దాదాపు అన్ని దేశాలలోని ప్రజలు వంద సంవత్సరాలలో ప్రపంచం మొత్తం ఎప్పుడూ చవిచూడని పెను సంక్షోభంలో చిక్కి విలవిల లాడుతున్నారు. ప్రపంచంలో రెండో అతిపెద్ద దేశమైన భారత్ కూడా ఈ ప్రమాదంలో చిక్కుకున్నా జాగ్రత్తగా సహాయ చర్యలు చేపడుతూ ఉంది. మొదటి దశలో భారత్ లో పట్టణాలకే పరిమితమైన కోవిడ్ వ్యాధి ఉద్ధృతి ఇప్పుడు గ్రామాలపై విరుచుకుపడుతుంది. ప్రతి గ్రామం దాదాపు 30 పడకల ఐసొలేషన్ సెంటర్ ఏర్పాటు చేసుకోవాలని ఆరోగ్య సిబ్బందికి ప్రధాని మోడీ సూచించడం ప్రమాదం ముప్పును తెలియజేస్తున్నది. ఈ మహా సంక్షోభంలో ప్రజల ప్రాణాలతో పాటు వారి జీవనోపాధులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. ఉద్యోగ ఉపాధి అవకాశాలను కోవిడ్ కన్నెర్ర చేయడంతో వలసకూలీలతో పాటు నిరుపేదల జీవన హక్కు ప్రశ్నార్థకంగా మారింది. కానీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామీణ ప్రజలకు నిత్యం ఉపాధి అవకాశాలు కల్పిస్తూ, వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపుతూ, వారికి ఆసరాగా నిలబడుతూ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వారి వెన్నంటి ఉంటున్నాయి. ఈ సంక్షోభ సమయంలో ఉపాధి హామీ పథకం గ్రామీణ నిరుపేదల పాలిట కల్పతరువులా మారింది.
భారతదేశంలో 70 శాతం ప్రజలు గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయాధారిత జీవనం కొనసాగిస్తున్నారు స్వాతంత్య్రానంతరం గ్రామీణ ప్రజల జీవనోపాధి గూర్చి ఎన్నో వినూత్న పథకాలను అమలు చేశారు. కానీ 2005 ఆగస్టు 23న భారత పార్లమెంట్ చే ఆమోదింప చేయబడిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం ఒక ప్రత్యేకమైన పథకం. చట్టం అమల్లోకి వచ్చాక మొదటగా 200 జిల్లాల్లో అమలు చేయబడినా, ఆపైన నూరు శాతం పట్టణ జనాభా ఉన్న ప్రాంతాలను మినహాయించి మిగతా ప్రాంతాన్ని ఈ పథకం పరిధిలోకి తీసుకొచ్చారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో నైపుణ్యం లేని కార్మికులకు పని లేని సమయాలలో అదనపు ఉపాధి కోసం పని కల్పించడం చట్టబద్ధమైన హక్కుగా ఈ చట్టం ద్వారా గుర్తించారు.
స్వాతంత్య్ర భారతదేశ చరిత్రలో ఇంతకు ముందెన్నడూ యెరుగనంత పెద్ద సంఖ్యలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఈ పథకం ద్వారా సృష్టించగలిగారు. ఉద్యోగ కల్పనా విధానంలో, ఉద్యోగ అవకాశాలను కల్పించడంలో మిగతా వేతన ఉపాధి పథకాలతో పోలిస్తే ఇది చాలా విభిన్నమైనది. గ్రామీణ ప్రజల అవసరాల కోసం ముఖ్యంగా రైతుల అభివృద్ధి ధ్యేయంగా, గ్రామీణ బీద, పేద, హరిజన, గిరిజన, వికలాంగ, మహిళల హక్కులను కాపాడుతూ, గ్రామీణ ప్రజల హక్కులను నెరవేర్చుతూ, గ్రామసభ ఆధారంగా చేయాల్సిన పనులను చర్చించి, ఆమోదించి అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లడం దీనిలో వున్న మరో ముఖ్యమైన ప్రత్యేకత.
