Tuesday, December 24, 2024

ఏల్నాటి శని.. దాని ప్రభావం.. తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు

- Advertisement -
- Advertisement -

ప్రతి వ్యక్తీ తన జీవితకాలంలో శని ప్రభావానికి లోనవుతాడు. మందగమనం కలిగినవాడైనందున ఈయనను శనైశ్వరుడు అంటారు. ఈయన నవగ్రహాల్లో అతి శక్తిమంతుడు. ఈయనకు కాకి వాహనం. మకరం, కుంభ రాశులకు అధిపతి శని. శనైశ్వరుని భార్య జ్యేష్ఠాదేవి. శనివారం, త్రయోదశి తిథి కలిసివస్తే శనిత్రయోదశి అంటారు. ఈరోజు శనికి అత్యంత ప్రీతికరమైనది. ఈయనకు తిల తైలాభిషేకం శ్రేష్టం. గోచారరీత్యా శని మేషాది రాశుల్లో సంచరిస్తాడు. ఒక్కొక్క రాశిలో రెండున్నర సంవత్సరాల పాటు సంచరిస్తాడు. అంటే 12రాశుల్లో సంచారం పూర్తి చేయడానికి మొత్తం 30 సంవత్సరాల సమయం పడుతుంది. 30 ఏళ్లకు ఒకసారి ప్రతిఒక్కరిపై ఏల్నాటి శని ప్రభావం ఉంటుంది. ఏల్నాటి శని వల్ల కలిగే కష్టనష్టాలు ఇలా ఉంటాయి.

జాతకునికి గోచారరీత్యా తన జన్మరాశి(జన్మనక్షత్రాన్ని బట్టి చూసుకోవాలి) నుంచి 12,1,2 స్థానాల్లో శని సంచరించే కాలాన్ని ఏల్నాటి శని అంటారు. ఈ మూడు రాశుల్లో మొత్తం ఏడున్నర సంవత్సరాలు సంచరించడం వల్ల దీనిని ఏల్నాటి శని అంటారు. 12వ రాశిలో సంచరిస్తున్నప్పుడు వ్యవహారాల్లో చిక్కులు, వ్యాపారాల్లో ఒడిదుడుకులు, ఊహించని మార్పులు, అనారోగ్యం, ఔషధ సేవనం. తరచూ ప్రయాణాలు.

జన్మరాశిలో సంచరిస్తున్నప్పుడు ఆరోగ్యభంగం, అపనిందలు, భాగస్వాములతో వైరం, మనశ్శాంతి లోపం. ధనవ్యయం. రుణబాధలు. వృత్తి, వ్యాపారాల్లో చికాకులు. స్థానమార్పు సూచనలు. రెండవ రాశిలో సంచరిస్తున్నప్పుడు ఆశలు కల్పించి నిరాశ కల్పిస్తాడు. రుణబాధలు, అనారోగ్యం, మానసిక ఆందోళన వంటి ఫలితాలు ఉంటాయి.

జీవితంలో మొదటిసారి వచ్చే ఏల్నాటి శనిని మంగు శని అంటారు. ఈ కాలంలో జాతకునికి చిక్కులు, కష్టనష్టాలు ఎక్కువగా ఉంటాయి. రెండవ పర్యాయం (30 సంవత్సరాల అనంతరం) వచ్చే ఏల్నాటి శనిని పొంగుశని అంటారు. ఈ కాలంలో అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. ఆర్థిక, ఆస్తిలాభాలు, గృహయోగాలు, ఉద్యోగయోగం వంటి ఫలితాలు కలుగుతాయి.

మూడవ పర్యాయం వచ్చిన శనిని మృత్యుశని అంటారు. ఈ కాలంలో ఆరోగ్య సమస్యలు, అపమృత్యుభయం వంటి చికాకులు ఎదుర్కొంటారు.అలాగే, జన్మరాశికి 4,8, 10 స్థానాల్లో శని సంచరిస్తున్నప్పుడు అర్ధాష్టమ, అష్టమ, దశమ శని సంచారం అంటారు. ఇవి కూడా దోషకారకమే. అర్ధాష్టమ శని.. జన్మరాశి నుంచి నాలుగో రాశిలో శని సంచరిస్తే అర్ధాష్టమ శని అంటారు. రాజకీయ, వ్యాపారాల్లో చిక్కులు, కుటుంబసమస్యలు, అశాంతి, ఆకస్మిక బదిలీలు. వ్యాపార, ఉద్యోగాల్లో మార్పులు వంటి ఫలితాలు ఉంటాయి.

అష్టమశని… జన్మరాశి నుంచి 8వ స్థానంలో శని సంచరించడాన్ని అష్టమ శని అంటారు. ఈ కాలంలో ఉద్యోగాల్లో ఆటంకాలు. వ్యాపారాల్లో ఒడిదుడుకులు. ఆలోచనలు స్థిరంగా ఉండకపోవడం, అశాంతి. అనారోగ్య సూచనలు వంటి ఫలితాలు ఉంటాయి. దశమ శని..జన్మరాశి నుంచి 10వ స్థానంలో శని సంచరిస్తున్నప్పుడు కంటక శని అంటారు. దీనివల్ల కోర్టు కేసులు, సాంఘిక, రాజకీయంగా అపవాదులు, అధికారులతో విభేదాలు, ఉద్యోగులకు ఆకస్మిక బదిలీలు వంటి ఫలితాలు ఉంటాయి. అయితే జాతకచక్రంలో శని మంచి స్థితిలో ఉన్నప్పుడు, గోచారంలో గురు బలం ఉన్నప్పుడు ఏల్నాటి శని అంతగా బాధించడు. ఈదోషాలు ఉన్న వారు శనికి తైలాభిషేకాలు, జపాదులు చేయించుకుంటే కొంత ఉపశమనం కలుగుతుంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News