Friday, December 20, 2024

కమ్యూనిస్టుగా ఎలన్ మస్క్ కుమార్తె

- Advertisement -
- Advertisement -

కమ్యూనిజం విస్తరణకు అమెరికా ఇతర ధనిక దేశాలు ప్రచ్ఛన్న యుద్ద్ధం సాగించాయి. అనేక దేశాల్లో కుట్రలు చేశాయి. మిలిటరీ నియంతలను గద్దెలపై కూర్చోపెట్టాయి. సైనిక కూటములను ఏర్పాటు చేశాయి. వియత్నాం, లావోస్, కంపూచియా, ఉత్తర కొరియాలపై భౌతిక దాడులకు పాల్పడి భంగపడ్డాయి. విధిలేని స్థితి లో వియత్నాం నుంచి అమెరికన్లు బతుకు జీవుడా అంటూ పారిపోయారు. తన కుమార్తె కమ్యూనిస్టుగా మారిందన్న ఉక్రోషం, కమ్యూనిస్టు భావజాల ప్రచారానికి ఒక వేదికగా ఉన్నందున నిరోధించేందుకు ఏకంగా సామాజిక మాధ్యమం ట్విటర్‌నే ప్రపంచ ధనవంతులలో ప్రథమ స్థానంలో ఉన్న ఎలన్ మస్క్ కొనుగోలు చేసినట్లు త్వరలో వెలువడనున్న జీవిత చరిత్రలో వెల్లడించారు. ఎలన్ మస్క్ 2000నుంచి 2016 వరకు మూడు వివాహాలు చేసుకొని ముగ్గురికీ విడాకులు ఇచ్చాడు.

తరువాత 2018 నుంచి 2021 వరకు ఒకామెతో సహజీవనం చేశాడు. ఇప్పుడెలా ఊరేగుతున్నాడో తెలవదు. పది మంది పిల్లల్ని కన్నాడు. వారిలో ఒకడైన గ్జేవియర్ అలెగ్జాండర్క్ మస్క్ 2004లో పుట్టాడు. 2022 జూన్‌లో కాలిఫోర్నియా కోర్టుకు సమర్పించిన ఒక వినతిలో తన పేరును వివియన్ జెనా విల్సన్ అని మార్చుకొనేందుకు అంగీకరించాలని, తాను యువతిగా లింగమార్పిడి చేయించుకున్నట్లు పేర్కొన్నాడు. తన తండ్రి ఎలన్ మస్క్‌తోగానీ, అతని ఆస్తిపాస్తులతోగాని తనకు ఎలాంటి సంబంధం లేదని క్రటించాడు. 2021లో లింగమార్పిడి జరిగింది.

తన కుమారుడు లింగ మార్పిడి చేయించున్నదాని కంటే స్కూల్లో వామపక్ష భావజాలానికి ప్రభావితుడు కావటం ఎలన్ మస్క్‌కు ఆగ్రహం తెప్పించింది. పచ్చిమితవాద అయిన మస్క్ తన కుమార్తెను కమ్యూనిస్టుగా వర్ణించాడు. కాలిఫోర్నియాలోని ఒక స్కూల్లో ఏడాదికి 50 వేల డాలర్ల ఫీజు చెల్లించి ఒకస్కూల్లో చదివిస్తుండగా కమ్యూనిస్టు భావజాల వైరస్‌కు గురైందని, తన పట్ల కుమార్తె వైఖరి మారటానికి కొంత వరకు క్రాస్‌రోడ్స్ ఆర్ట్స్ అండ్ సైన్సు స్కూలు పురోగామి విధానాలు కూడా కారణమని ఆరోపించాడు. తనకుమార్తె సోషలిజాన్ని అధిగమించి ధనవంతులందరూ దుష్టులని భావించే పూర్తి స్థాయి కమ్యూనిస్టుగా మారిందని చెప్పాడు.

