Monday, December 23, 2024

ఖైదీల హక్కులు హరిస్తున్న జైళ్ళు

- Advertisement -
- Advertisement -

పదహారు మంది మేధావులపైన అయిదేళ్ళ క్రితం ప్రభుత్వం ఎల్గార్ పరిషత్ కేసు పెట్టింది. కేసు దర్యాప్తు ఎంత వరకొచ్చిందో తెలియదు కానీ, విచారణ మాత్రం అంగుళం ముందుకు కదలలేదు. ఈ కేసు విచారణ ఇంత వరకు న్యాయస్థానాల ముందుకు రాలేదు. వీరిలో ఎవరికీ శిక్షపడకపోయినా, అరెస్టయిన వీరంతా చట్టప్రకారం అందాల్సిన కనీస సదుపాయాలకు కానీ, హక్కులకు కానీ నోచుకోకుండా జైళ్ళలోనే గడుపుతున్నారు. వీరిలో ఎనభై నాలుగేళ్ళ స్టాన్ స్వామి చాలా దుర్భరమైన పరిస్థితుల్లో జైలులోనే మృతి చెందారు. వరవరరావు, సుధా భరద్వాజ్‌లకు అనేక న్యాయ పోరాటాల తరువాత ఎన్నో ఆంక్షలతో బెయిల్ మంజూరైంది. మిగతా పదమూడు మంది జైళ్ళలోనే మగ్గుతున్నారు. ఈ కేసు కింద అరెస్టయిన వారిలో విద్యావేత్తలు, కవులు, న్యాయవాదులు వంటి మేధావులే ఉన్నారు. ప్రభుత్వం ఈ మేధావులను ఏం చేయదలిచింది!?
దేశ సమగ్రత, సార్వభౌమాధికారానికి భంగకరం కలిగిస్తున్న వారిని అదుపు చేయాలనే ఉద్దేశంతో 1967లో ‘చట్ట వ్యతిరేక చర్యల నిరోధక చట్టాన్ని’ (ఉపా) ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ చట్టాన్ని ప్రభుత్వం రాజకీయ ప్రత్యర్థులను అణచివేయడానికే ఉపయోగించుకుంటోంది. ప్రభుత్వ అరాచకాలను ఎవరైతే ప్రశ్నిస్తారో వారు ప్రభుత్వానికి శత్రువులని ముద్ర వేస్తోంది. అయిదేళ్ళ క్రితం మహారాష్ర్టలోని భీమాకోరెగావ్‌లో జరిగిన హింసకు, ఈ మేధావులకు ఎలాంటి సంబంధమూ లేదు.

ఆ సమయంలో వీరక్కడ లేరు. అయినా ప్రభుత్వం వీరిని నిరంకుశ ‘ఉపా’ చట్టం కింద అరెస్టు చేసి జైల్లో పెట్టింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వీరు యుద్ధం చేస్తున్నారని, ప్రధాని నరేంద్ర మోడీని హత్య చేయడానికి కుట్ర పన్నుతున్నారని వీరిపైన నింద మోపింది. ఈ మేధావులపైన ఎవరైతే ఫిర్యాదు చేశారో, ఏ ఫిర్యాదుపైనైతే వీరిని అరెస్టు చేశారో, ఆ వ్యక్తి హిందూత్వ పాలనను కోరే వ్యక్తి. ‘హిందువులకు ఉపయోగపడే వాటికి మనం సాయం చేయాలి, మిగతావి వదిలేయాలి’ అని భావించే వ్యక్తి. అతని చేత ఫిర్యాదు చేయించిన తరువాతనే ప్రభుత్వం వీరిని అరెస్టు చేసింది.ఈ 16 మంది మేధావులపైన ‘ఉపా’ చట్టం కింద పూనే పోలీసులు కేసుపెట్టినప్పుడు మహారాష్ర్టలో బిజెపి ప్రభుత్వం పరిపాలన సాగిస్తోంది. ఆ రాష్ర్ట శాససన సభకు 2019లో జరిగిన ఎన్నికల్లో బిజెపి ఓడిపోయింది. ఉద్ధవ్ థాక్రే ముఖ్యమంత్రిగా 2019 నవంబర్ 28న సంకీర్ణ ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయడంతో ఈ కేసును ఎన్‌ఐఎకు అప్పగించాలని 2020 జనవరి 24వ తేదీన మహారాష్ర్ట ప్రభుత్వాన్ని కేంద్రం ఆదేశించింది.
మహారాష్ర్టలో కొత్తగా కొలువైన సంకీర్ణ ప్రభుత్వం ఈ పదహారు మంది మేధావులకు బెయిల్ ఇస్తుందేమోనన్న అనుమానంతోనే కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఈ కేసును తన పరిధికి తెచ్చేసుకుంది. కేసు దర్యాప్తును ఏమైనా ముందుకు తీసుకెళ్ళిందా అంటే అదీ లేదు. పైగా ఈమేధావులతో కేంద్రం చాలా అమానుషంగా వ్యవహరిస్తోంది. భారత రాజ్యాంగంలోని 19(1) అధికరణం ప్రతి పౌరుడికీ భావప్రకటనా స్వేచ్ఛను కల్పిస్తోంది.

