Saturday, December 21, 2024

ప్రధాని మోడీ అక్కసు!

- Advertisement -
- Advertisement -

అవినీతి నిర్మూలన కృషిని అడ్డుకోడానికి అవినీతిపరులంతా ఏకమయ్యారని ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిపక్షాలపై సంధించిన తాజా విమర్శ దొంగే ‘దొంగ .. దొంగ’ అని అరిచినట్టుంది. తన సన్నిహిత మిత్రుడు షేర్ మార్కెట్ ఘరానా మోసగాడు గౌతమ్ అదానీ సంస్థల షేర్లలోకి నిస్సహాయ స్థితిలోని వృద్ధుల ప్రావిడెంట్ ఫండ్ నిధులు ప్రవహిస్తున్న దారుణ ప్రజాధన దోపిడీ ఇంకా కొనసాగుతున్నదని తాజా వార్తలు స్పష్టం చేస్తుండగా అవినీతిపరులంటూ ప్రతిపక్ష నేతలపై దాడికి దిగడం తెడ్డు నాకిన అత్త కోడలిని తిట్టిపోసిన చందంగా వుంది. ఇది అన్ని ప్రజాస్వామిక విలువలకూ తిలోదకాలిచ్చిన ఎదురు దాడిగానే పరిగణన పొందుతుంది. కేవలం నరేంద్ర మోడీ వంటి నేతలకే చెల్లుతుంది. ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఖాతాల్లో 27 కోట్ల మంది పొదుపు సొమ్ము వున్నట్టు సమాచారం.

గత జనవరిలో హిండెన్‌బర్గ్ నివేదిక వెల్లడైన తర్వాత అదానీ గ్రూపు సంస్థల షేర్లు భారీ పతనానికి గురయ్యాయి. వాటి మార్కెట్ విలువ రూ. 19.2 లక్షల కోట్ల నుంచి రూ. 8.9 లక్షల కోట్లకు పడిపోయింది. తాజాగా మొన్న మంగళవారం నాడు అదానీ షేర్ల విలువ మరి రూ. 50 వేల కోట్ల మేరకు తరిగిపోయింది. తాము భద్రంగా కాపాడవలసిన ప్రజాధనం ఈ షేర్లలోకి ప్రవహించడాన్ని ఇకనైనా ఆపాలనే ఇంగిత జ్ఞానం లేకుండా వాటిని ఇంకా తమ మిత్రుడికి పళ్లెంలో పెట్టి అందిస్తూ వుండడం కంటే అవినీతి ఇంకేమైనా వుంటుందా! అదానీ సంస్థల షేర్ మార్కెట్ కుంభకోణం గురించి పార్లమెంటులో ప్రకటన చేయడానికి మొండిగా నిరాకరిస్తున్న ప్రధాని మోడీ అందుకోసం ఒక్క కంఠంగా డిమాండ్ చేస్తున్న ప్రతిపక్ష నేతలను అవినీతిపరులనడం వారిని చూసి భయపడడంగానే పరిగణించాలి.

ఇడి, సిబిఐ వంటి సంస్థలు కేవలం ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల్లోని బిజెపియేతర పార్టీల ముఖ్య నేతలపైనే పని కట్టుకొని దాడులు చేయడం, వారిలో ఎవరైనా బిజెపిలో చేరిపోతే వారి మీది కేసులను ఎత్తివేయడం ఎంతటి రాజకీయ కక్షతో కూడుకొన్న విధానమో వివరించి చెప్పనక్కర లేదు. ప్రజాధనాన్ని కాపాడడం కోసం నెలకొన్న ఇడి, సిబిఐ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలను కేంద్ర పాలక పక్షం బిజెపి తన రాజకీయ ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేస్తున్న విషయం కళ్లకు కనిపిస్తున్నదే. ఇది అవధులు మీరి పేట్రేగిపోతున్న నేపథ్యంలో ఇటీవల ప్రతిపక్ష నేతలందరూ కలిసి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇంకొక వైపు కాంగ్రెస్ సహా దాదాపు అన్ని ప్రతిపక్ష పార్టీలు సంఘటితమై బిజెపితో పోరాటానికి రంగాన్ని సిద్ధం చేసుకొంటున్నారు. ఈ పరిణామాలను చూసి భయపడుతున్న ప్రధాని మోడీ దేశ ప్రజల దృష్టిలో ప్రతిపక్షాన్ని తక్కువగా చూపించడానికి వాస్తవాలకు మసిబూసి మారేడు కాయ చేసే దుస్సాహసానికి పాల్పడుతున్నారు.

