జీఓ 129ను రద్దు చేయాలి
ఇప్పటికే ఆప్షన్లు ఇచ్చిన 6 వేల పైచిలుకు పూర్వపు విఆర్‌ఏ, విఆర్‌ఓలు
ఆ నాయకుడి తీరుతో ఇబ్బంది పడుతున్న రెవెన్యూ ఉద్యోగులు
ఈ నియామకాలు వివాదాస్పదం కాకుండా
పబ్లిక్ సర్వీసు కమిషన్ ద్వారా జిపిఓల రిక్రూట్‌మెంట్
చేయాలని యోచిస్తోన్న ప్రభుత్వం ?
పబ్లిక్ సర్వీసు కమిషన్ ద్వారా నోటిఫికేషన్ ఇస్తే
నిరుద్యోగులకు అవకాశం
మనతెలంగాణ/హైదరాబాద్: జిపిఓ (గ్రామ పరిపాలన అధికారి)ల రిక్రూట్‌మెంట్‌ను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నియమించే అవకాశం ఉన్నట్టుగా తెలిసింది. గతంలో విఆర్‌ఏ, విఆర్‌ఓలుగా పనిచేసిన వారికి జిపిఓలుగా అవకాశం ఇవ్వాలని ప్రభుత్వం భావించింది. ఈ నేపథ్యంలోనే వారి నుంచి ఆప్షన్‌లను సైతం స్వీకరించింది. సుమారుగా 6 వేల పైచిలుకు పూర్వపు విఆర్‌ఏ, విఆర్‌ఓలు సైతం ఆప్షన్‌లు ఇచ్చారు. అయితే ప్రస్తుతం కొందరు రెవెన్యూ ఉద్యోగ సంఘాల నాయకులు జిపిఓల రిక్రూట్‌మెంట్‌కు సంబంధించి కోర్టు మెట్లు ఎక్కడంతో అది ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఈ విషయమై పునరాలోచనలో పడ్డట్టుగా తెలిసింది.
గత ప్రభుత్వం విఆర్‌ఏ, విఆర్‌ఓ వ్యవస్థలను రద్దు చేసి ఇతర శాఖల్లో విలీనం చేసింది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల తీసుకువచ్చిన ‘భూభారతి చట్టం-2025’ అమల్లో భాగంగా గ్రామీణ రెవెన్యూ వ్యవస్థను పునర్మించాలని భావించింది. ఈ క్రమంలోనే రాష్ట్రంలో ఉన్న ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒకరు చొప్పున మొత్తం 10,954 మంది జీపిఓ (గ్రామ పరిపాలన అధికారి)లను నియమించాలని ఇప్పటికే నిర్ణయించింది. అందులో భాగంగా సిసిఎల్‌ఏ కమిషనర్ నవీన్ మిట్టల్, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా భూ భారతి చట్టం-2025 ప్రారంభోత్సవంలో జిపిఓలను నియమిస్తామని అధికారికంగా ప్రకటించారు.
జిఓ 129ను రద్దు చేయాలని కోర్టుకు
అయితే ప్రభుత్వ ప్రకటనకు విరుద్ధంగా కొందరు రెవెన్యూ సంఘం నాయకులు కోర్టులో కేసులు వేస్తుండడంతో మళ్లీ పూర్వపు విఆర్‌ఓ, విఆర్‌ఏల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారిందని రెవెన్యూ ఉద్యోగులు పేర్కొంటున్నారు. దీంతోపాటు జీఓ -129 ప్రకారం జీపిఓలుగా పూర్వపు విఆర్‌ఓ, విఆర్‌ఏలను ఆప్షన్ల ద్వారా తీసుకుంటామని ప్రభుత్వం ప్రకటించిన మరుసటి రోజే ఆ జీఓను రద్దు చేయాలని కోరుతూ రెవెన్యూ సంఘంలో కీలకంగా వ్యవహారించే రెవెన్యూ సంఘం నాయకులు రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానంలో జీఓ129ను సవాల్ చేస్తూ కేసు వేశారని వారు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకున్నట్లు రెవెన్యూ శాఖలో జోరుగా చర్చ జరుగుతుంది.