తొలి రోజుల్లో ఉదారవాద భావాలతో కొడుకు లేదా కుమార్తె ఉన్నట్లు సరిపెట్టుకున్న తరువాత తెగతెంపులు చేసుకున్నాడు. అంతేకాదు, దీనంతటికీ కమ్యూనిస్టు భావజాల ప్రచారానికి వేదికగా ఉపయోగపడుతున్న ట్విటర్ కూడా తన బిడ్డ వంటి అనేక మందిని మార్చుతున్నదని, ట్విటర్ వేదికగా ఆ భావజాలం రోజు రోజుకు పెరుగుతున్నదని భావించాడు. అది ప్రజాస్వామ్యం, స్వేచ్ఛా భావ ప్రకటనకు ముప్పుగా దాని విధానాలను మార్చేందుకు ఏకంగా 44 బిలియన్ డాలర్లతో ఆ సంస్థను కొనుగోలు చేయాలని నిర్ణయించుకున్నాడు. అంటే పురోగామి భావాలను అడ్డుకొని మితవాద ప్రచారానికి దాన్ని వేదికగా మార్చనున్నాడన్నది స్పష్టం. దానికి అనుగుణంగానే గత యాజమాన్యం రద్దు చేసిన డోనాల్డ్ ట్రంప్ వంటి పచ్చిమితవాదుల ఖాతాలన్నింటినీ పునరుద్ధరించాడు.

ట్విటర్ పేరు ఎక్స్‌గా మార్చాడు. వాల్టర్ ఇసాక్‌సన్ రాసిన ఎలన్ మస్క్ జీవితచరిత్రను సెప్టెంబరు 12న మార్కెట్‌కు విడుదల చేయనున్నారు. దాని గురించి ఆసక్తి కలిగించేందుకు కొన్ని భాగాలను మీడియాకు విడుదల చేశారు. ఎలన్ మస్క్ వంటి కమ్యూనిస్టు వ్యతిరేక మితవాద భావజాలం ఉన్న వారు అమెరికాలో తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఒక బంతిని ఎదురుగా ఉన్న గోడ వైపు ఎంత గట్టిగా విసిరితే అంతే వేగంతో తిరిగి మన వైపు వస్తుంది. భావజాలం కూడా అంతే. దేన్నయినా అణచివేయాలని చూస్తే అంతే వేగంతో విస్తరిస్తుంది. కొత్త రాతియుగం నుంచి చైనా షీ జింపింగ్ వరకు కమ్యూనిజం చరిత్రపేరుతో జర్నలిస్టు పాల్ మాసన్ రాస్తున్న పుస్తకం 2026లో విడుదల కానుంది.ఒక భావం, ఒక ఉద్యమం, ఒక పాలన వరకు ఎలా పరిణమించిందీ దానిలో ఉంటుందని చెబుతున్నారు. కమ్యూనిస్టులు పురాతన, మధ్యయుగాలలో సంభవించిన తిరుగుబాట్ల నుంచి ఈ భావ చరిత్రను గుర్తించారు.

పందొమ్మిదవ శతాబ్ది పెట్టుబడిదారీ వ్యతిరేక ఉద్యమాల పెరుగుదలతోనే ఈ కథ ముగియలేదు అన్నాడు పాల్ మాసన్. ‘పశ్చిమ దేశాల ప్రజాస్వామ్యాలు గిడసబారాయి, తమమీద తమకే విశ్వాసం లేకుండా ఉన్నాయి. వాతావరణం గురించి పెరుగుతున్న ఆందోళన విప్లవాత్మక ఆర్థిక సమాధానాలను డిమాండ్ చేస్తున్నది. ప్రపంచ పేద దేశాల్లోని కోట్లాది మంది జనం దృష్టిలో చైనా ముందుకు తెచ్చిన అధికారతత్వ (ఇది రచయిత పదజాలం కాదు) రాజ్య నేతృత్వంలోని అభివృద్ధి ప్రత్నామ్నాయ నమూనాగా చూస్తున్నారు. ఇరవై సంవత్సరాల క్రితం కమ్యూనిజం అంతాన్ని చూశామని అనుకున్నాం.. ఈరోజు ప్రపంచంలో అతిపెద్ద రాజకీయ పార్టీ కమ్యూనిస్టు పార్టీయే. ప్రపంచంలో అత్యంత విజయవంతమైన ఆర్థిక వ్యవస్థగా ఉంది. కావున ప్రచ్ఛన్న యుద్ధంలో భావజాల విజేతలు సెలవు తీసుకుంటూ రాసిన ఉద్గ్రంధాలన్నిటినీ భిన్నమైన చరిత్రగా చూడాల్సిన అవసరం ఉన్నదని భావిస్తున్నాను. ఇప్పటికీ అనేక మంది ఆర్థిక పురోగతి సాధనకు స్వేచ్ఛ కోసం ఎందుకు సిద్ధం అవుతున్నారో అర్ధం చేసుకోవటానికి తోడ్పడుతుంది’ అని పాల్ మాసన్ చెప్పాడు.

