ -వ్యర్థాలలో కేవలం 10%, 2017- 18లో ఉత్పత్తి చేయబడిన వాటిలో 3.5% మాత్రమే భారత దేశం సేకరించిందని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ఇటీవలి నివేదికలో పేర్కొంది.
ఫ్రాస్ట్ & సుల్లివన్ అంచనాల ప్రకారం భారత దేశంలో మొత్తం ఇ- వ్యర్థాల పరిమాణం 2025 నాటికి కనీసం 11.5 మిలియన్ టన్నులకు చేరుకుంటుందని అంచనా వేయబడింది. భారత దేశంలో దాదాపు 450 రిజిస్టర్డ్ ఇ- వేస్ట్ రీసైక్లర్‌లు ఉన్నాయి. ఇ -వేస్ట్ మేనేజ్‌మెంట్ రంగం 2025 వరకు ఆదాయంలో 14% వరకు సమ్మేళనం వార్షిక వృద్ధి రేటుతో వృద్ధి చెందే అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.అమెరికా, చైనా తర్వాత భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ఇ -వేస్ట్ ఉత్పత్తిదారుగా ఉంది. సంవత్సరానికి 3.23 మిలియన్ టన్నులు ఉత్పత్తి చేస్తున్నది. భారత దేశంలో ఒక సంవత్సర కాలంలో సుమారుగా కంప్యూటర్ పరికరాల నుండి 70%, స్మార్ట్ ఫోను, ఇతర టెలికాం పరికరాల

నుండి 12%, విద్యుత్ పరికరాల నుండి 7% , వైద్య పరికరాల నుండి 8%, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాల నుండి 3% ఇ వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయి. 2020- 2021లో భారతదేశం 3.4 లక్షల టన్నుల ఇ -వ్యర్థాలను ఉత్పత్తి చేసింది. ఇ -వ్యర్థాలు 2018 -19లో మొత్తం 7.1 లక్షల టన్నులు, 2019 -20లో 10.14 లక్షల టన్నుల ఉత్పత్తి చేయబడ్డాయి. ప్రతి సంవత్సరంలో సుమారు 31% పెరుగుదల నమోదవుతుంది. రాషాలవారీగా చూస్తే మొదటి మూడు స్థానాలలో మహారాష్ట్ర, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లు ఉన్నాయి. నగరాలలో ముంబై తొలి స్థానంలో ఉండగా ఢిల్లీ, బెంగళూర్లు తరువాత రెండు, మూడు స్థానాలలో నిలుస్తున్నాయి.

ఇ – చెత్త వలన మనపై కలిగే దుష్ప్రభావాలు..
లెడ్ (సీసం) మూత్ర పిండాలు, నాడీ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. చిన్నారుల ఎదుగుదలను అడ్డుకుటుంది. బేరియం మెదడు వ్యాపు వ్యాధికి దారితీస్తుంది. కణజాలాన్ని నాశనం చేస్తుంది. గుండె, కాలేయాన్ని దెబ్బతీస్తుంది. హెక్సావాలెంట్ క్రోమియం డి.ఎన్.ఎ వ్యవస్థను నాశనం చేస్తుంది. ఫాస్ఫరస్ జ్ఞాపకశక్తిని నశింపజేస్తుది. బెరీలియం క్యాన్సర్ వ్యాధికి దారితీస్తుందని ఇటీవలి పరిశోధనల్లో వెల్లడైంది. మెర్క్యురీ మెదడు, మూత్రపిండాలపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. మహిళల్లో పిల్లల్ని కనే సామర్ధ్యాన్ని దెబ్బ తీస్తుంది.ఇ- వ్యర్థాలు వేడెక్కినప్పుడు అందులో ఉండే విషపూరిత రసాయనాలు వాతావరణంలోకి విడుదలవుతాయి.

ఎలక్ట్రానిక్ వ్యర్థాలలో కనిపించే సీసం, జింక్, బేరియం మొదలైనవి మానవ ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి. అలాగే, ఇ- వ్యర్థాలు పల్లపు ప్రదేశాలను కలిసినప్పుడు, విషపూరిత రసాయనాలు నేల, నీటిలోకి ప్రవేశిస్తాయి, ఇది భూగర్భజల కాలుష్యానికి దారితీస్తుంది. ఇది సముద్ర ఆరోగ్యం, మానవ ఆరోగ్యాన్ని మరింత ప్రభావితం చేస్తుంది. కావున వీటి శుద్ధికి సాధారణ చెత్తకి పాటిస్తున్న పద్ధతులలో కాకుండా జాతీయ కాలుష్య నియంత్రణా మండలి సూచించే పద్ధతులని పాటించాలి. సాధారణ ప్రజలకు వీటి శుద్ధి గురించి పెద్దగా తెలియదు.కావున సంబంధిత అధికారులు తెలియజేయాలి. ప్రజలు కూడా వారికి సహకరించాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News