బిలియనీరు ఎలన్ మస్క్ ప్రకటన
న్యూయార్క్ : తాను ట్విట్టర్‌ను దాదాపు 41 బిలియన్ డాలర్లకు కొనేస్తానని బిలియనీరు ఎలన్ మస్క్ ప్రతిపాదించారు. ఫేస్‌బుక్, వాట్సాప్ శ్రేణిలో ట్విట్టర్ కూడా బహుళ ప్రచారపు సామాజిక మాధ్యమంగా ఉంది. తనకు ఈ సోషల్ మీడియా కంపెనీ బోర్డులో స్థానం ఆహ్వానాన్ని కొద్దిరోజుల క్రితమే ఈ సంచలనాత్మక ధనవంతుడు తిరస్కరించారు. ట్విట్టర్ కోసం తన ఆఫర్ ధర షేర్‌కు 54.20 డాలర్లు అని గురువారం వెలువరించిన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో మస్క్ తెలిపారు. ఇది ట్విట్టర్ ఎప్రిల్ 1 ముగింపు దశలో 38 శాతం ప్రీమియంగా ఉంటుందంఇ. టెస్లా సిఇఓ అయిన మస్క్ తనకు ఈ కంపెనీలో ఇప్పటికే 9 శాతం వాటా ఉందని బహిరంగంగా ప్రకటించారు. మస్క్ ఆఫర్ నేపథ్యంలో తాజాగా ట్విట్టర్ షేర్లు అమాంతంగా 12 శాతం ఎగబాకాయి.
తన పెట్టుబడులకు సరైన ఫలితం దక్కేందుకు , వాస్తవికత ప్రాతిపదికన తాను ట్విట్టర్ కొనుగోలుకు ఆఫర్ చేసినట్లు తెలిపారు. ఇప్పుడున్న పద్ధతిలో ట్విట్టర్ తన సామాజిక బాధ్యతలను సరిగ్గా తీర్చలేకపోతోందని తాను గుర్తించినట్లు తెలిపారు. ట్విట్టర్‌ను పూర్తి స్థాయిలో ప్రైవేటు కంపెనీగా మార్చాలనేదే తన ఆలోచన అని ట్విట్టర్ ఛైర్మన్ బ్రెట్ టేలర్‌కు రాసిన లేఖలో మస్క్ వివరించారు. తాను అత్యుత్తమైన ఆఫర్‌ను ఇదే చివరిదిగా ప్రతిపాదించినట్లు, దీనిని యాజమాన్యం ఆమోదించకపోతే తన దారి తనకు ఉంటుందని, వాటాదారుగా తన నిర్ణయం తాను తీసుకోవల్సి ఉంటుందని కూడా లేఖలో హెచ్చరించారు. గత వారం ఆయనను ట్విట్టర్ బోర్డులో చేరాలని పిలుపు వచ్చింది. అయితే దీనిని తోసిపుచ్చారు. ఇప్పుడు ఏకంగా దీనిని కొనేందుకు ముందుకు వచ్చారు.