21వ అధికరణం జీవించే హక్కును కల్పిస్తోంది. 14వ అధికరణ సమాన హక్కును కల్పిస్తోంది. రాజ్యాంగం కల్పించిన ఈ హక్కులన్నిటినీ ఈ మేధావులకు దక్కకుండా హరించే విధంగా, ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు ఈ నిరంకుశ ‘ఉపా’ చట్టాన్ని ప్రయోగించింది. ఈ కారణం చేతనే వారు జైల్లో ఉన్నారన్న విషయం మనం మర్చిపోకూడదు.జైలులో ఉన్నప్పటికీ ఖైదీలకు కూడా కొన్ని హక్కులుంటాయి. ఈ హక్కులు కూడా చట్టం కల్పించినవే. వాటిని పరిరక్షించాల్సిన బాధ్యత జైలు అధికారులదే. భీమాకోరెగావ్ కేసులో నిందితులైన పదహారు మందిలో ఒకరైన ఎనభై నాలుగేళ్ళ స్టాన్‌స్వామి క్రైస్తవ మత బోధకుడు, హక్కుల కార్యకర్త. అతను అనేక అనారోగ్య సమస్యలతో పాటు, తీవ్రమైన పార్కిన్‌సన్ వ్యాధితో బాధపడుతున్నాడు. చేతితో గ్లాసు పట్టుకుని మంచి నీళ్ళు తాగలేని పరిస్థితి. స్ట్రా గ్లాసు ఏర్పాటు చేయమని స్టాన్ స్వామి జైలు అధికారులను కోరారు. అది ఏర్పాటు చేయడం జైలు అధికారుల బాధ్యత. స్ట్రా గ్లాసు కూడా ఏర్పాటు చేయకుండా, కోర్టు అనుమతి కావాలని మెలికపెట్టారు. కోర్టు కూడా తాత్సారం చేసింది. సరైన వైద్యం, కనీస సదుపాయాలు అందక స్టాన్ స్వామి జైలులోనే మృతి చెందారు. ఇతని మృతి ఒక్క భారత దేశంలోనే కాదు ప్రపంచంలోని మేధావులందరినీ కదిలించింది. అయినా ప్రభుత్వంలో ఏ మాత్రం చలనం లేదు.

