Monday, December 23, 2024

ఉద్యోగుల పెన్షన్ దేశ గౌరవం

- Advertisement -
- Advertisement -

అభివృద్ధి చెందిన వైద్యం, ఆధునిక చికిత్స సౌకర్యాలతో ప్రపంచ వ్యాప్తంగా మనుషుల ఆయు ష్షు పెరిగింది. ప్రపంచంలో 2020కి 60 ఏళ్ళవారి సంఖ్య 100 కోట్లతో 5 ఏళ్లలోపు పిల్లల సంఖ్యను దాటింది. 60 ఏళ్ళవారి సంఖ్య 2030 కి 140 కోట్లకు, 2050కి 210 కోట్లకు చేరుతుంది. 2050కి 80 ఏళ్ళు దాటిన జనాభా 42 కోట్ల 60 లక్షలకు చేరుతుంది. 2050కి 80% వృద్ధులు పేద, మధ్య ఆదాయాల దేశాలలో ఉంటారు. మన దేశంలో 1950కి వయోవృద్ధుల సంఖ్య జనాభాలో 5%. 2016లో ఈ సంఖ్య 10%. 2050కి ఇది 20.3 శాతానికి చెరబోతోందని ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. అనగా 5 మందిలో ఒకరు వయో వృద్ధులే. ధనిక దేశాల వృద్ధుల సమస్యల పరిష్కారానికి ఏర్పాట్లు ఉన్నాయి. అభివృద్ధి చెందుతున్న ఇండియా లాంటి దేశాలలో ఇప్పటికే తీవ్రంగా ఉన్న వృద్ధుల సమస్యలు, 2050 కి భరించలేని స్థితికి చేరతాయి.

నేటి ప్రభుత్వాలు ప్రజల, ప్రత్యేకించి వృద్ధుల సంక్షేమ విధానాలను ఎన్నికల లబ్ధికి పరిమితం చేశాయి. ఐక్యరాజ్యసమితి 2021-, 2030ని ఆరోగ్య వయోవృద్ధుల దశాబ్దంగా ప్రకటించింది. వృద్ధుల ఆర్థిక, ఆరోగ్య అసమానతలను తగ్గించమని, జీవనస్థాయిని పెంచమని ప్రపంచ ఆరో గ్య సంస్థను కోరింది. 31.03.2021కి మన దేశంలో కేంద్ర ప్రభుత్వ పెన్షనర్ల సంఖ్య 68,62,465. అందులో టెలికమ్యూనికేషన్ పెన్షనర్లు 4,67,751 మంది. ధరం స్వరూప్ నకారా రక్షణ శాఖలో ఆర్థిక సలహాదారు. 1972లో పదవీ విరమణ చెందిన ఆయనకు పెన్షన్ పెరుగుదల ప్రయోజనం ఇవ్వలేదు. ఆయన సుప్రీంకోర్టులో కేసు వేశారు. నేటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధనుంజయ్ చంద్రచూడ్ తండ్రి నాటి ప్రధాన న్యాయమూర్తి యశ్వంతరావు చంద్రచూడ్, పెన్షన్, బహుమతి, పారితోషికం, దయతో ఇచ్చే అదనపు ఫలితం కాదు. సుదీర్ఘకాలం దేశానికి సేవలందించిన ప్రభుత్వోద్యోగి పదవీ విరమణ కాల హక్కు.

విశ్రాంత ఉద్యోగులు శాంతియుత, గౌరవప్రద జీవితం గడిపేందుకు ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకొని తీరాలి అని తీర్పిచ్చారు. ఈ చారిత్రక తీర్పు 1982 డిసెంబర్ 17న వెలువడింది. ఈ రోజును జాతీయ పెన్షన్ దినంగా పాటిస్తున్నారు. వృద్ధాప్యం శారీరక, ఆర్థిక, సామాజిక, మానసిక పరిస్థితులలో పలు మార్పులు తెస్తుంది. వృద్ధులను వారి పిల్లలే భారంగా భావిస్తారు. మనుషులు, మానవ వనరులు దేశ సంపద. వృద్ధుల అనుభవాలను, సామర్థ్యాలను సమాజానికి ఉపయోగపడే విధంగా ప్రభుత్వాలు పథకాలు రచించాలి. వారిని ఆర్థిక స్వతంత్రులను చేయాలి. వృద్ధులు బతుకు దెరువులో భాగంగానే యౌవనాన్ని, శక్తిసామర్థ్యాలను, కాలాన్ని సమాజం కోసం, దేశ నిర్మాణం, అభివృద్ధి కోసం ఖర్చుచేస్తారు.

