Sunday, March 16, 2025

నింగిలోకి దూసుకెళ్లిన ఫాల్కన్ 9 రాకెట్

- Advertisement -
- Advertisement -

అంతరిక్షంలో చిక్కుకుపోయిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ మరో వ్యోమగామి బచ్ విల్మోర్‌లను తీసుకొచ్చేందుకు ముందడుగు పడింది. ఆమెను అంతరిక్షం నుంచి భూమిపైకి తీసుకురావడానికి తాజాగా నాసా స్పేస్ ఎక్స్‌లు క్రూ 10 మిషన్‌ను చేపట్టాయి. నలుగురు వ్యోమగాములతో కూడిన ఫాల్కన్ 9 రాకెట్ భారత కాలమానం ప్రకారం శనివారం ఉదయం 4.33 గంటలకు కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి నింగి లోకి దూసుకెళ్లింది. దీంతో సునీతా, విల్మోర్‌లు తొమ్మిది నెలల తరువాత భూమ్మీదకు చేరవచ్చు. విల్మోర్ కు భార్య , ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. సునీతా విలియమ్స్‌కు భర్త, తల్లి ఉన్నారు. ప్రతివారి నుంచి తమకు అందిన ప్రేమ, మద్దతుకు తాము ప్రశంసిస్తున్నామని ఈ వారం మొదట్లో ఒక ఇంటర్వూలో సునీతా విలియమ్స్ వెల్లడించారు. ఈ మిషన్ అప్రమత్తంగా ఉండాలని తమకు పాఠాలు చెప్పిందన్నారు. ఇందులో మంచి, చెడు ఉన్నా మంచే ఎక్కువగా ఉందని తాను భావిస్తున్నానని పేర్కొన్నారు.

తాము ఇక్కడ ఏం చేస్తున్నామో చాలా మంది ప్రజలు ఆసక్తి చూపించారన్నారు. మూడోసారి రోదసీ లోకి వెళ్లి అంతరిక్ష కేంద్రం లో చిక్కుకున్న సునీతా విలియమ్స్ త్వరలోనే భూమి మీద అడుగు పెట్టబోతున్నారు. 2024 జూన్‌లో వ్యోమగాములు సునీతా విలియమ్స్ ,బచ్ విల్మోర్, నిక్‌హెగ్, అలెగ్జాండర్ గోర్బునోవ్ మిషన్ క్రూ 9 ప్రాజెక్టులో భాగంగా బోయింగ్ స్టార్‌లైనర్ రాకెట్ ద్వారా అంతరిక్షం లోకి వెళ్లారు. నాసా షెడ్యూల్ ప్రకారం అంతరిక్షంలో వీరి పర్యటన వారం రోజులు. తర్వాత వీరు భూమి మీదకు తిరిగి రావలసి ఉంది. కానీ స్టార్‌లైనర్ స్పేస్ క్రాఫ్ట్… ఐఎస్‌ఎస్‌కు చేరుకోగానే సమస్యలు తలెత్తాయి. అందులోని ప్రొపల్షన్‌సిస్టమ్‌లో లీకులు ఏర్పడి, థ్రస్టర్స్ మూసుకుపోవడంతోపాటు హీలియం కూడా అయిపోయింది. ఈ నేపథ్యంలో వ్యోమగాములను ఈ నౌకలో తిరిగి భూమిపైకి తీసుకురావడం సురక్షితం కాదని ఆగస్టు నెలాఖరునాటికి నాసా ఒక నిర్ణయానికి వచ్చింది. దీంతో వ్యోమగాములు లేకుండా బోయింగ్ స్టార్‌లైనర్ 2024, సెప్టెంబర్ 7న క్షేమంగా భూమికి తిరిగి వచ్చింది. దీంతో దాదాపు తొమ్మిది నెలలు సునీతా విలియమ్స్, బచ్ విల్మోర్ అంతరిక్ష కేంద్రం లోనే ఉంటున్నారు.

ఈ నేపథ్యంలో రెండోసారి అమెరికా అధ్యక్ష పగ్గాలు చేపట్టిన ట్రంప్…అంతరిక్షకేంద్రంలో చిక్కుకుపోయిన వ్యోమగాములను వెంటనే భూమిపైకి తీసుకురావాలని నాసా, ఎలాన్ మస్క్‌ను ఆదేశించారు. దీంతో వారిని తిరిగి భూమిపైకి తీసుకురావడానికి మూడు రోజుల క్రితం క్రూ10 మిషన్‌ను చేపట్టేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే చివరినిమిషంలో సాంకేతిక కారణాలతో ఆ ప్రయోగాన్ని నిలిపివేశారు. తాజాగా వారిని తీసుకు రాడానికి మళ్లీ ప్రయోగం చేపట్టారు. డ్రాగన్ క్యాప్సుల్‌లో ఐఎస్‌ఎస్‌కు వెళ్లిన వారిలో అన్నె మెక్లెయిన్ , నికోల్ అయర్స్, టకుయా ఒనిషి, కిరిల్ పెస్కోవ్ వ్యోమగాములు ఉన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News