మరో నిందితురాలు సోమాసేన్ మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నారు. కమోట్ లేకుండా టాయిలెట్‌లో కూర్చోవడం ఆమెకు చాలా ఇబ్బందికరం. కమోట్ అడిగినా జైలు అధికారులు ఏర్పాటు చేయలేదు. బైట నుంచి ఆమె కుమార్తె తెచ్చిచ్చిన కమోట్‌ను కూడా అనుమతించలేదు. ఐటి, ఉపా చట్టాలతో పాటు, నాలుగు వివేకానందుడి పుస్తకాలను, కాగితాలను కావాలని సురేంద్ర గాడ్గిల్ జైలు అధికారులను కోరారు. దీన్ని కూడా జైలు అధికారులు తిరస్కరించారు. పుస్తకాల కోసం కూడా గాడ్గిల్ న్యాయస్థానానికి వెళ్ళవలసి వచ్చిందంటే జైలు పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. న్యాయస్థానం అనుమతించినా, జైలు అధికారులు మాత్రం ఆ పుస్తకాలను ఇవ్వడానికి అనుమతించలేదు. చలికి తట్టుకోలేకున్నానని, స్వెట్టర్‌ను అనుమతించాలని గాడ్గిల్ కోర్టుకు విన్నవిస్తే, కోర్టు అనుమతించింది. కానీ జైలు అధికారులు మాత్రం ఉలన్ స్వెట్టర్‌ను అనుమతించలేదు. గాడ్గిల్ కుమార్తె థర్మల్ స్వెట్టర్‌ను తీసుకొచ్చినా, సగం చేతుల వరకు వున్న స్వెట్టర్‌ను మాత్రమే అనుమతిస్తామని, పొడుగు చేతుల థర్మల్ స్వెట్టర్‌ను అనుమతించమని జైలు అధికారులు దాన్ని తిప్పి పంపించేశారు.

గాడ్గిల్ జైలులో ఉండగానే ఆయన తల్లి మృతి చెందింది. అంత్యక్రియలకు వెళ్లడానికి అనుమతివ్వాలని గాడ్గిల్ కోరారు. అతని దరఖాస్తుతో తల్లి డెత్ సర్టిఫికెట్ లేదు కనుక, ఆమె మృతి చెందినట్టు నిర్ధారణ జరగలేదని, డెత్ సర్టిఫికెట్ లేకుండా ఎన్‌ఐఎ అంగీకరించదని, అంత్యక్రియలకు అనుమతి కోరిన దరఖాస్తును తిరస్కరించారు. ఒక మనిషి మృతి చెందితే అంత్యక్రియలు పూర్తయ్యిన ఎన్ని రోజులకు డెత్ సర్టిఫికెట్ వస్తుందో మనందరికీ తెలుసు. అంత్యక్రియలు పూర్తి కాక ముందే డెత్ సర్టిఫికెట్ ఎలా సంపాదించగలుగుతారు? డెత్ సర్టిఫికెట్ వచ్చాక కుటుంబ సభ్యులతో గడపడానికి అనుమతి కోరితే, అంత్యక్రియలు అయిపోయాక బైటికి వెళ్ళాల్సిన అవసరం ఏముందని ఎన్‌ఐఎ ప్రశ్నించింది. తల్లి సంస్మరణ సభకు అనుమతివ్వాలని కోరితే, సంస్మరణ సభకు సంబంధించిన పత్రం లేదని ఎన్‌ఐఎ తిరస్కరించింది. సుధీర్ ధావ్‌లే సోదరుడు మృతి సందర్భంగా అంత్యక్రియల అనంతరం ఏర్పాటు చేసే సంస్మరణ సభ పత్రం జత చేసి బెయిల్ కోసం దరఖాస్తు చేస్తే, అతను చేసిన నేరం తీవ్రమైందని బైటి కెళ్ళడానికి వీలు లేదని తిరస్కరించారు.

మహేష్ రౌత్ విచారణ ఖైదీగా జైల్లో ఉండగానే అతని చెల్లెలి వివాహం జరిగిపోయింది. వెర్నెన్ గోన్‌సాల్వ్ తల్లి 2021 మేలో మరణిస్తే, ఆయనకు కూడా తల్లి చివరి చూపులు దక్కలేదు. డ్బ్బై ఏళ్ళ వయసున్న గౌతవ్‌ు నవలఖ కళ్ళ జోడును జైల్లో ఎవరో దొంగిలించారు. కళ్ళజోడు లేకపోతే అతినికి ఏమీ కనిపించదు. కళ్ళ జోడు తెప్పించమని ఇంట్లో వారిని కోరడానికి కూడా మూడు రోజుల వరకు అనుమతించలేదు. ఇంటి నుంచి ఆయన సతీమణి తెచ్చిన కళ్ళజోడును కూడా ఏదో పాకెట్ ఉందనే నెపంతో అనుమతించలేదు. వరవరరావుకు బెయిల్ మంజూరు చేసినప్పటికీ ముంబయి దాటి వెళ్ళకూడదని ఆంక్ష లు పెట్టారు. కంటి చూపు సమస్య ఏర్పడడం వల్ల వరవరరావుకు ఆపరేషన్ చేయాల్సిన అవసరం ఏర్పడింది. రిటైర్డ్ ఉద్యోగి కనుక తెలంగాణ రాష్ర్టంలో ఉచితంగా ఆపరేషన్ చేయించుకోవచ్చు.

