అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరంభించిన యుద్ధానికి రెండు కోణాలున్నాయి. ఒకటి ఆర్థికం, రెండు వ్యూహాత్మకం. తక్కిన అన్ని దేశాలతో ఆయన లక్షాలు కేవలం ఆర్థికం. అవి స్వల్పకాలికం లేదా మధ్య కాలికమైనవి. అందుకు భిన్నంగా చైనాతో ఆర్థికం, దానితో పాటు వ్యూహాత్మకమైనవి. తమ ఆధిపత్యానికి సవాలుగా మారిన చైనాను అంతం చేయాలనే సామ్రాజ్యవాద పట్టుదల అది. అందులో స్వల్ప కాలికం, మధ్యకాలికం అంటూ లేవు. అన్నీ దీర్ఘకాలికమైనవి మాత్రమే. తాజాగా 9వ తేదీన చైనాపై సుంకాలను 125 శాతానికి పెంచటం, తక్కిన అన్ని దేశాలపై హెచ్చింపును 90 రోజులు వాయిదా వేసి చైనాకు అట్లా చేయకపోవటం ఇందుకొక సూచన మాత్రమే. సూటిగా చెప్పుకోవాలంటే పరిస్థితి ఈ విధంగా ఉంది. అమెరికాకు వివిధ దేశాల ఎగుమతి సుంకాలు, వాణిజ్య లోట్లు ఆర్థికంగా కొన్ని సమస్యలను కలిగిస్తున్నాయి.
అందులో సందేహం లేదు. కాని అందుకు బాధ్యత స్వయంగా అమెరికాదే తప్ప ఇతర దేశాలది కాదు. అమెరికాలో ప్రజలకు, ఆయా సంస్థలకు వినియోగదారీతత్తం చాలా ఎక్కువ. ప్రపంచంలో మరే దేశంలోనూ లేనంత ఎక్కువ. అందుకు తగినట్లు స్వదేశంలో సరకుల ఉత్పత్తి కొంతకాలంగా లేదు. పారిశ్రామికంగా కాని, వ్యవసాయికంగా కాని. అక్కడి ప్రభుత్వాలు ఆ ధోరణిని నియంత్రించే బదులు ప్రోత్సహిస్తూ వస్తున్నాయి. వారికి ఆ సరుకులు వీలైనంత చవకగా లభించేందుకు ఇతర దేశాలతోస్వేచ్ఛా వాణిజ్యాలు, తమ వద్ద ఉత్పత్తికోసం భారీగా ఖర్చు అయ్యే పరిశ్రమలను తక్కువ ఖర్చు అయ్యే ఇతర దేశాలకు తరలించటం, అక్కడినుండి దిగుమతులపై తక్కువ సుంకాల విధింపు, తద్వారా దిగుమతి సరకుల ధరలు తక్కువగా ఉండేట్లు చూడటం వంటివి చేస్తూ వస్తున్నారు. వీటన్నింటి కారణంగా అమెరికాకు వాణిజ్య లోటు ఏర్పడటమన్నది చాలా సహజం.
ఈ లోటు ఇపుడు కొత్తగా వచ్చిందో, చైనా వల్లనే వచ్చిందో కాదు. ఇండియాతోనూ గణనీయమైన లోటు ఉండటం తెలిసిందే. ఆ లోటును అమెరికా వాస్తవానికి ఇతర రూపాలలో తీర్చుకుంటూ వస్తున్నది కూడా. తాము మాత్రమే ఉత్పత్తి చేసే కొన్ని యంత్రాల ధరలు విపరీతమైన స్థాయిలో నిర్ణయించటం, తమ టెక్నలాజికల్ సర్వీసులు, బ్యాంకింగ్ సర్వీసులపై పూర్తి నియంత్రణ, డాలర్ ఆధిపత్యం కారణంగా ద్రవ్యమారకం విలువలు, అన్ని దేశాల ఎగుమతి దిగుమతులను ఆధారం చేసుకుంటూ ఆ మారకం విలువల హెచ్చింపులతో జరిగే సంపాదనలు అమెరికాకు బలమైన సాధనాలుగా మారాయి. లేనట్లయితే ఉదాహరణకు భారత దేశపు రూపాయి విలువ ఇంచుమించు వారానికి ఒకసారి చొప్పున ఇంతగా పతనం కావలసిన పరిస్థితి ఉండేది కాదు.