వారిని నేటి సామాజిక వ్యర్థపదార్థాలుగా చూడరాదు. ఆ బాధ్యత ప్రభుత్వాలదే. వారి నివాసస్థలాల వద్దే ఆరోగ్య సంరక్షణ, ప్రత్యేకించి మానసిక ఆరోగ్య నిర్వహణ సౌకర్యాలు, చికిత్స, ఆర్థిక ఆసరా అందించడం ప్రభుత్వాల ప్రధాన బాధ్యత.
బ్రిటిష్ వలసవాద ప్రభుత్వం 1857లో తన ఉద్యోగులకు పెన్షన్ ప్రవేశపెట్టింది. భారత పెన్షన్ చట్టం 1871 ద్వారా ఉద్యోగులు అందరికీ పెన్షన్ ఇచ్చింది. 1881లో పెన్షన్‌ను స్థిరీకరించింది. 1919, 1935 భారత ప్రభుత్వ చట్టాల ద్వారా పెన్షన్‌ను మెరుగుపరిచింది. ద్రవ్యోల్బణ పరిహారంగా అప్పుడప్పుడు పెన్షన్‌ను పెంచేది. 1957లో నెహ్రూ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ పెన్షన్‌ను తప్పనిసరి చేసింది. తర్వాత అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విధానాన్ని పాటించాయి. 1981లో కుటుంబ పెన్షన్ సాధించబడింది. ముందు నిర్ధారిత స్థిర పెన్షన్ పథకం అమలులో ఉండేది. దీని ప్రకారం ఉద్యోగి పొందిన చివరి జీతం ఆధారంగా అందులో సగం సొమ్మును ప్రభుత్వమే పెన్షన్‌గా చెల్లించేది. అటల్ బిహారీ వాజపేయి ప్రభుత్వం 01 జనవరి 2004 నుండి ఈ పథకం స్థానంలో భాగస్వామ్య పెన్షన్ పథకాన్ని ప్రవేశపెట్టింది.

దీని ప్రకారం ఉద్యోగి తన మూలవేతనం, అధిక ధరల భత్యంపై 10% చెల్లిస్తే అంతే మొత్తాన్ని ప్రభుత్వం జమచేస్తుంది. (ఇలా జమ అయి సొమ్మును కంపెనీలలో మదుపు చేస్తుంది.) ఈ మొత్తంలో 60% పదవీ విరమణ చెయ్యగానే, 35 శాతం సొమ్మును పెన్షన్‌గా చెల్లిస్తారు. ఈ పథకంలో ఉద్యోగి పెన్షన్‌ను కొనుక్కున్నట్లు లెక్క. ఇదిమార్కెట్ ఒడిదుడుకులపై, ప్రైవేటు మదుపుదార్లపై, సట్టా వ్యాపారంపై ఆధారపడుతుంది. పెన్షన్ తగ్గవచ్చు. లేదా సున్నా కావచ్చు. ఈ పథకంలో ఉద్యోగుల భవిష్య నిధి కూడా రద్దు చేయబడింది.ఇటీవల కొన్ని ప్రతిపక్షాల రాష్ట్ర ప్రభుత్వాలు పాత పెన్షన్ పథకానికి మారాయి. ఒక పెన్షన్ పథకంలో జమైన ఉద్యోగుల పెన్షన్ నిధి సొమ్మును మరొక పథకానికి బదిలీ చేయడానికి మోడీ సర్కార్ నిరాకరించింది.ఈ సర్కారు దేశంకోసం ప్రాణాలను ఒడ్డే సైనికులకు మోడీ వాగ్దానించిన ఒక పదవి, ఒక పెన్షన్ పథకంలో న్యాయం చేయలేదు. అగ్నిపథ్ పథకంతో తాత్కాలిక సైన్యాన్ని సృష్టించి సైన్యానికి పెన్షన్‌నే ఎత్తేసింది. మోడీ ప్రభుత్వం 7 ఏళ్ల నుండి బిఎస్‌ఎన్‌ఎల్‌లో పెన్షన్ ను సవరించలేదు.