కానీ, ఆపరేషన్ కోసం ముంబయి వదిలి హైదరాబాదు వెళ్ళడానికి న్యాయస్థానం అనుమతించకుండా ప్రభుత్వం అడ్డుపడుతోంది. ముంబయి వదిలి వెళ్ళకూడదని ఆంక్షలు పెట్టినప్పుడు ప్రభుత్వమే ఆపరేషన్ చేయించాలి కదా! లేదా దానికయ్యే ఖర్చును కూడా ప్రభుత్వమే భరించాలి కదా! ఏమీ చేయకుండా వైద్యానికి కూడా ప్రభుత్వం మోకాలడ్డుపెడుతోంది. రోనా విల్సన్ లాప్‌టాప్‌లో దొరికినట్టు పోలీసులు ఆరోపిస్తున్న లేఖ ఒక సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి వారు పెట్టినదేనని ఒక స్వతంత్ర విశ్లేషణా సంస్థ వెల్లడించిందని ‘ద వైర్’ రాసింది. ప్రధాని మోడీని హత్య చేయాలని ఆరోపణ లేఖ కూడా రోనా విల్సన్ లాబ్‌టాప్‌లోకి సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి చొప్పించిందేనని స్పష్టం చేసింది. రోనావిల్సన్ లాబ్‌టాబ్‌లో ఉన్న ఈ ఫోల్డర్‌ను ఆయన తెరిచినట్టు ఆధారాలు కూడా లేవు. రోనా విల్సన్ లాబ్‌టాబ్‌ను హ్యాక్ చేశారని డిజిటల్ ఫోరెన్సిక్‌లో పేరు ప్రఖ్యాతులున్న సంస్థ 2021 ఏప్రిల్‌లో స్పష్టం చేసింది. దాదాపు ఈ నిందితులందరిపైనా ఇలాగే దొంగ సాక్ష్యాలను సృష్టించి ప్రభుత్వం కేసులు పెట్టింది.

ప్రభుత్వం అరాచకాలపట్ల ఎవరైతే నిరసన తెలుపుతారో చట్టాన్ని దుర్వినియోగం చేసి, వారందరినీ జైళ్ళలో కుక్కడానికి పెట్టిన భీమాకోరెగావ్ కేసు ఒక ఉదాహరణ మాత్రమే. ప్రభుత్వం అనుసరిస్తున్న చట్టవ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా గొంతెత్తి మాట్లాడినందుకు ఉమర్ ఖలిద వెయ్యి రోజులు జైల్లో గడపాల్సి వచ్చిం ది. పేదలు, మైనారిటీలు, అట్టడుగున ఉన్నవారు కూడా ప్రభుత్వ దమననీతిని ఎదుర్కోవలసి వస్తోంది. అన్యాయాలకు, అరాచకాలకు వ్యతిరేకంగా ఎవరైతే గొంతెత్తుతారో, బలహీనుల పక్షాన ఎవరైతే నిలబడతారో ప్రభుత్వం వారిపై దేశ వ్యతిరేక శక్తులని ముద్ర వేసి జైళ్ళలో కుక్కుతోంది. రాజ్యం వ్యవహరించే ఈ దారుణాలకు వ్యతిరేకంగా మనమంతా ఎంత కాలమైతే నోరెత్తమో, దీనికి గురైన బాధితులను ఎంత కాలమైతే పట్టించుకోకుండా వదిలేస్తామో అంతకాలం ఈ అరాచకాలు కొనసాగుతూనే ఉంటాయి.

రాఘవశర్మ
9493226180

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News