రాంచీ : దేశ సేవ దిశగా మొదటి అడుగు ఓటింగ్ అని ప్రధాన ఎన్నికల కమిషనర్ (సిఇసి) జ్ఞానేశ్ కుమార్ ఆదివారం ఉద్ఘాటించారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా అర్హులైన ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆయన ఉద్బోధించారు. జ్ఞానేశ్ కుమార్ రాంచీలో మీడియా సిబ్బందిని ఉద్దేశించి ప్రసంగిస్తూ, ‘దేశ సేవ దిశగా మొదటి అడుగు ఓటింగ్. ఓటు వేయాడానికి ఎవరైనా ఓటర్ జాబితాలో ఓటర్‌గా తన పేరు నమోదు చేయించుకోవాలి. 18 సంవత్సరాలు నిండిన అర్హుడైన ఏ భారత పౌరునీ వదలివేయరాదు’ అని స్పష్టం చేశారు. ఝార్ఖండ్‌లో మూడు రోజుల పర్యటన నిమిత్తం సిఇసి జ్ఞానేశ్ కుమార్ శుక్రవారం రాంచీ చేరుకున్నారు.
‘ఎప్పుడు ఎన్నికల జరిగినా ఓటర్లు తప్పనిసరిగా ఓటు వేయాలి’ అని ఆయన అన్నారు. ఎన్నికల కమిషన్ (ఇసి) ఎల్లప్పుడూ ఓటర్లకు దన్నుగా నిలిచిందని, ఇక ముందు కూడా అదే విధంగా నిలుస్తుందని కుమార్ తెలిపారు. కుమార్ అంతకుముందు రాంచీ శివార్లలోని దసమ్ వద్ద బూత్ స్థాయి అధికారులు (బిఎల్‌ఒలు)తో చర్చలు జరిపారు. పోలింగ్ సమయంలో మారుమూల, సంక్లిష్ట ప్రాంతాల్లో తమ అనుభవాలను, తమ కృషిని బిఎల్‌ఒలు ఆయనకు తెలియజేశారు. ఇంటింటి సర్వేలు, బిఎల్‌ఒ యాప్, పోలింగ్ సమయం నిర్వహణ. ఎన్నికల సమయంలో సంబంధిత ఇతర విషయాల గురించి బిఎల్‌ఒల అనుభవాలను కూడా సిఇసి తెలుసుకున్నారు. కుమార్ శనివారం రామ్‌గఢ్‌లో ఎన్నికల అధికారులు, వాలంటీర్లతో ముఖాముఖి జరిపారు.