4వ కేంద్ర వేతన సవరణ సంఘం 1986కు ముందు ఆ తర్వాత రిటైరైన పెన్షనర్లకు పెన్షన్ సవరించాలని సిఫారసు చేసింది. 40% పెంపుతో పెన్షన్‌ను సవరించాలని నాటి కేంద్ర ప్రభుత్వం 5 వ కేంద్ర వేతన సవరణ సంఘాన్ని ఆదేశించింది. 6 వ కేంద్ర వేతన సవరణ సంఘం పెన్షనర్ల వృద్ధాప్యం, వారి ఆరోగ్య సమస్యలను దృష్టిలో ఉంచుకొని పెరిగే ఆర్థిక భారాలకు అనుగుణంగా 80 ఏళ్ళు నిండిన పెన్షనర్లకు, కుటుంబ పెన్షనర్లకు 20% అదనపు పెన్షన్, 85 ఏళ్ళకు 30%, 90 ఏళ్ళకు 40%, 95 సంవత్సరాలకు 50%, 100 ఏళ్లు నిండిన వారికి 100 శాతం పెన్షన్ సిఫారసు చేసింది. టెలికమ్యూనికేషన్ శాఖ ఉద్యోగులు 01 అక్టోబర్ 2000న ప్రభుత్వరంగ సంస్థ బిఎస్‌ఎన్‌ఎల్‌లో చేరిన తర్వాత, కేంద్ర కరువు భత్యం స్కేల్సుకు బదులుగా పారిశ్రామిక కరువు భత్యం స్కేల్సుపై పెన్షన్ పొందుతున్నారు.

7వ కేంద్ర వేతన సవరణ సంఘం సిఫారసుల ఆధారంగా కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు 01 జనవరి 2016 నుండి 2.57% ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌తో పెన్షన్‌ను సవరించారు. బిఎస్‌ఎన్‌ఎల్ పెన్షనర్లకు ఇంత వరకు పెన్షన్ సవరించలేదు. కీ.శే. ప్రఖ్యాత నటులు జయప్రకాశ్ రెడ్డి కొత్త సేన అనే నాటకాన్ని ప్రదర్సించేవారు. ఇందులో వృద్ధులు తమ జీవిత ప్రజ్ఞాపాటవాలను, అనుభవాలను వృద్ధాప్యంలో ఉపయోగిస్తూ, నిర్విరామ జీవితం గడుపుతూ సమాజంలో క్రియాశీలక పాత్ర పోషించాలని సూచించారు. విశ్రాంత సైన్యాధికారులు హర్ష కక్కర్, ఎల్. రామదాసులు విశ్రాంత ఉద్యోగులే ఉద్యమించి తమ హక్కులను సాధించుకోవాలని సేవలలో ఉన్న శ్రామికులకు మార్గదర్శకం కావాలన్నారు. కార్మిక సంఘాలు వయోవృద్ధుల ,పెన్షనర్ల శ్రేయస్సుకూ పనిచేయాలి. పెన్షనర్ల సంఘాలు ప్రత్యేకించి ఆల్ ఇండియా బిఎస్‌ఎన్‌ఎల్ పెన్షనర్ల సంక్షేమ సంఘం సరయిన దిశలో కృషిచేస్తోంది.

సంగిరెడ్డి
హనుమంత రెడ్డి
9490204545

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News