బెంగళూరు : ప్రపంచ కుబేరుడు ఎలాన్‌మస్‌క నేతృత్వం లోని సోషల్ మీడియా ‘ఎక్స్’ భారత ప్రభుత్వంపై దావా వేసింది. ఈమేరకు కర్ణాటక హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. చట్ట విరుద్ధంగా కంటెంట్‌ను నియంత్రిస్తోందని, ఏకపక్షంగా సెన్సార్‌షిప్‌నకు పాల్పడుతోందని కేంద్రంపై ఆరోపణలు చేసింది. ఐటి చట్టం, సహ్యోగ్ పోర్టల్ నిబంధనలు తమకున్న చట్టబద్ధమైన రక్షణలను ఉల్లంఘించేలా ఉన్నాయని, ఇది తమపై అనధికారికంగా సెన్సార్ చేయడం కిందకే వస్తుందని ఎక్స్ సంస్థ తన పిటిషన్‌లో పేర్కొంది. ప్రభుత్వం ఐటీ చట్టం లోని సెక్షన్ 79 (3)(b) ని దుర్వినియోగం చేస్తోందని ఆరోపించింది.న ఐటీ చట్టం ప్రకారం బ్లాక్ చేసిన కంటెంట్‌ను తొలగించకపోతే ఎక్స్ తన చట్టబద్ధమైన రక్షణ కోల్పోయే అవకాశం ఉంటుంది. అయితే ఈ సెక్షన్ కింద కంటెంట్ బ్లాక్ చేసే అధికారాన్ని ప్రభుత్వానికి ఇవ్వలేదని ఎక్స్ వాదిస్తోంది.
సెక్షన్ 69 a ని పక్కదారి పట్టించడానికి అధికారులు ఈ నిబంధనను దుర్వినియోగం చేస్తున్నారని పేర్కొంది. దేశంలో అల్లర్లు, ఘర్షణలకు కారణమయ్యే పోస్టులు, పూర్తి వివరాలు లేకుండా సృష్టించిన ఖాతాలపై నియంత్రణ విధించేందుకు సెక్షన్ 69 ఎ ప్రకారం కేంద్రానికి అధికారం ఉంటుంది. అదే సమయంలో సెక్షన్ 79 (3) (b) స్పష్టమైన నియమాలు, తనిఖీలు లేకుండా అధికారులు సమాచారాన్ని బ్లాక్ చేయడానికి అధికారులు అనుమతి ఇస్తున్నారని, తన పిటిషన్‌లో ప్రస్తావించిందని జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఇది విస్తృతమైన సెన్సార్‌షిప్‌నకు దారి తీస్తోందని విమర్శలు చేసింది. ఈ దావాపై కేంద్ర ప్రభుత్వ వర్గాల నుంచి స్పందన వచ్చింది. ప్రభుత్వం చట్టాన్ని అనుసరించి ముందుకెళ్తుందని సోషల్ మీడియా సంస్థలు నిబంధనలు పాటించాల్సిందేనని ఆయా వర్గాలు పేర్కొన్నాయి.