కొలంబో : శ్రీలంకలో విధించిన అత్యవసర పరిస్థితిని ఎత్తివేస్తూ అధ్యక్షుడు గొటబాయ రాజపక్స నిర్ణయం తీసుకున్నారు. ఈమేరకు మంగళవారం అర్థరాత్రి ప్రకటన వెలువరించారు. ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో ప్రజలు భారీగా ఆందోళనకు దిగడంతో ఏప్రిల్ 1 నుంచి శ్రీలంకలో అత్యవసర పరిస్థితి విధించారు. అయితే ఈ నిర్ణయాన్ని ఎత్తివేస్తున్నట్టు మంగళవారం అర్దరాత్రి నోటిఫికేషన్ నెం. 2274/10 ద్వారా తెలియచేశారు. ఈ అత్యవసర పరిస్థితి ఎత్తివేత నోటిఫికేషన్ జారీ కావడం ప్రభుత్వం మైనార్టీలో పడిందనడానికి సంకేతంగా భావిస్తున్నార. 220 మంది సభ్యులున్న పార్లమెంటులో 40 మంది చట్టసభ్యులు అధికార కూటమిని విడిచిపెట్టారు. అత్యవసర పరిస్థితి నిర్ణయం రెండు వారాల్లోగా పార్లమెంటు సభ్యుల ఆమోదం పొందవలసి ఉన్నా ఆమేరకు పరిస్థితి కనిపించలేదు. పార్లమెంటులో దీనిపై చర్చించాలని విపక్షం సోమవారం డిమాండ్ చేసింది.పాలక శ్రీలంక పీపుల్స్‌పార్టీ సంకీర్ణంలో రెండో పెద్ద గ్రూపు తమ 14 మంది సభ్యులు తీర్మానానికి మద్దతు ఇవ్వడం లేదని అధికారికంగా అధ్యక్షునికి తెలియచేశారు. స్వతంత్రులుగా ప్రకటించుకున్నవారు ఓటు వేయకుంటే అత్యవసర నిబంధనలు సభ్యుల ఆమోదం లోకి రావు.
ప్రజలు ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభం దృష్టా నిరసనగా ఏప్రిల్ 3 న భారీ ఎత్తున ఆందోళనకు సన్నాహాలు జరుగుతుండగా అధ్యక్షుడు గొటబాయ రాజపక్స ఏప్రిల్ 1న అత్యవసర పరిస్థితిని విధించారు. ఆ తరువాత కర్ఫూ కూడా అమలు చేశారు. అయినాసరే ప్రజాందోళనలు ఆగలేదు. పాలక వర్గం లోని సీనియర్ నేతల ఇళ్లను ఆందోళన కారులు చుట్టుముట్టారు. ఆందోళన చివరకు హింసగా మారడంతో అనేక మంది ఘర్షణల్లో గాయపడ్డారు. వాహనాలను దగ్ధం చేశారు. ఆందోళనకారులను చెల్లా చెదురు చేయడానికి పోలీసులు భాష్పవాయువును జల ఫిరంగులను ప్రయోగించారు. అధ్యక్షుని నివాస భవనానికి రక్షణగా పోలీసులు సైన్యాన్ని దించారు. ఈ సంఘటనలకు సంబంధించి అనేక మందిని పోలీసులు అరెస్టు చేశారు. కొలంబో నగరంలో చాలా ప్రాంతాల్లో కర్పూ విధించారు. విదేశీ మారక ద్రవ్య సంక్షోభంతో శ్రీలంకలో ఇంధనం, వంటగ్యాస్ వంటి నిత్యావసరాల కొరత విపరీతంగా ఏర్పడింది. రోజూ 13 గంటల పాటు విద్యుత్ సరఫరాలో కోత ఏర్పడింది. తన ప్రభుత్వ చర్యలను రాజపక్స సమర్థించుకున్నారు. కొవిడ్ కారణంగా పర్యాటకం నిల్చిపోవడం, విదేశీ మారక ద్రవ్య నిల్వలు నిండుకోవడం వల్లే ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయని పేర్కొన్నారు.