పార్లమెంటు ఆమోదంతో ఏర్పడి చట్టంగా మారిన ఈ పథకంలో దాదాపు ఐదు లక్షలు దాగివున్నాయి. మొదటిది, గ్రామీణ ప్రాంతాలలో ఉన్న కుటుంబాలకు ప్రతి ఆర్థిక సంవత్సరంలో నూరు రోజులకు సరిపడా నైపుణ్యం అవసరం లేని శారీరక కష్టంతో కూడిన పనిని అందించడం. దీని ద్వారా గ్రామీణ ప్రాంతాల ప్రజల అవసరాలకు అనుగుణంగా తగిన నాణ్యత, మన్నిక కలిగిన ఆస్తులను సృష్టించడం. రెండవది, పేద ప్రజలకు జీవనోపాధి పొందే అవకాశాలను బలోపేతం చేయడం, మూడవది, సమాజంలోని అన్ని వర్గాల వారిని గ్రామీణ అభివృద్ధి కార్యక్రమాలలో భాగస్వాములను చేయడం. నాలుగవది పరిపాలనలో బాధ్యత, పారదర్శకత, జవాబుదారీతనం పెంపొందించడం. ఐదవది పంచాయతీరాజ్ సంస్థలను బలోపేతం చేయడం. ఈ లక్ష్యాలకు అనుగుణంగా దాదాపు 155 రకాల పనులను ఆమోదింప చేయబడి అమలు చేస్తున్నారు.
వాటిలో ముఖ్యమైనవి సహజ వనరుల నిర్వహణలో భాగంగా నీటి సంరక్షణ పనులు, ఇంకుడు గుంతలు తవ్వకం, మొక్కల పెంపకం మొదలైనవి. బడుగు, బలహీన వర్గాలకు ప్రత్యేకించిన ఆస్తుల అభివృద్ధి, బీడు, బంజరు భూముల అభివృద్ధి. జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్‌కు సంబంధించిన సాధారణ మౌలిక వసతుల కల్పన, గ్రామ స్థాయిలో సమావేశాల కోసం, మహిళా స్వయం సహాయక బృందాల కోసం, ఆహార ధాన్యాల నిల్వ కోసం అవసరమైన భవనాల నిర్మాణం చేపట్టి గ్రామీణ మౌలిక వసతులకు సంబంధించిన పనులను త్వరితంగా చేపట్టి గ్రామీణ ప్రజలకు సుపరిపాలన అందించడం ముఖ్య ఉద్దేశంగా ఈ పథకం లో దాగిఉన్న అంశాలు తెలియజేస్తున్నాయి. ఈ పథకం మరో విశిష్టత ఏమిటంటే వంద రోజుల పని కల్పిస్తూ వేతన చట్టం ద్వారా వేతనాలు చెల్లించబడతాయి.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పల్లెలను, పట్టణాలతో సమానంగా అభివృద్ధి లోకి తీసుకెళ్లాలనే బృహత్ సంకల్పం తో ‘పల్లె ప్రగతి కార్యక్రమం’ నిర్వహిస్తున్నారు. పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకం ద్వారా ప్రతి ఇంటికి బాత్ రూమ్‌లు ఉండేలా చూస్తూ, ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టి, గ్రామ ప్రజల ఇండ్లలోని చెత్తను డంపింగ్ యార్డుకు చేర్చి తడి, పొడి చెత్తను వేరు చేసే కంపోస్ట్ షెడ్డు నిర్మాణాన్ని చేపడుతూ, ప్రతి గ్రామంలో వైకుంఠధామం నిర్మాణాలు చేపడుతూ ఉపాధిహామీ నిధుల ద్వారా వేగవంతంగా వీటి నిర్మాణాలు పూర్తి చేస్తున్నారు. తరిగిపోతున్న ప్రకృతి సంపదను కాపాడాలనే సంకల్పంతో, పెరిగిపోతున్న కాలుష్యాన్ని అరికట్టాలనే ఆరాటంతో, పల్లెలను ప్రకృతి దేవాలయాలుగా మార్చాలనే మంచి మనసుతో చెట్లను నాటించాలని ప్రతి గ్రామంలో నర్సరీలను ఏర్పాటు చేస్తూ గ్రామీణ జనాభాకు అనుగుణంగా ‘హరితహారం’ పథకంలో భాగంగా మొక్కలు పెంచుతూ సంరక్షిస్తున్నారు.
