ముఖ్యమంత్రికి ఆర్.కృష్ణయ్య లేఖ
మన తెలంగాణ / హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవి విరమణ వయస్సును 61 సంవత్సరాల నుండి 63 లేదా 65 సంవత్సరాలకు పెంచాలని ప్రభుత్వం ప్రతిపాదించినట్లు తెలుస్తోందని, ఆ ప్రతిపాదనను వెంటనే విరమించుకోవాలని జాతీయ బిసి సంక్షేమ సంఘం అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన బుధవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. రాష్ట్రంలో ఉద్యోగాలు లేక 16 లక్షల మంది నిరుద్యోగులు రోడ్ల మీద తిరుగుతున్నారని, ఇంకా విరమణ వయసు పెంచితే నిరుద్యోగులకు తీరని అన్యాయం జరుగుతుందని ఆయనన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి నిరుద్యోగులు రాత్రింబవళ్లు ఇల్లిల్లూ తిరిగి ప్రచారం చేశారని, ఇప్పుడు వారికి ఉద్యోగాలు రాకుండా చేయడం ద్రోహమే అవుతుందని అన్నారు. పదవి విరమణ వయసు పెంచితే 40 వేల మంది నిరుద్యోగులు ఉద్యోగ అవకాశాలు కోల్పోతారన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తారని హామీ ఇచ్చారని, కాని ఇంతవరకు ఆ హామీ పూర్తిగా కాకుండా ఇంకా ఉద్యోగ అవకాశాలు తగ్గించడం న్యాయం కాదన్నారు. ఉద్యోగుల పదవి విరమణ వయసు పంచితే రాష్ట్ర ప్రభుత్వానికి ఇంకా హార్దిక భారం పడుతుందన్నారు., సీనియర్ ఉద్యోగుల జీతం ఒక లక్ష నుండి మూడు లక్షల వరకు ఉందని, రిటైర్ అయిన వారి స్థానాలు భర్తీ చేస్తే కొత్తవారికి 40 నుంచి 60 వేల వరకు జీతాలు ఉంటాయని, రిటైర్ అయ్యే 40 వేల మందికి ఇచ్చే జీతంతో లక్షా యాభై వేల మందికి ఉద్యోగాలివ్వొచ్చని కృష్ణయ్య అన్నారు.