ఆ విధంగా అంతర్జాతీయ ద్రవ్య మార్కెట్లపై ఆధిపత్యం ఒకటి కాగా, ఏ దేశం తన కరెన్సీని ముద్రించాలన్నా అందుకు తమ వద్ద ఉండే బంగారం నిల్వలు ఆధారం కావాలన్న అంతర్జాతీయ నియమాన్ని అమెరికా యథేచ్ఛగా ఉల్లంఘిస్తూ డాలర్లను లెక్కా పత్రం లేకుండా ముద్రించి ప్రపంచం మీదకు వదలుతుండటం మరొకటిగా అమెరికాకు ఇతరత్రా గల వాణిజ్య లోటును కప్పిపెట్టుకుంటూ వస్తున్నాయి. వారిని అడిగేవారు, నియంత్రించే వారు లేకపోయారు. ఈ పరిస్థితులలో అమెరికా ప్రభుత్వాలు వాణిజ్యలోటు గురించి అపుడపుడు ప్రస్తావిస్తుండటం ఎప్పటి నుంచో ఉన్నా డెమోక్రాట్లు, రిపబ్లికన్లు ఇద్దరూ ఆ పని చేసినా, దానిని ఒక పెద్ద సమస్యగా ఎప్పుడూ ముందుకు తేలేదు.
ఇదంతా ఎట్లున్నా తమ వాణిజ్య లోటును తగ్గించుకోవాలనే ఆలోచన కలిగితే అందుకు ఎవరూ అభ్యంతర పెట్టలేరు. అది అమెరికా హక్కు. కాని అందుకు ఒక సవ్యమైన పద్ధతిని అనుసరించాలి. ఆయా దేశాలతో వాణిజ్య లోటు ఏ స్థాయిలో ఉంది? అందుకు కారణాలేమిటి? వాటిని నియంత్రించేందుకు తమ వైపు నుంచి, ఎదుటి వైపు వారి నుంచి ఏమి జరగాలి? ఆ పని స్వల్పకాలంలో, మధ్య కాలంలో, దీర్ఘకాలంలో జరిగేందుకు ప్రణాళికలు ఏమిటి? అన్నవి పరిశీలించి ఆ ప్రకారం ఇతరులతో చర్చిస్తూ పరిస్థితిని చక్కబెట్టుకోవాలి. మొత్తం ప్రపంచంలోనే అగ్రరాజ్యంగా తనపై అటువంటి బాధ్యత ఆర్థికంగానేకాక రాజకీయంగా కూడా ఉంటుంది. అట్లా చేసినపుడే తమ కోణం నుంచి గాని, ఇతర దేశాల కోణం నుంచి గాని, మొత్తం ప్రపంచ కోణం నుంచి గాని అవసరమైన మార్పులు సజావుగా సాగుతాయి. ఆధునికం అవుతున్న ప్రపంచంలో వివిధ దేశాలు పరస్పరం ఆధార పడటం ఏదో ఒక మేరకు తప్పదు గనుక, ఎన్ని చర్యలు తీసుకున్నా ఎంతో కొంత వాణిజ్యం లోట్లు ఉంటాయి. కాకపోతే అవి సాధారణం నుంచి అసాధారణానికి చేరరాదు.
దీనంతటిలో అమెరికాగాని, ఇతర ధనిక దేశాలు గాని ప్రస్తావించకుండా వదలివేస్తున్న ముఖ్య విషయం ఒకటున్నది. అది, ఇతర దేశాలలో లభించే ప్రకృతి వనరులు, అరుదైన లోహాలూ, ఖనిజాలను ధనిక రాజ్యాలు అతి చవకగా సంపాదించుకొని తమ సంపదలు పెంచుకోవటం అందువల్ల, వాణిజ్యలోటు గురించి మాట్లాడేటపుడు అన్ని విషయాలూ చర్చకు రావాలి. ఇపుడు ట్రంప్ ఆఫ్రికన్ దేశాలపై కూడా గణనీయంగా దిగుమతి రుసుములు పెంచిన సందర్భంగా, అక్కడి దేశాలు ఈ అంశాన్ని మరొక మారు ఎత్తి చూపుతున్నాయి.ఇటువంటి ఆర్థిక సంబంధమైన విషయాలు ఇట్లుండగా, మొదట అనుకున్నట్లు, చైనా ప్రశ్న ఆర్ధికంతో పాటు అంతకన్న ముఖ్యంగా వ్యూహాత్మకమైనది. అమెరికా మొత్తం వాణిజ్య లోటు 2024లో 978 బిలియన్ డాలర్లు కాగా, అందులో చైనాతో గల లోటు 295 బిలియన్లు. దీనిని తగ్గించటంపై చర్చలకు చైనా ఎప్పుడూ సుముఖంగానే ఉంది. కాని ట్రంప్ తన గత హయాంలో, ఆ తర్వాత బైడెన్ కాలంలో ఒకవైపు కొంత చర్చలు జరుపుతూనే మరొక వైపు ఆర్థిక ఆంక్షలు, శాస్త్ర సాంకేతికపరమైన ఆంక్షలు విధిస్తూ పోయారు. వాణిజ్యం ఎప్పుడైనా ప్రభుత్వాలు గాని, కంపెనీలుగాని స్వేచ్ఛగా సాగించేవి.