వీటికి సంబంధించిన పనులను మొత్తం ఉపాధి హామీ నిధులు ద్వారానే మంజూరు చేయబడుతున్నాయి. ఈ మధ్యనే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన దీన్‌దయాల్ ఉపాధ్యాయ పంచాయతీ స్వశక్తి కరణ పురస్కారాలలో మన తెలంగాణ రాష్ట్రానికి 12 అవార్డు దక్కడం అందరికీ గర్వకారణం. ముఖ్యంగా పంచాయతీరాజ్ శాఖలో పని చేసే పంచాయతీ కార్యదర్శుల కృషి అనిర్వచనీయమైనది, అమోఘమైనది, నిరుపమానమైనది. గతంలోని ఫీల్ అసిస్టెంట్లను ప్రభుత్వం తీసి వేసి తర్వాత పంచాయతీ కార్యదర్శులకు ఉపాధి హామీ బాధ్యతలను అదనంగా ఇచ్చారు. ఎన్నో రకాల మానసిక ఒత్తిడులు ఉన్నా, ఇంకెన్నో బాధలు వెంటాడుతున్నా ఒక ఉద్యమంలా పని చేయడం వల్లనే రాష్ట్రం ఈ అవార్డులను దక్కించుకుంది. వీరి పనికి వచ్చిన ప్రభుత్వం ఈ మధ్య రూ. 15 వేల ఉన్నటువంటి వీరి నెలసరి జీతాన్ని రూ. 32 వేలకు పెంచడం వీరిలో నూతన ఉత్తేజాన్ని కలిగిస్తుంది. గత ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో 387.66 కోట్ల మాన్ డేస్ ద్వారా ఉపాధి కల్పించబడింది.
11.5 కోట్ల మందికిపైగా గ్రామీణ పేద ప్రజలకు ఉపాధి లభించింది. కరోనా సంక్షోభంతో లాక్‌డౌన్ విధించిన కారణంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కోల్పోయి గ్రామీణ ప్రాంతాలకు తిరిగి వచ్చిన వలస కార్మికులకు ఉపాధి నిధులను పెంచి ‘గరీబ్ కళ్యాణ్ యోజన’ అనే పథకాన్ని సృష్టించి, అర్హులైన ప్రతి ఒక్కరికి, పేద వారికి ముఖ్యంగా వలస కార్మికులకు 50.88 కోట్ల ఉపాధిని అందించింది. కరోనా సంక్షోభంలో గ్రామీణులకు, వలస కార్మికులకు జీవన ఉపాధి కల్పించి ఆదుకుంది ఈ మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకం.
ఈ పథకం అమలులో మొదట్లో అవినీతి పెరిగిన కారణంగా సోషల్ ఆడిట్ ద్వారా అవినీతిని అరికట్టారు. కాని ఈ పథకం అమలులో ఇప్పటికీ కొన్ని సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి. ముఖ్యంగా కేంద్రం నుండి వచ్చే నిధులు ఆలస్యంగా రావడం వలన అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉపాధి నిధులను కొన్ని రాష్ట్రాలు అసలే వాడుకోకపోవడం, ఇంకొన్ని రాష్ట్రాలు అదనపు నిధులను అడగడం కేంద్రానికి తలనొప్పిగా మారింది. వేతనాల చెల్లింపులో లింగ అసమానతలు ఎక్కువ గా వుండడం, నాణ్యమైన పనులు చేయలేకపోవడం, నిరుద్యోగ భృతి ని అమలు చేయకపోవడం, శిక్షణ ఉన్న మానవ వనరులను పరిపాలనలో వినియోగించకపోవడం వలన అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. గ్రామ సభల ఆధారంగా సోషల్ ఆడిట్‌ను సరిగా నిర్వహించకపోవడం వలన ఈ పథకానికి తూట్లు పడుతున్నాయి.
కానీ కల్పతరువులాంటి ఈ పథకానికి ఇంకా ఎక్కువ నిధులను కేటాయించాల్సిన అవసరం ఉంది. అలాగే ఉపాధి చట్టం -2005 లోని అన్ని అంశాలను పకడ్బందీగా అమలు పరచాలి. గ్రామీణ అభివృద్ధి కార్యక్రమాలలో భాగంగా నాణ్యమైనటువంటి ఆస్తులను సృష్టించే పనులను చేస్తూ పారదర్శకతను పాటించాలి. ఉపాధి హామీ నిధులను గ్రామీణ ప్రాంతాలలో జరిగే ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు కూడా డైవర్ట్ చేయాలి. పరిపాలనాపరమైన ఇబ్బందులను ఎదుర్కోవలసిన మానవ వనరులకు తగిన శిక్షణ కార్యక్రమాలను నిర్వహించాలి. గ్రామ సభలను బలోపేతం చేస్తూ టెక్నాలజీ వాడకాన్ని త్వరితగతంగా ఉపయోగించాలి. గ్రామీణ రైతాంగ చిరకాల కోరిక అయినా వ్యవసాయాన్ని ఈ పథకంతో అనుసంధానం చేస్తే రైతుల ఆశలను సజీవంగా నెరవేర్చినవారం అవుతాము.