అమెరికా స్కూళ్లలో విద్యార్ధులు కమ్యూనిస్టులుగా మారుతున్నారని గుండెలు బాదుకుంటున్నది ఒక్క ఎలన్ మస్క్ మాత్రమే కాదు. అనేక మంది మితవాద రాజకీయ నేతలు, ప్రజాప్రతినిధులు కూడా కమ్యూనిస్టు, చైనా వ్యతిరేకతతో ఊగిపోతున్నారు. అమెరికా స్కూళ్లు, విశ్వవిద్యాలయాలు చైనా సంస్థలతో పరిశోధనా ప్రాజెక్టులలో భాగస్వాములు కావటాన్ని నిషేధించాలని సెనెటర్ జేవ్‌‌సు లాంక్ ఫోర్డ్ డిమాండ్ చేశాడు. అంతర్జాతీయంగానే కాదు, అమెరికా గడ్డ మీద కూడా దేశాన్ని సవాలు చేస్తున్నదని, విద్యా సంస్థలలో పాతుకుపోతున్నదని ఒక ప్రకటనలో తాజాగా ఆరోపించాడు.

అమెరికా పరిశోధనలను తస్కరిస్తున్నదని, రాజకీయంగా విద్యార్థులు, బోధకులు, వారి కుటుంబాల మీద ప్రభావం చూపుతున్నదని చెప్పుకున్నాడు. అమెరికాలో తన ప్రతిష్ఠను పెంచేందుకు అనేక పథకాలను రూపొందించిందని, వాటి ద్వారా గూఢచర్యం జరుపుతున్నదని ఆరోపించాడు. ఆగస్టు 27న పరిశోధన ఒప్పందం ముగిసినప్పటికీ జో బైడెన్ సర్కార్ మరో ఆరు నెలలు పొడిగించిందని వాపోయాడు. కమ్యూనిస్టు వ్యతిరేక ఉన్మాదం అమెరికా పక్కనే ఉన్న మెక్సికోకు కూడా పాకింది. పాఠ్య పుస్తకాలకు కమ్యూనిస్టు వైరస్ సోకిందంటూ కొన్ని చోట్ల క్రైస్తవ మత బృందాలు తలిదండ్రుల పేరుతో కొందరిని సమీకరించి పుస్తకాలను తగులబెట్టే కార్యక్రమాన్ని చేపట్టారు. ఆ పుస్తకాల్లో లైంగిక విజ్ఞానం, లింగ సమానత్వం వంటి అంశాలు ఉన్నాయన్నది వారి ఆరోపణ. వాటి పంపిణీ నిలిపివేయాలని వారు డిమాండ్ చేశారు. ఆ పుస్తకాల్లో మార్క్సిస్టు కమ్యూనిస్టు సిద్ధాంతాలను చేర్చారని ఆరోపించారు. ప్రభుత్వం ఈ ఆరోపణలను కొట్టిపారవేసింది. పాఠ్య అంశాలను టీచర్లు, నిపుణులు రూపొందించినట్లు పేర్కొన్నది.

