‘ఆర్ఎక్స్ 100’, ‘మహాసముద్రం’ తర్వాత అజయ్ భూపతి దర్శకత్వంలో వస్తున్న సినిమా ‘మంగళవారం’. పాయల్ రాజ్‌పుత్ ఓ ప్రధాన పాత్రలో నటించారు. ‘రంగం’ ఫేమ్ అజ్మల్ అమీర్ మరో ప్రధాన పాత్రధారి. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో నవంబర్ 17న సినిమా విడుదల కానుంది. ఈ చిత్రాన్ని ముద్ర మీడియా వర్క్స్ పతాకంపై స్వాతి రెడ్డి గునుపాటి, సురేష్ వర్మ .ఎం నిర్మిస్తున్నారు. ఈ రోజు ‘ఏమయ్యిందో ఏమిటో…’ పాటను విడుదల చేశారు.
పాన్ ఇండియా హిట్ ‘కాంతార’, తెలుగులో ‘విరూపాక్ష’ సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న బి. అజనీష్ లోక్‌నాథ్ ‘మంగళవారం’ చిత్రానికి సంగీత దర్శకుడు. ఆయన ఇచ్చిన బాణీకి చైతన్య ప్రసాద్ సాహిత్యం అందించగా… హర్షిక ఆలపించారు.
అందమైన గోదావరి, పల్లెటూరి నేపథ్యంలో ‘ఏమయ్యిందో ఏమిటో…’ పాటను తెరకెక్కించారు. ఇందులో పాయల్ రాజ్‌పుత్, అజ్మల్ అమీర్ జంటగా కనిపించారు. ‘ఆర్ఎక్స్ 100’ పాటల్లో పాయల్‌ను అందంగా చూపించిన అజయ్ భూపతి… ఈ పాటలో ఆమెను కొత్తగా చూపించారు. మళ్ళీ మళ్ళీ వినాలనిపించేలా ‘ఏమయ్యిందో ఏమిటో… నిలవదు మనసే’ మెలోడీ ఉందని చెప్పాలి.
‘మంగళవారం’ నుంచి ఇప్పటికే తొలి పాట ‘గణగణ మోగాలిరా’ విడుదలైంది. ఆ పాటలో ఊరు ప్రజల్లో భయాన్ని అజయ్ భూపతి చూపించారు. కథ గురించి కొన్ని హింట్స్ ఇచ్చారు. ప్రతి మంగళవారం ఒక హత్య జరుగుతుందేమో అనిపిస్తుంది. ఇప్పుడీ ‘ఏమయ్యిందో ఏమిటో’ పాటలో హీరోయిన్ పాయల్ జీవితంలో ప్రేమను చూపించారు.
నిర్మాతలు స్వాతి రెడ్డి గునుపాటి, సురేష్ వర్మ .ఎం మాట్లాడుతూ ”అజయ్ భూపతి తెరకెక్కించే పాటలు చాలా ప్రత్యేకంగా ఉంటాయి. పాట కోసం అన్నట్లు కాకుండా ఆ పాటలోనూ కథ చెబుతారు. ‘ఏమయ్యిందో ఏమిటో’ రొమాంటిక్ సాంగ్! కథలో భాగంగా, కీలక సందర్భంలో వస్తుంది. పాయల్ నేపథ్యానికి, ఈ పాటకు చాలా సంబంధం ఉంటుంది. తొలి పాటకు మంచి స్పందన లభించింది. ఈ సాంగ్ కూడా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు తుది దశకు వచ్చాయి. త్వరలో ట్రైలర్ విడుదల తేదీ వెల్లడిస్తాం. నవంబర్ 17న భారీ ఎత్తున సినిమా విడుదల చేస్తాం” అని చెప్పారు.
చిత్ర దర్శకుడు అజయ్ భూపతి మాట్లాడుతూ ”ఇదొక డిఫరెంట్ యాక్షన్ థ్రిల్లర్. ఇందులో చాలా ఎమోషన్స్ ఉన్నాయి. అందులో లవ్ కూడా ఒకటి. అజనీష్ లోక్‌నాథ్ మంచి మెలోడీ అందించారు. అంతే అందంగా పిక్చరైజ్ చేశాం. ఈ సాంగ్ తప్పకుండా అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నా” అని చెప్పారు. ‘మంగళవారం’ చిత్రానికి అజయ్ భూపతి ‘A’ క్రియేటివ్ వర్క్స్ నిర్మాణ భాగస్వామి. ముద్ర మీడియా వర్క్స్ పతాకంపై స్వాతి రెడ్డి గునుపాటి, సురేష్ వర్మ .ఎంతో కలిసి చిత్రాన్ని నిర్మిస్తోంది.