అభివృద్ధిలో భాగస్వాములు కావాలి
ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్ సూచన
మనతెలంగాణ/హైదరాబాద్: ఉద్యోగులు రాష్ట్ర అభివృద్ధికి పాటుపడి, అభివృద్ధిలో భాగస్వాములు కావాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్ అన్నారు. 122 సచివాలయ ఉద్యోగులకు పదోన్నతులు కల్పించినందుకు సిఎస్ సోమేష్‌కుమార్‌కు సచివాలయ ఉద్యోగుల సంఘం కృతజ్ఞతలు తెలిపింది. గురువారం సచివాలయంలోని ఆయన కార్యాలయంలో సోమేష్‌కుమార్ ఉద్యోగులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సోమేశ్ కుమార్ మాట్లాడుతూ ఉద్యోగులు సమర్థంగా, పారదర్శకంగా సేవలు అందించాలని ఆయన సూచించారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఆశయాలకను గుణంగా పనిచేసి రాష్ట్ర అభివృద్ధికి తోడ్పాటునందించాలని ఉద్యోగులను ఆయన కోరారు.
ఉద్యోగులకు సాధారణ పరిపాలనా శాఖ ద్వారా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని సిఎస్ సూచించారు. పేద ప్రజలకు సాయం చేయడానికి పారదర్శకంగా సేవలను మరింత సమర్థవంతంగా అందించాలని ఉద్యోగులకు ఆయన విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రభుత్వం అన్ని విభాగాల ఉద్యోగులకు ప్రత్యేక డ్రైవ్ ద్వారా పదోన్నతులు కల్పించిందని, ప్యానల్ సంవత్సరంతో సంబంధం లేకుండా ప్రమోషన్లను ఇవ్వడానికి 3 సంవత్సరాల నుంచి 2 సంవత్సరాలకు సర్వీస్ వ్యవధిని తగ్గిస్తూ జిఓ జారీ చేసిందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తెలిపారు.
ఉద్యోగుల కోసం ముఖ్యమంత్రి 30 శాతం పిఆర్‌సి ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. ఉద్యోగులకు డ్రాఫ్టింగ్, నోట్స్, కంప్యూటర్ స్కిల్స్ పై శిక్షణను ఏర్పాటు చేయడం ద్వారా మానవ వనరులను అభివృద్ధి చేయాలని జిఏడికి ఆయన సూచించారు. తెలంగాణ సెక్రటేరియట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నరేందర్ రావు, ప్రమోషన్లు ఇచ్చినం దుకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు, ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్‌లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వికాస్ రాజ్, జిఏడి ముఖ్యకార్యదర్శి, ఉద్యోగులు పాల్గొన్నారు.