డెల్టా వేరియంట్‌తో కేసులు పెరగడం వల్లే..
టోక్యో: కొవిడ్19 కేసులు పెరుగుతుండటంతో మరో 8 ప్రాంతాలను ఎమర్జెన్సీ జాబితాలో చేర్చినట్టు జపాన్ తెలిపింది. డెల్టా వేరియంట్ వల్ల జపాన్‌లో కేసులు ఒక్కసారిగా పెరగడంతో వైద్య సదుపాయాలు కల్పించడంలో ఇబ్బందులనెదుర్కొంటోంది. కేసులు అధికంగా నమోదవుతున్న ప్రాంతాలను ఎమర్జెన్సీ జాబితాలో చేర్చి వ్యాపార కార్యకలాపాలపై ఆంక్షలు విధిస్తోంది. సెప్టెంబర్ 12వరకు ఎమర్జెన్సీ నిబంధనలు అమలులో ఉంటాయని గత వారమే జపాన్ ప్రభుత్వం ప్రకటించింది. టోక్యోసహా 13 ప్రాంతాలు అప్పటికే ఎమర్జెన్సీ జాబితాలో చేరాయి. మొత్తం 47 ప్రాంతాలతో కూడిన జపాన్‌లో ఇప్పటివరకు 33 ప్రాంతాలు ఎమర్జెన్సీ, ఖ్వాసీ(అర్ధ)ఎమర్జెన్సీ జాబితాలో చేరాయి.
తాజాగా ఎనిమిదింటిని ఖ్వాసీ నుంచి పూర్తి ఎమర్జెన్సీ ప్రాంతాల జాబితాలో చేర్చారు. జులై 12 నుంచి టోక్యోను ఎమర్జెన్సీ జాబితాలో కొనసాగిస్తున్నారు. టోక్యోలో కరోనాబారిన పడిన మూడోవంతు బాధితులు ఆస్పత్రుల్లో సౌకర్యాలు లభించక ఇళ్లలోనే చికిత్స చేయించుకుంటున్నారు. టోక్యోలో ఇలాంటివారి సంఖ్య ఇప్పుడు 35,000కు చేరింది. తాజాగా రోజువారీ కేసులు టోక్యోలో 5000 నమోదు కాగా, దేశం మొత్తమ్మీద 25,000కు చేరింది. కరోనా ప్రారంభంలో కేసులు అతి తక్కువగా నమోదైన దేశాల్లో ఒకటైన జపాన్, ఇప్పుడు డెల్టా వేరియంట్‌తో సతమతమవడం గమనార్హం. జపాన్‌లో ఇప్పటివరకు కరోనా వల్ల 15,600మంది మృతి చెందారు. 40శాతంమందికి రెండు డోసుల టీకాలు అందించారు. వారిలో అధికభాగం వయోవృద్ధులన్నది గమనార్హం.