Monday, January 20, 2025

ముమ్మరంగా ‘ఉపాధి’ వార్షిక ప్రణాళికలు

- Advertisement -
- Advertisement -

* నవంబరు 30 వరకు గ్రామసభలు
* ఉపాధి హామీలో 262 రకాల పనులకు ప్రాధాన్యత
* కూలీల బడ్జెట్‌కు తయారుకానున్న అంచనాలు
* జనవరి 21న జిల్లా స్థాయి వార్షిక ప్రణాళిక ఆమోదం
* జనవరి 31న రాష్ట్రస్థాయిలో ఆమోదం
* మార్చి 31న ఉపాధి కూలీల బడ్జెట్ విడుదల

'Employment' annual plans

మనతెలంగాణ/ హైదరాబాద్ : మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా కూలీలందరికి పని కల్పించడానికి వార్షిక ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. 2023—24 ఏడాదికి సంబంధించిన పనులు, కూలీల బడ్జెట్ తయారు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్ ఎం. హనుమంతరావు మార్గదర్శకాలను జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని పంచాయతీల్లో గ్రామ సభల్లో నవంబరు 30 వరకు వీటిని పూర్తి చేయనున్నారు. ఉపాధి హామీలో భాగంగా జాబ్ కార్డ్ కలిగిన కూలీ కుటుంబానికి వంద రోజుల పనులు కల్పించుట, గ్రామంలో ఎంతమంది జాబ్ కార్డ్ కలిగిన కుటుంబాలకు ఎంత బడ్జెట్ అవసరం ఉన్నది.. గ్రామసభలో ప్రజల సమక్షంలో పనులను గుర్తించడం… ఆ పనులకు సంబంధిత అంచనాలు రూపొందించనున్నారు. ఒక్కో పంచాయతీలో 20కి మించకుండా పనులు గుర్తించడం. వాటిని వెంటనే పూర్తి చేయడంపై అధికారులు కార్యాచరణ రూపొందిస్తున్నారు. గ్రామసభలు ఏర్పాటు చేసి అందరి ఆమోదంతో పనులు గుర్తించనున్నారు. ఈ సభలకు అధికారులు, కూలీలు, ప్రజలు, ప్రజాప్రతినిధులు హాజరవుతారు. గ్రామస్థాయిలో పూర్తయిన ప్రణాళికలను మొదట మండల పరిషత్‌కు.. తర్వాత జిల్లాకు పంపించనున్నారు. వచ్చే ఏడాది మార్చి 31 వరకు ఈ ఏడాదికి సంబంధించిన పనులు కొనసాగుతాయి. ఏప్రిల్ 1 నుంచి కొత్తగా గ్రామసభలో గుర్తించినవి ప్రారంభిస్తారు.

వార్షిక ప్రణాళిక తయారీ ఇలా..

జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకంలో భాగంగా కూలీలందరికి పని కల్పించడానికి గ్రామసభలలను అక్టోబరు 2 నుంచి నవంబరు 30 వరకు నిర్వహిస్తారు. గ్రామసభలో గుర్తించిన పనులను నమోదు చేసి.. ఆ వివరాలను మండల పరిషత్‌కు అందజేయనున్నారు. ఆ గణంకాల ఆధారంగా జిల్లా స్థాయి వార్షిక ప్రణాళికను 2023 జనవరి 21న ఆమోదించనున్నారు. అన్ని జిల్లా వివరాలతో రూపొందించిన అంచనాల బడ్జెట్‌ను జనవరి 31న రాష్ట్రస్థాయిలో ఆమోదం చెప్పనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా గ్రామాల నుంచి ఉపాధిహామీలో చేపట్టే పనుల్లో కూలీల బడ్జెట్ అంచనాలను మార్చి 31న విడుదల చేయనున్నారు.

సామాజిక తనిఖీలతో మార్పులకు శ్రీకారం..

గతంలో ఇష్టానుసారంగా పనుల గుర్తింపు ఉండేది. కూలీలు, ప్రజల భాగస్వామ్యం లేకుండా ప్రజాప్రతినిధుల అభీష్టం మేరకు చేపట్టి ప్రజాధనం వృధా అయ్యేది. ఈ విషయాలు సామాజిక తనిఖీల్లో వెలుగుచూశాయి. దీంతో నాలుగేళ్లుగా పనులు గుర్తింపునకు గ్రామసభలను ప్రభుత్వం నిర్వహిస్తోంది. మెజార్టీ కూలీలు, ప్రజల అభిప్రాయం మేరకు సదరు గ్రామానికి అత్యంత అవసరమైన పనులు ఎంపిక చేసుకుంటున్నారు. ఈసారి పంచాయతీ గుర్తించిన మొదటి 20 పూర్తయ్యాకే మిగతా 20 పనులు ప్రారంభిస్తారు. ఉపాధి హామీ ద్వారా 2023– 24 వార్షిక ఏడాదికి 17 విభాగాల్లో 573 రకాల పనులు చేపట్టడానికి అవకాశం ఉంది. వీటిలో 262 పనులకు ప్రాధాన్యత ఇస్తున్నారు. కొన్ని పంచాయతీల్లో ఈనెల 2వ తేదీ నుంచి గ్రామసభలు మొదలయ్యాయి. వ్యవసాయ పనులున్న రోజుల్లో కూలీల హాజరు పలుచగా ఉంటుంది. అందుకే వ్యవసాయ సీజన్ లేనప్పుడే అత్యధిక శాతం మంది కూలీలకు పనులు కల్పించే విధంగా ప్రణాళికలు రూపొందించనున్నారు. భూగర్భజలాల పెంపునకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉంది.. చెరువులు, కాలువలు, కుంటల్లో పూడికతీత, కాలువల్లో పిచ్చిమొక్కలు, పొదలు తొలగించడం, నీటి కుంటల నిర్మాణం, కాంటూరు కందకాలు, సమతల కందకాలు తవ్వకం, అంతర్గత మట్టి రోడ్లు వేయడం. మొక్కలు, పండ్ల తోటల పెంపకం వంటి పనులు ప్రజోపయోగ గుర్తిస్తే మేలు జరుగుతుంది.

ప్రజల అవసరం మేరకే గుర్తింపు : రమాదేవి, ఎపిఓ, నర్మెట్ట

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిబంధనల ప్రకారమే కూలీల బడ్జెట్ రూపకల్పన చేస్తున్నాం. ప్రజలకు ఆమోదయోగ్యమైన పనులకు మొదటి ప్రాధాన్యం ఇస్తాం. గ్రామ ప్రజలందరి భాగస్వామ్యంతో పనులను గుర్తించి, జిఐఎస్ సాంకేతికతనుఉపయోగించి పనులను పూర్తి చేయనున్నాం. జాబ్ కార్డు కలిగిన కూలీల కుటుంబాలకు వంద రోజుల పనిదినాలు కల్పించేలా పనులను చేపడుతాం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News