జీఓ-129ని స్వాగతించిన మెజార్టీ పూర్వపు విఆర్‌ఓ, విఆర్‌ఏలు
గత ప్రభుత్వంలో రెవెన్యూ ఉద్యోగులను అవినీతి పరులుగా ముద్రవేసి ఇతర శాఖల్లో విఆర్‌ఓ, విఆర్‌ఏలను విలీనం చేయడం అప్రజాస్వామికమని భావించిన సిఎం రేవంత్ రెడ్డి అర్హత, ఆసక్తి ఉన్న పూర్వపు విఆర్‌ఓ, విఆర్‌ఏలను తిరిగి వారి మాతృ శాఖ అయిన రెవెన్యూ శాఖలోకి జిపిఓలుగా తీసుకోవాలని నిర్ణయించారు. కానీ, ప్రభుత్వ నిర్ణయానికి అడ్డుతగులుతూ కొందరు రెవెన్యూ సంఘం నాయకులు ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసేలా జీఓ129ను సవాల్ చేస్తూ హైకోర్టులో కేసు ఫైల్ చేయడంపై రెవెన్యూ అధికారులు, రెవెన్యూ శాఖ ఉద్యోగ సంఘాల నాయకులు అసంతృప్తి వ్యక్తం చేసినట్టుగా తెలిసింది.
ఇలా అయితే పూర్వపు విఆర్‌ఓ, విఆర్‌ఏలకు న్యాయం జరగదని వారు వాపోతున్నారు. ప్రభుత్వం జారీ చేసిన జీఓ-129కు మెజార్టీ పూర్వపు విఆర్‌ఓ, విఆర్‌ఏలు అభినందిస్తూ జీపిఓలుగా వచ్చేందుకు ఆప్షన్లు కూడా ఇచ్చారు. అంతలోనే హైకోర్టులో కేసు వేయడంతో ఆ సంఘం నాయకుల తీరుపై పూర్వపు విఆర్‌ఓ, విఆర్‌ఏలు మండి పడుతున్నారు.
ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీస్తున్న వ్యక్తుల పట్ల కఠినంగా
ఈ నేపథ్యంలోనే ఈ నియామకం ముందుకు వెళ్లాలంటే పూర్వపు విఆర్‌ఓ, విఆర్‌ఏలకు ఇబ్బంది కలగకుండా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా జిపిఓల నియామకాన్ని భర్తీ చేస్తే నిరుద్యోగులకు అవకాశం రావడంతో పాటు దీనివల్ల ప్రభుత్వానికి పేరు వస్తుందని ప్రభుత్వం భావిస్తున్నట్టుగా తెలిసింది. ఈ నేపథ్యంలోనే కేసుల ద్వారా ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీస్తున్న వ్యక్తుల పట్ల కఠినంగా ఉండాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లుగా తెలిసింది.
ఇందులో భాగంగానే జీపిఓ పోస్టుల భర్తీగా తెలంగాణ పబ్లిక్ కమిషన్ ద్వారా నోటిఫికేషన్ జారీ చేసి నిరుద్యోగులకు అవకాశం కల్పించాలని, దీంతో కొత్త అభ్యర్థులతో ప్రజలకు కూడా మెరుగైన, పారదర్శకమైన సేవలు అందించే అవకాశం ఉంటుందని ప్రభుత్వం భావిస్తున్నట్లుగా తెలిసింది. దీంతోపాటు విఆర్‌ఓ, విఆర్‌ఏలను జీపిఓలుగా తీసుకుంటే ప్రభుత్వం పై అదనపు భారం పడుతుందని, కొత్త అభ్యర్థులను నియామకం చేస్తే ప్రభుత్వంపై వేతనాల భారం మూడింతలు తగ్గే అవకాశం ఉంటుందని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టుగా సమాచారం.