Monday, December 23, 2024

మరో చరిత్ర

- Advertisement -
- Advertisement -

సంపాదకీయం: తెలంగాణ యువత కలలు, ఆశలు ఫలించడం ప్రారంభమైన రోజు. విద్యావంతులైన యువతీ, యువకులను ప్రయోజకులను చేసే ప్రభుత్వోద్యోగాల నియామక లక్షాన్ని భారీ ఎత్తున నెరవేర్చేవైపు పడిన చరిత్రాత్మకమైన ముందడుగు. ప్రభుత్వోద్యోగాల మధుర ఫలాలను నిరుద్యోగులకు అందజేయడానికి అవసరమైన మౌలిక ప్రకటన వెలువడిన అసాధారణమైన ఘట్టం. మంగళవారం నాడు వనపర్తి బహిరంగ సభలో హామీ ఇచ్చి కొన్ని గంటల పాటు యువతలో ఉత్కంఠ కలిగించిన ముఖ్యమంత్రి కెసిఆర్ బుధవారం నాడు శాసన సభా ముఖంగా చేసిన ఈ ప్రకటన పట్ల రాష్ట్ర ప్రజల్లో పెల్లుబికిన హర్షాతిరేకాన్ని కొలవడానికి పరికరాలు కరవనడం అతిశయోక్తి కాబోదు. తమ బిడ్డల ఉజ్వల భవిత కోసం ఎందరో తలిదండ్రుల ఎదురు చూపులు వాస్తవ రూపం ధరిస్తున్నాయి. నీళ్లు, నిధులు, నియామకాల కోసం సాగిన మహోజ్వల తెలంగాణ ఉద్యమానికి సారథ్యం వహించిన కెసిఆర్ అధికారం చేపట్టిన తర్వాత ఇరిగేషన్ రంగంలో అసమాన, అపూర్వ విజయాలు సాధించారు. గోదావరి నదికి ముకుతాడు బిగించి కాళేశ్వర మహా సాగరాన్ని నిర్మించి, పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసి పైరు పంటల దాహాన్ని తీర్చిన జలయాజి ఆయన. అదే సమయంలో ఉద్యమంలో తన అడుగులంటి నడిచిన యువత చిరకాల స్వప్నమైన ప్రభుత్వోద్యోగాల భర్తీకి మొదటి నుంచే ఆయన ప్రాధాన్యమిచ్చారు.

ఒకవైపు ప్రైవేటు రంగంలో విశేషంగా పెట్టుబడులను రప్పిస్తున్న కెసిఆర్ ప్రభుత్వోద్యోగాల ఖాళీలను పూరిస్తూ ఇప్పటికి లక్షా 32 వేల నియామకాలు జరిపారు. బుధవారం నాడు ఒకే రోజు 91,142 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ల జారీ ప్రక్రియను శాసన సభా ముఖంగా ఆయన ప్రకటించడం ప్రతి ఒక్కరినీ ఆనందాశ్చర్యచకితులను చేసింది. ఇది దేశంలో బహుశా ఎన్నడూ, ఎక్కడా జరగని మహత్తర ఘట్టం. ఉద్యోగాల భర్తీలో స్థానికులకు విశేష ప్రాధాన్యం ఇవ్వాలనే దృష్టితో, మొక్కవోని దీక్షతో ముఖ్యమంత్రి సాగించిన కృషి చెప్పుకోదగినది. ఇందుకు అడ్డంకిగా వున్న రాష్ట్రపతి ఉత్తర్వుల (రాజ్యాంగం 371(డి) అధికరణ) సవరణ కోసం కేంద్ర ప్రభుత్వం వెంట పడి పడి ఆయన తీసుకు వచ్చిన వొత్తిడి చాలా కాలానికి గాని ఫలించలేదు. ముఖ్యమంత్రి స్వయంగా రాష్ట్రపతిని, ప్రధానిని కలిశారు. ఆ సవరణ వల్ల అటెండర్ నుండి ఆర్‌డివో వరకు అన్ని ఉద్యోగాల్లో 95 శాతం స్థానికులకు చెందేలా చేసుకున్నారు. అందుకోసం జోనల్ విధానాన్ని ఆవిష్కరించారు. గతంలోని రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం స్థానికులకు 80 శాతం ఉద్యోగాలు మాత్రమే లభించేవి. మిగతా 20 శాతం ఉద్యోగాలు స్థానికేతరులకు చెందేవి. సవరించిన ఉత్తర్వుల ప్రకారం 95 శాతం స్థానికులకు లభించబోవడం తెలంగాణ సాధన పరమాశయాన్ని ఫలింపజేసింది. ప్రకటించిన 91,142 ఖాళీల భర్తీలో 11,103 కాంట్రాక్టు ఉద్యోగాల క్రమబద్ధీకరణ కూడా భాగమే.