మంగళవారం నాడు ఢిల్లీలోని బిజెపి కేంద్ర ప్రధాన కార్యాలయాల నూతన విభాగానికి ప్రారంభోత్సవం జరిగిన సందర్భంలో మాట్లాడుతూ ప్రతిపక్షాలపై ఆయన తన అక్కసునంతా వెళ్లగక్కారు. 2002 నాటి మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ఇడి తీసుకొంటున్న చర్యలు ఎంతో ఘనమైనవని మోడీ కీర్తించారు. అటువంటప్పుడు మనీలాండరింగ్ అవకతవకలన్నీ ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల్లోనే జరుగుతాయా? బిజపి పాలిత రాష్ట్రాల్లో అవినీతి మచ్చుకైనా వుండదా? ఇడి దాఖలు చేసిన కేసుల్లో 95 శాతం ప్రతిపక్ష రాష్ట్రాల్లోనే నమోదు కావడం వాస్తవాన్ని చెపకనే చెబుతున్నది. ప్రధాని మోడీ పాలనలో రాజకీయ ప్రత్యర్థులపై ఇడి దాడులు 27 రెట్లు పెరిగాయి. ఈ దాడులు కొద్ది మంది ప్రతిపక్ష నేతల మీద, ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న మీడియా వర్గాలపైన విరుచుకుపడడం గమనార్హం. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలులో భారీ అవినీతి చోటు చేసుకొన్నట్టు సమగ్ర సమాచారం వెల్లడైనా అందుకు బాధ్యుల మీద ఈగ కూడా వాలలేదు.

కర్నాటకలో మంత్రుల, పాలక పక్ష ఎంఎల్‌ఎల అవినీతి బాహాటంగా కళ్లకు కడుతున్నా ఆ ఉదంతాల మీద కేంద్ర దర్యాప్తు సంస్థల కన్ను పడకపోడం తెలిసిందే. మధ్యప్రదేశ్‌లో మధ్యాహ్న భోజన పథకంలో అవినీతి చోటు చేసుకొన్నట్టు బయటపడినా దాని గురించి ఏ ఒక్క కేంద్ర దరాప్తు సంస్థా పట్టించుకోకపోడం ప్రధాని మోడీ అవినీతి వ్యతిరేక యజ్ఞం పరువు తీస్తున్నది. అలాగే వ్యాపం కుంభకోణంపై దర్యాప్తు కూడా నీరుగారిపోయింది. పోంజి కుంభకోణం నిందితుడైన హిమంత బిష్వాస్ శర్మ కాంగ్రెస్ నుంచి బిజెపిలో చేరిపోగానే పరిశుద్ధుడైపోయి అసోం ముఖ్యమంత్రి పదవి కూడా ఆయనను వరించడం ప్రధాని మోడీ అవినీతి వ్యతిరేక గర్జన గమ్మత్తును బయటపెడుతున్నది. అలాగే బెంగాల్‌లో నారద కుంభకోణం నిందితుడు సువేంధు అధికారి బిజెపిలో చేరగానే దాని పై దర్యాప్తు అటకెక్కింది. శారదా కుంభకోణంలోని ముకుల్ రాయ్ విషయంలోనూ అదే జరిగింది. ప్రధాని మోడీ తాను స్వయంగా అవినీతిపరులకు ఆశ్రయమిస్తూ ప్రతిపక్ష నేతలు అవినీతిపరులంటూ వారిపై బురద చల్లడం తొండి రాజకీయమేనని ప్రజలు గుర్తించక మానరు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News