తమతో అమెరికా వాణిజ్యం జరిపి తీరాలని చైనా గాని, ఇండియాగాని, మరొకరు గాని బలవంత పెట్టజాలరు. అటువంటి పరిస్థితిలో అమెరికా వైపునుంచి చైనాతో వాణిజ్యం అందులో తమకు ప్రయోజనం ఉందనుకునే జరిగింది.
మరి సమస్య ఎక్కడ వచ్చినట్లు? అందుకు రెండు కారణాలున్నాయి. ఒకటి, చైనా క్రమంగా సరకుల ఉత్పత్తి, వాణిజ్యాలతో బలమైన దేశంగా ఎదిగిపోతున్నది. ఆర్థికంగా, సైనికంగా, సాంకేతికంగా ప్రపంచమంతటా పలుకుబడి రీత్యా చూస్తూండగానే అమెరికా తర్వాత రెండవ శక్తి వంతమైన దేశమయింది. పర్ఛేజింగ్ పవర్ పేరిటీ (పిపిపి) లెక్కల ప్రకారం 2017 లోనే అమెరికా కన్న ధనిక దేశమైంది. మరొక పదేళ్లలో అన్ని విధాలా అమెరికాను మించగలదన్నది నిపుణుల ఏకాభిప్రాయంగా కనిపిస్తున్నది. దీనికిదే ఒక ప్రమాదకరమైన స్థితి కాగా, బహుశా అంతకు మించిన సవాలు ఒకటి ముంచుకొస్తున్నది.
సోవియెట్ యూనియన్ 1991లో పతనమైన తర్వాత అమెరికా నాయకత్వాన ఏకధ్రువ ప్రపంచం ఏర్పడి ఎదురు లేకుండా సాగుతుండిన స్థితిలో, చైనా చొరవతో క్రమంగా బహుళ ధ్రువ ప్రపంచం రూపు తీసుకుంటున్నది.యథాతథంగా చైనా ఒక బలమైన శక్తికా వటం, గత 10 15 సంవత్సరాలుగా రష్యా తిరిగి పుంజుకొంటుడటం, ఆ రెండిటి మధ్య సాన్నిహిత్యం, బ్రిక్స్ పేరిట దక్షిణ అమెరికా, ఆఫ్రికా, ఆసియాలకు చెందిన ప్రముఖ దేశాలు ఇండియా సహా ఒక సంస్థగా రూపొందటం, డాలర్‌కు ప్రత్యామ్నాయ కరెన్సీ అని ఇంకా అనకపోయినా డాలర్‌కు బదులు తమ స్థానిక కరెన్సీల వినియోగాన్ని పెంచుకోవాలని నిర్ణయించి అందుకొక చెల్లింపుల వ్యవస్థను, ప్రత్యేక బ్యాంకును ఏర్పాటు చేస్తుండటం వంటివి అమెరికాకు తీవ్రమైన కలవరపాటు ను కలిగిస్తున్నాయి. ఇంతే ముఖ్యంగా ప్రపంచ మంతటిన్నీ ప్రత్యామ్నాయ వాణిజ్య బంధంలోకి తెచ్చే బెల్డ్ అండ్ రోడ్ ఇనీషియేటివ్ (బిఆర్‌ఐ) లోకి తెచ్చే పథకాన్ని చైనా ఆరంభించగా, ఇప్పటికే కొన్ని యూరోపియన్ దేశాలతో సహా సుమారు 145 దేశాలు అందులో చేరటం అమెరికాకు ఆందోళన కారణమవుతున్నది.
దీనంతటికి తగినట్లు ప్రపంచం అంతగా ప్రజలలో, ఆలోచనాపరులలో వర్ధమాన దేశాల ప్రభుత్వాలలో అమెరికా, యూరప్‌ల ఆధిపత్యం పట్ల వ్యతిరేక భావనలు విస్తరిస్తున్నాయి.ఈ పరిస్థితులు ఇట్లాగే కొనసాగితే బహుళ ధ్రువ ప్రపంచం సుస్థిరమై బలపడుతూ తన ఏక ధ్రువ ప్రపంచం ముగిసిపోగలదని అమెరికాకు బాగా అర్థమైందనుకోవాలి. ఆ స్థితిని వారు ఎంత మాత్రం సహించరు. అట్లాగని ఒకప్పటివలే యుద్ధాలకు తలపడలేరు. రష్యా, చైనాల అణుశక్తి దృష్టా. అందువల్ల ఏదో ఒక విధంగా ఆర్థికంగా దెబ్బ తీయాలన్నది ట్రంప్ వ్యూహం. అందుకే చైనాపై సుంకాలను తాజాగా 125 శాతానికి పెంచారు. కాని తాము ఎంతవరకైనా పోరాడతాము తప్ప లొంగే ప్రసక్తి లేదని చైనా నాయకత్వం వెంటనే స్పష్టం చేసింది.
– టంకశాల అశోక్ దూరదృష్టి ( రచయిత సీనియర్ సంపాదకులు)