కాంట్రాక్టు ఉద్యోగులు తమ కొలువులను క్రమబద్ధం చేయాలని చిరకాలంగా డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం సానుకూలంగా వ్యవహరించి హైకోర్టు నుంచి అందుకు తగిన ఆదేశాలు తెచ్చుకొని ఆ మేరకు వారి ఉద్యోగాలను రెగ్యులర్ చేయడానికి నిర్ణయించింది. ఇక నుంచి కాంట్రాక్టు ఉద్యోగాలుండవని ముఖ్యమంత్రి ప్రకటించారు. కాంట్రాక్టు ఉద్యోగాల స్థానంలో శాశ్వత నియామకాలు పోగా నేరుగా భర్తీ చేస్తున్న ఉద్యోగాల సంఖ్య 80,039. ఇందులో గ్రూపు ఉద్యోగాలు కూడా వున్నాయి. గ్రూపు 1, 2 , 4 కలుపుకొని దాదాపు 11,000 ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. జిల్లాలు, జోన్లు, మల్టీజోన్‌లు, యూనివర్శిటీలు, సచివాలయ తదితర చోట్ల ఖాళీగా వున్న వేలాది ఉద్యోగాలకు నియామకాలు జరగనున్నాయి. ఈ ఉద్యోగాల భర్తీ ప్రకటనతో పాటు ముఖ్యమంత్రి కెసిఆర్ మరి కొన్ని ముఖ్యమైన వెసులుబాట్లను కూడా కలిగించారు. అందులో ప్రధానమైనది ఉద్యోగార్హత కనీస వయోపరిమితిని పెంచడం. ఒసిలకు ఈ వయసు 44 సంవత్సరాలకు గాను, ఎస్‌సి, ఎస్‌టి, బిసిలకు 49 గాను, దివ్యాంగులకు 54 గాను నిర్ణయించారు.

దీని వల్ల ప్రభుత్వోద్యోగాలపై ఆశలు వదులుకున్న మరెంతో మందికి అవకాశం కలుగుతుంది. అలాగే ఏటా ఉద్యోగ ఖాళీలను వాటి భర్తీ వ్యవధిని వెల్లడిస్తూ జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేస్తామని ముఖ్యమంత్రి చేసిన ప్రకటన ఎంతైనా హర్షించదగినది. చరిత్ర దానంతట అది నిర్మాణం కాదు, ఎందరో ఎంతో కృషి చేసి, ఎన్నో త్యాగాలు చేస్తేగాని అది ఆవిష్కృతం కాదు. ముఖ్యంగా పురోగామి చరిత్రకు నవ్యదృక్పథం కలిగిన నాయకత్వం అవసరం. అటువంటి అనితర సాధ్యమైన సారథ్యాన్ని అందించి ఒక దశలో ప్రాణ త్యాగానికి కూడా సిద్ధపడి కెసిఆర్ ఈ రాష్ట్రాన్ని అవతరింప చేశారు. దానిని అమితకాలంలో సర్వతోముఖంగా అభివృద్ధి పరుస్తూ విశేషమైన గుర్తింపును పొందుతున్నారు. ఈ రోజు ఒకేసారి దాదాపు లక్ష ఉద్యోగ నియామకాలకు బాటవేసి మరో చరిత్రను సృష్టించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News