అమెరికాలోని ఫ్లోరిడా రాష్ర్ట శాసనసభలో రిపబ్లికన్ పార్టీ ప్రతినిధి మరియ ఎలివిరా సాలాజార్ ఒక బిల్లును ప్రవేశపెట్టారు. దానిలో కమ్యూనిజం, నిరంకుశత్వాలను ఒకే గాటన కడుతూ వాటి వలన సంభవించే నష్టాలను విద్యార్ధులకు చెప్పాలని పేర్కొన్నారు. అమెరికా యువత కమ్యూనిస్టుల పాలనలో జరిగిన నేరాల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కమ్యూనిజం బాధితుల ఫౌండేషన్‌కు పాఠాలను రూపొందించే బాధ్యత అప్పగించాలని ప్రతిపాదించారు. గతంలో కూడా సాలాజార్ ఇదే బిల్లును ప్రవేశపెట్టగా దాన్ని చర్చించకముందే మురిగిపోయింది. ఈ బిల్లును ప్రతిపాదించినపుడు అధికారంలో డెమొక్రాట్లు ఉన్నారు. ఇప్పుడు రిపబ్లికన్లు ఉన్నందున తిరిగి ప్రవేశపెట్టారు.

క్యూబా, కొరియా, వియత్నాం తదితర దేశాల నుంచి పారిపోయి వచ్చిన కమ్యూనిస్టు వ్యతిరేకులు ఈ బిల్లుకు మద్దతు తెలిపారు. కమ్యూనిస్టు వ్యతిరేక వైరస్ ఒక్క అమెరికా, ఐరోపాల్లోనే కాదు మన దేశంలో కూడా ఉంది. ఇటీవల మహారాష్ర్టలోని నాగపూర్ విశ్వవిద్యాలయం ఎంఎ చరిత్ర విద్యార్ధుల సిలబస్‌లో అధ్యయనం చేయాల్సిన అంశాల్లో బిజెపి, రామజన్మ భూమిని చేర్చింది. కమ్యూనిస్టు ఉద్యమానికి సంబంధించిన పాఠ్యాంశాలను తొలగించింది. నూతన విద్యా విధానంలో భాగంగా సిలబస్‌లో మార్పులు చేర్పులు చేసినట్లు అధికారులు చెప్పారు. ఇదే విశ్వవిద్యాలయం గతంలో బిఎ విద్యార్ధులకు ఆర్‌ఎస్‌ఎస్ గురించి పాఠాన్ని సిలబస్‌లో చేర్చింది. కమ్యూనిస్టు ఉద్యమం, పార్టీల గురించి నేర్చుకోవాలనే ఆసక్తి కలగాలే గానీ పాఠ్యపుస్తకాలు, ట్విటర్, ఫేస్‌బుక్‌లతో పనేముంది.

అవేవీ లేనపుడు ప్రపంచమంతా వ్యాప్తి చెందలేదా? కమ్యూనిస్టు సిద్ధాంతాలకు సంబంధించిన పుస్తకాలను బ్రిటీష్ వారు, ఇతర సామ్రాజ్యవాదులు, అనేక దేశాల్లో ప్రభుత్వాలు నిషేధించినపుడు జనం వాటిని సంపాదించుకోలేదా అధ్యయనం చేయలేదా? ఈ చరిత్ర తెలిసి కూడా ఇలాంటి పిచ్చి పనులు చేస్తున్నారు. చరిత్రలో యంత్ర విధ్వంసకుల గురించి చదివాము. ఐరోపాలో చేనేత రంగంలో మరమగ్గాలు వచ్చినపుడు తమ వృత్తిని అవి దెబ్బ తీస్తున్నాయని ఆగ్రహించిన కార్మికులు వాటిని ధ్వంసం చేస్తే సమస్య పరిష్కారం అవుతుందని భావించి కొన్ని చోట్ల ఆపని చేశారు. సమస్య యంత్రాలది కాదు, వాటిని ధ్వంసం చేస్తే యాంత్రీకరణ ఆగదు. అదే విధంగా భూస్వాములను అంతం చేస్తే భూస్వామిక వ్యవస్థ రద్దవుతుందని నమ్మి ఆ పని చేసిన వారి సంగతి తెలిసిందే. అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరన్నది ఎంత వాస్తవమో నిషేధాల ద్వారా ఒక భావజాల వ్యాప్తిని అడ్డుకోవటం కూడా సాధ్యం కాదన్నది కూడా అంతే నిజం.

ఎం కోటేశ్వరరావు
8331013288

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News